Begin typing your search above and press return to search.

పెళ్లి కాని ప్రసాద్ లు.. ఇక ఉగ్గబట్టుకోవాల్సిందే..

By:  Tupaki Desk   |   28 Jun 2019 8:05 AM GMT
పెళ్లి కాని ప్రసాద్ లు.. ఇక ఉగ్గబట్టుకోవాల్సిందే..
X
పెళ్లికాని ప్రసాద్ లు.. పెళ్లి చేసుకోబోయే అమ్మాయిలు ఇక తమ పెళ్లికళను ప్రస్తుతానికి వాయిదా వేసుకోవాల్సిందే.. ఒకటి కాదు.. రెండు కాదు నాలుగు నెలలు.. వచ్చే చలికాలం వరకు ఆగాల్సిందే.. అనూహ్యంగా వచ్చిన ఈ ఉపద్రవంతో ఈరోజు నుంచి ఏ ఇంట శుభకార్యాలు జరగకుండా పోతున్నాయి.

ఇన్నాళ్లు పల్లెల్లో ఏదో ఒక ఇంట వాయిద్యాలు మోగేవి. నాలుగు నెలలుగా మంచిరోజులు ఉండడంతో ఎక్కువ సంఖ్యలో పెళ్లిళ్లు- గృహ ప్రవేశాలు- పుట్టు వెంట్రుకలు- భూమి పూజలు.. ఇలా రకరకాల శుభ కార్యాలు జరిగాయి. అయితే నేటి ఉదయం 6 గంటలతో మంచిరోజులు- ముహూర్తాలు లేకుండా పోయాయి. దీంతో ఇక పెళ్లి కాని ప్రసాదులు, వివిధ శుభకార్యాలు చేసుకునే వారందరూ ఉగ్గబట్టుకొని ఉండాల్సిందే. అందుకే కదా కేసీఆర్ ఇంకా టైం ఉన్నా ఆదరబదరాగా అటు కాళేశ్వరం.. ఇటు సచివాలయం- అసెంబ్లీలకు అర్జంట్ గా ప్రారంభోత్సవాలు- భూమిపూజలు చేసేశారు.

జూలై 2న అమవాస్య.. జూలై 3 నుంచి ఆషాఢ మాసం ప్రారంభమవుతుంది. జూలై నుంచి అక్టోబర్ వరకు ఆషాఢ మాసం - శ్రావణ మాసం భాద్రపదం- ఆశ్వీయుజ మాసాలుంటాయి. ఈ మాసాల్లో ముహూర్తాలు లేవు. మౌఢ్యం కారణంగా ముహూర్తాలు లేవని.. అందుకే శుభకార్యాలకు విరామమని పండితులు చెబుతున్నారు. నవంబర్ 1 నుంచి కార్తీక మాసం ప్రారంభమవుతుండడంతో అప్పటి నుంచే ముహూర్తాలున్నాయి.

ఇలా నాలుగు మాసాల పాటు శుభకార్యాలకు విరామం వచ్చేసింది. దీంతో పెళ్లిళ్లు, ఇతర ఏ శుభకార్యం చేసుకునే మంచి ముహూర్తాలు లేవని పండితులు చెబుతున్నారు. ఎన్నడూ లేని విధంగా జేష్ట్య మాసంతోపాటు మూఢాలు రావడంతోనే ఇలా మంచి రోజులు పోయాయని.. అందరూ ఓపిక పట్టాల్సిందేనని చెబుతున్నారు.