Begin typing your search above and press return to search.

రూ.2 వేల నోటుపై కేంద్రం క్లారిటీ ఇచ్చేసిందబ్బా

By:  Tupaki Desk   |   27 Feb 2020 12:43 PM GMT
రూ.2 వేల నోటుపై కేంద్రం క్లారిటీ ఇచ్చేసిందబ్బా
X
ప్రదాన మంత్రిగా నరేంద్ర మోదీ పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత దేశ ఆర్థిక రంగంలో పలు సంచలన నిర్ణయాలు అమలయ్యాయి. ఇందులో భాగంగా రూ.వెయ్యి నోటు రద్దు కాగా.. మిగిలిన అన్ని నోట్లు కూడా రూపు మార్చేసుకున్నాయి. ఈ క్రమంలో కొత్తగా ఎంట్రీ ఇచ్చిన రూ.2వేల నోటుపై ఎప్పటికప్పుడు లెక్కలేనన్ని వార్తలు వస్తూనే ఉన్నాయి. రూ.2 వేల నోటును కూడా కేంద్ర ప్రభుత్వం రద్దు చేయబోతోందని, అందుకే ఆ నోటు ఇప్పుడు కనిపించడం తగ్గిందని కొత్తగా పుకార్లు షికారు చేస్తోంది. వారం పది రోజులుగా ఈ వార్త వైరల్ గానే మారిపోయింది. ఇలాంటి క్రమంతో గురువారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఓ సంచలన ప్రకటన చేశారు. రూ.2వేల నోటును రద్దు చేసే ప్రతిపాదనేదీ లేదని, ఈ నోటుపై ప్రస్తుతం జరుగుతున్న ప్రచారం అవాస్తమేనని ఆమె తేల్చి చెప్పేశారు. అంతేకాకుండా ఈ నోటు రద్దు అవుతుందంటూ వినిపిస్తున్న పుకార్లను ఏ ఒక్కరూ నమ్మవద్దని ఆమె సలహా ఇచ్చారు.

గురువారం వివిధ ప్రభుత్వ రంగ బ్యాంకులకు చెందిన ఉన్నతాధికారులతో నిర్మల సమావేశమయ్యారు. ఈ సందర్భంగానే ఆమె రూ.2 నోటు రద్దు అవుతుందంటూ వస్తున్న వార్తలపై స్పందించారు. రూ.2వేల నోట్ల జారీని నిలిపివేయాల్సిందిగా బ్యాంకులకు తాము ఎలాంటి ఆదేశాలివ్వలేదని నిర్మల స్పష్టం చేశారు. తనకు తెలిసినంతవరకు, బ్యాంకులకు అలాంటి సూచనలేమీ ఇవ్వలేదని తెలిపారు. రూ.2 వేల నోట్లు చట్టబద్ధంగా చలామణిలో వుంటాయని, ఈ విషయంలో ఎలాంటి భయాలు అవసరం లేదని, పుకార్లను నమ్మవద్దని ఆమె సూచించారు. సో.. రూ.2 వేల నోటు రద్దు అంటూ జరుగుతున్న ప్రచారం మొత్తం అవాస్తవమేని చెప్పక తప్పదు.