Begin typing your search above and press return to search.

టీడీపీ అల్లుడి గారికి అచ్చిరాని రాజ‌కీయం...!

By:  Tupaki Desk   |   30 Aug 2021 2:57 AM GMT
టీడీపీ అల్లుడి గారికి అచ్చిరాని రాజ‌కీయం...!
X
ఆయ‌న టీడీపీలో చ‌క్రం తిప్పిన మాజీ ఎంపీ, దివంగ‌త శివ‌ప్ర‌సాద్ అల్లుడు. గత 2019 ఎన్నిక‌ల‌కు ముందు.. రాజ‌కీయాల్లోకి వ‌చ్చారు. టీడీపీ త‌ర‌ఫున‌.. బాగానే ప‌నిచేస్తున్నారు. అయితే.. ఆ ఎన్నిక‌ల్లో తొలిసారే ఆయ‌న వైసీపికి చెందిన కీల‌క నాయ‌కుడు.. వ‌రుస విజ‌యాలు ద‌క్కించుకుంటున్న కోరుముట్ల శ్రీనివాస్‌పై పోటీ చేశారు. నిజానికి ఇది పెద్ద రిస్క్‌ అని అప్ప‌ట్లోనే వార్త‌లు వ‌చ్చాయి. ఎందుకంటే.. కోరుముట్ల కు త‌న నియోజ‌క‌వ‌ర్గంపై గ‌ట్టిప‌ట్టుంది. అంతేకాదు.. వరుస విజ‌యాలు సాధిస్తున్న ఆయ‌న్ను ప్ర‌భుత్వ వ్య‌తిరేక‌త ఉన్న‌ప్పుడు ఢీ కొట్ట‌డం క‌ష్టం కాద‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌య్యాయి. పైగా అది సీఎం జ‌గ‌న్ సొంత జిల్లా..!

అయితే.. ఈ విష‌యాల‌ను ప‌ట్టించుకోకుండా.. చంద్ర‌బాబు టికెట్ ఇచ్చారు చాలు! అన్న‌ట్టుగా క‌డ‌ప జిల్లా రైల్వో కోడూరు నుంచి గ‌త 2019 ఎన్నిక‌ల్లో బ‌రిలో దిగారు పంత‌గాని.. న‌ర‌సింహ‌ప్ర‌సాద్‌. అప్ప‌ట్లో ఆయ‌న త‌ర‌ఫున ఆయ‌న మామ‌.. దివంగత శివ‌ప్ర‌సాద్ కూడా ప్ర‌చారం చేశారు. అయితే.. అక్క‌డ ఓడిపోయారు. పోనీ.. ఓడిపోయినా.. గౌర‌వ‌ప్ర‌ద‌మైన ఓట్లు ద‌క్కించుకోలేక పోవ‌డం మ‌రో ఎఫెక్ట్‌. కేవ‌లం 43 వేల ఓట్లనే ఆయ‌న కైవ‌సం చేసుకున్నారు. దీంతో అస‌లు నియోజ‌క‌వ‌ర్గంలోనే కొన్నాళ్లు మౌనంగా ఉండిపోయారు. ఇక‌, ఆ త‌ర్వాత యాక్టివ్ అయినా.. రాష్ట్ర స్థాయిలో జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై చంద్ర‌బాబు చేస్తున్న ఉద్య‌మాల్లో పాల్గొంటున్నారు.

ఇప్పుడు.. చిత్తూరు లోక్‌స‌భ స్థానిపై దృష్టిపెట్టారు. గ‌తంలో ఇక్క‌డ నుంచి గెలిచిన ఆయ‌న మామ శివ‌ప్ర‌సాద్ మ‌ర‌ణించ‌డం.. ఇక్క‌డ పార్టీని న‌డిపించే నేత‌లు ఎవ్వ‌రూ లేక‌పోవ‌డంతో టీడీపీ అధినేత చంద్ర‌బాబుఇక్క‌డ త‌న‌కు టికెట్ ఇచ్చే అవ‌కాశం ఉంద‌ని.. న‌ర‌సింహ ప్ర‌సాద్ భావిస్తున్నారు.కానీ, క్షేత్ర‌స్థాయిలో మాత్రం ఆయ‌న ప‌ర్య‌టించ‌డం లేదు. అవ‌కాశం వ‌చ్చిన‌ప్పుడు ముఖానికి రంగేసుకుని.. గ‌తంలో శివ‌ప్ర‌సాద్ ప్ర‌జ‌ల‌ను ఆక‌ట్టుకున్న‌ట్టు ఈయ‌న కూడా చేయాల‌ని చూస్తున్నారు.

కానీ, ఇది వ‌ర్క‌వుట్ కావ‌డంలేదు. ఈ నేప‌థ్యంలో ఏం చేయాల‌నే విష‌యంపైపంత‌గాని త‌ర్జ‌న భ‌ర్జ‌న ప‌డుతున్నారు. మ‌రో రెండేళ్ల‌లో ఎన్నిక‌లు ఉన్నందున‌.. త‌న‌కు సీటు క‌న్ఫ‌ర్మ్ చేస్తే.. దూసుకుపోతాన‌ని అంటున్నారు. మ‌రి చంద్ర‌బాబు వ్యూహం ఏంటో చూడాలి. ఇప్ప‌టికైతే.. న‌ర‌సింహ‌ప్ర‌సాద్ చేస్తున్న రాజ‌కీయం.. ఆయ‌న‌కు పెద్ద‌గా క‌లిసి రావ‌డం లేద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.