Begin typing your search above and press return to search.

కేటీఆర్ పదిసార్లు తిరిగినా మోదీ పైసా కూడా విదల్చలేదట!

By:  Tupaki Desk   |   14 Sep 2019 4:34 PM GMT
కేటీఆర్ పదిసార్లు తిరిగినా మోదీ పైసా కూడా విదల్చలేదట!
X
కేసీఆర్ ప్రభుత్వం మొన్నటి బడ్జెట్‌తో మొదలుపెట్టిన కేంద్రంపై నెపం నెట్టేసే ధోరణి ఇంకా కంటిన్యూ చేస్తోంది. ప్రతిదానికీ కేంద్రమే కారణమంటూ సీఎం కేసీఆర్ ఇప్పటికే మొదలుపెట్టగా తాజాగా ఆయన కుమారుడు - మంత్రి కేటీఆర్ కూడా ఇవ్వాళ అసెంబ్లీ వేదికగా కేంద్రంపై నిందలేశారు. తెలంగాణలో ఐటీఐఆర్‌కు కేంద్ర ప్రభుత్వం ఒక్క పైసా కూడా ఇవ్వలేదన్నారు.

యూపీఏ-2 ప్రభుత్వం ఐటీఐఆర్ తీసుకొచ్చిందని ఆ తర్వాత వచ్చిన మోదీ ప్రభుత్వాన్ని అడిగితే అది తమ పాలసీ కాదంటున్నారని అన్నారు కేటీఆర్. సభలో ఐటీ రంగంపై ప్రశ్నోత్తరాల సందర్భంగా సభ్యులు అడిగిన ప్రశ్నలకు కేటీఆర్ వివరణ ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వాన్ని ఐటీఐఆర్ కోసం 10 సార్లు కలిసినా లాభం లేకపోయిందన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇవ్వకపోయినా ఐటీ రంగంలో తెలంగాణ 17 శాతం వృద్ధి సాధించిందన్నారు. హైదరాబాద్ నలుమూలలా ఐటీ కంపెనీలను విస్తరిస్తామన్నారు. ద్వితీయ శ్రేణి నగరాల్లో కూడా ఐటీఐఆర్ ను విస్తరింపచేయాల్సిన అవసరముందన్నారు కేటీఆర్. 2018-19 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలో ఐటీ ఎగుమతులు లక్ష 10 వేల కోట్లకు చేరాయన్నారు.

సభలో మూసీ నదిపైనా చర్చ జరిగింది. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. మురుగునీటి శుద్ధీకరణఖు 21 ప్లాంట్లు పనిచేస్తున్నాయని.. 2021 నాటికి వీటిని రెట్టింపు చేస్తామని స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో 54 శాతం డ్రైనేజీ మూసీలో కలుస్తోందన్నారు.

కాగా ఐటీఐఆర్‌ పై కేటీఆర్ స్పందించిన తీరుపై విపక్ష కాంగ్రెస్ మండిపడుతోంది. గత అయిదేళ్లుగా కేంద్రాన్ని ఎన్నిసార్లు కలిసినా నిధులివ్వకపోతే ఇంతకాలం ఏం చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు బీజేపీతో సంబంధాలు చెడిపోవడంతో బయటపెడుతున్నారా అని ఆ పార్టీ నేతలు ప్రశ్నిస్తున్నారు. కేంద్రంతో ఇంతకాలం లాలూచీ పడి రాష్ట్ర ప్రయోజనాలను పణంగా పెట్టారని ఆరోపిస్తున్నారు.