Begin typing your search above and press return to search.

మంత్రులు, ఎమ్మెల్యేలకు నో పిక్నిక్

By:  Tupaki Desk   |   4 Nov 2016 10:30 PM GMT
మంత్రులు, ఎమ్మెల్యేలకు నో పిక్నిక్
X
కార్తీక మాసమంటే శివపూజలొక్కటే కాదు.. వనభోజనాల సందడీ కనిపిస్తుంది. తోటలు - బీచ్ లు అన్నీ నిండిపోతాయి. విద్యార్థులు - ఉద్యోగులు - కాలనీల్లో ప్రజలు - అపార్టుమెంట్లలో ఉండేవారు.. ఇలా ఎవరికి వారు బృందాలుగా ఏర్పడి వనభోజనాలకు వెళ్లడం ఆనవాయితీగా వస్తోంది. అయితే.. ఇందులోనూ కులం లెక్కలు ఇప్పటికే వచ్చేశాయి. కుల సంఘాలు ప్రత్యేకంగా వనభోజనాలు ఏర్పాటు చేస్తున్నాయి. అలాంటి కార్యక్రమాలకు ఎమ్మెల్యేలు - ఎంపీలు - మంత్రులు - ఇతర నేతలను పిలిచి హడావుడి చేస్తున్నాయి. ఒక్కమాటలో చెప్పాలంటే కులసంఘాల వనభోజనాల కార్యక్రమాలు రాజకీయ కార్యక్రమాలుగా మారిపోతున్నాయి. నేతలను పిలిచి తమతమ కుల సంఘాలకు స్థలాలో - భవనాలో పొందడం ఒకెత్తయితే... తమ ప్రాబల్యం చూపించుకోవడం మరో ఎత్తు. కారణమేదైనా కులం అవసరం నేతలకు ఉంటుంది కాబట్టి పిలవగానే వారువచ్చి వాలిపోతారు.

అయితే... ఈసారి మాత్రం కుల సంఘాలు నిర్వహించే వనభోజనాల కార్యక్రమాలకు ఎట్టిపరిస్థితుల్లోనూ వెళ్లొద్దని ముఖ్యమంత్రి చంద్రబాబు తన పార్టీ మంత్రులు - ఎమ్మెల్యేలను ఆదేశించారట. అసలే టీడీపీ అంటే కమ్మవారి పార్టీ అన్న ముద్ర ఉందని.. అందులోనూ ఇప్పుడు ముద్రగడ పుణ్యమా అని కాపులు దూరమవుతున్నారని..ఇక బీసీ - ఎస్సీ ఓటు బ్యాంకు కోసం జగన్ కాపు కాసుకు కూచున్నాడని.. ఇలాంటి పరిస్థితుల్లో మనం ఏ ఒక్క కులానికో కొమ్ము కాస్తున్నామన్న అపప్రద రాకుండా అన్నిటికీ దూరంగా ఉందామని ఆయన పార్టీ నేతలకు సూచించినట్లు తెలుస్తోంది.

దీంతో మంత్రులు - ఎమ్మెల్యేలు కూడా ఏటా తమను పిలిచేవారికి దీనిపై సమాచారం అందించారట. మీరు వేరే గెస్టులను చూసుకోవాల్సిందేనని చెప్పేశారట. అంతేకాదు.. వన భోజనాలకు రావాలని ఎవరు ఫోన్ చేసినా, ఎవరు ఆహ్వానాలు పంపినా మాట ఇవ్వొద్దని.. ప్రోగ్రాం ఫిక్సు చేయొద్దని తమతమ వ్యక్తిగత సహాయకులకు కూడా ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. అయితే... కొందరు నేతలు మాత్రం దీనిపై అసంతృప్తి వ్యక్తంచేస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రవ్యాప్త ప్రయోజనాల కోసం చంద్రబాబు ఇలాంటి సూచనలు చసినా తమతమ నియోజకవర్గాల్లో మాత్రం కీలక వర్గాలు, సొంత సామాజిక వర్గాల నుంచి పిలుపు వస్తే కాదనడం ఎలా అంటున్నారు. అదితమకు నష్టం కలిగిస్తుందనీ చెబుతున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/