Begin typing your search above and press return to search.

కరోనా ఎఫెక్ట్ : ఊర్లోకి అంబులెన్స్ నో ఎంట్రీ ... అంబులెన్స్‌లో ప్రసవం !

By:  Tupaki Desk   |   11 May 2021 2:43 AM GMT
కరోనా ఎఫెక్ట్ : ఊర్లోకి అంబులెన్స్ నో ఎంట్రీ ... అంబులెన్స్‌లో ప్రసవం !
X
కరోనా వైరస్ మహమ్మారి మనుషుల్లో ఉండే అరకొర మానవత్వాన్ని కూడా తుడిచిపెట్టేస్తోంది. ప్రాణ భయంతో కొట్టుమిట్టాడుతూ మంచి ,చెడు అనే విషయాలని పూర్తిగా విస్మరిస్తున్నారు. కనీసం పక్కనే ప్రాణాలు పోతున్నా కూడా అటు వైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. విశాఖ జిల్లాలో తాజాగా జరిగిన ఓ ఘటనే ఇందుకు ఉదాహరణ. పురుటి నొప్పులతో అల్లాడుతున్న ఓ గర్భిణి కోసం వచ్చిన అంబులెన్స్‌ను సైతం ఊర్లోకి రాకుండా అడ్డుకున్నారు గ్రామస్తులు. దీనితో ఆమె హాస్పిటల్ లో ప్రసవం జరగాల్సింది , ఆ నిండు గర్భిణి అంబులెన్స్‌లోనే ప్రసవం జరిగింది.

ఈ ఘటన గురించి పూర్తి వివరాల్లోకి వెళ్తే .. విశాఖ ఏజెన్సీలోని జి.మాడుగుల మండలం పాల మామిడి గ్రామస్తులు, కరోనా మహమ్మారి భయంతో గ్రామంలోకి వేరే వాళ్లు రాకుండా సరిహద్దు వద్ద గేట్‌ ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో అదే గ్రామానికి చెందిన పాంగి లలిత అనే మహిళకు పురుటి నొప్పులు వచ్చాయి. కుటుంబ సభ్యులు కోరిన మేరకు అంబులెన్సు వచ్చింది. కానీ, గ్రామస్తులు గ్రామంలోకి అంబులెన్స్‌ రావడానికి ఒప్పుకోలేదు. ఇక చేసేదేమి లేక ఆ గర్భిణిని నడిపించుకుంటూ గ్రామ శివారులోని అంబులెన్స్ ఎక్కించారు. దీనితో అక్కడే ఆమెకు పురిటి నొప్పులు అధికం కావడంతో అంబులెన్స్‌ లోనే పురుడు పోశారు. లలిత పండంటి మగ శిశువుకు జన్మనిచ్చింది. దీంతో వారిద్దరినీ అంబులెన్స్‌లో జి.మాడుగుల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చేర్పించడంతో క్షేమంగానే ఉన్నారు. ప్రజలు కరోనా భయంతో అంబులెన్స్‌ ను గ్రామంలోకి అనుమతించకపోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కరోనా రాకుండా జాగ్రత్తలు తీసుకోవడం తప్పు కాదు అని , మంచి చెడు కొంచెం అలోచించి మెసులుకుంటే మనుషులం అని అనిపించుకుంటాం.