Begin typing your search above and press return to search.

కుటుంబంలో న‌లుగురి కంటే ఎక్కువ ఉంటే ప్ర‌భుత్వ ప‌థ‌కాలు క‌ట్‌!

By:  Tupaki Desk   |   15 Oct 2022 7:30 AM GMT
కుటుంబంలో న‌లుగురి కంటే ఎక్కువ ఉంటే ప్ర‌భుత్వ ప‌థ‌కాలు క‌ట్‌!
X
మ‌న‌దేశం ఇప్ప‌టికే జ‌నాభా సంఖ్య‌లో ప్ర‌పంచంలో రెండో స్థానంలో ఉంది. 2030 నాటికి చైనాను అధిగ‌మించి భార‌త్ ప్ర‌పంచంలోనే తొలి స్థానంలో నిలుస్తుంద‌ని ఇప్ప‌టికే ప‌లు నివేదిక‌లు చెబుతున్నాయి. పెరుగుతున్న జ‌నాభాను నియంత్రించ‌డానికి కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు ఇప్ప‌టికే అనేక చ‌ర్య‌లు తీసుకుంటున్నాయి. అధిక జ‌నాభా పెరుగుద‌ల‌తో త‌లెత్తే ఇబ్బందుల‌ను వివ‌రిస్తున్నాయి. అయితే జ‌నాభా నియంత్ర‌ణ‌లో ప్ర‌భుత్వ చ‌ర్య‌లేవీ త‌ప్ప‌నిస‌రి కాక‌పోవ‌డంతో ప్ర‌జ‌లు కూడా వీటిని లైట్ తీసుకుంటున్నారు.

ఈ నేప‌థ్యంలో ఈశాన్య రాష్ట్ర‌మైన మ‌ణిపూర్ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. ఒక కుటుంబంలో న‌లుగురి కంటే ఎక్కువ సంతానం ఉంటే ప్ర‌భుత్వ ప్ర‌యోజ‌నాలు నిలిపేయాల‌ని నిర్ణ‌యించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి బీరెన్ సింగ్ నేతృత్వంలో జరిగిన మంత్రి మండ‌లి స‌మావేశం షాకింగ్‌ నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా ఈ స‌మావేశంలోనే మణిపూర్ రాష్ట్ర జనాభా కమిషన్‌ ఏర్పాటుకు ఆర్టినెన్స్ కూడా తీసుకురావ‌డం గ‌మ‌నార్హం.

మ‌ణిపూర్ జ‌నాభా క‌మిష‌న్ అమ‌ల్లోకి వస్తే.. ఒక జంటకు నలుగురు కంటే ఎక్కువ మంది పిల్లలు ఉంటే, ఆ కుటుంబంలోని ఏ ఒక్క సభ్యుడికీ ప్రభుత్వ ప్రయోజనాలు అందవు.

కాగా 2011 జనాభా లెక్కల ప్రకారం.. మ‌ణిపూర్‌ రాష్ట్ర జనాభా 28.56 లక్షలు. మరోవైపు మ‌ణిపూర్.. బంగ్లాదేశ్‌, మ‌య‌న్మార్ వంటి దేశాల‌కు సరిహ‌ద్దు రాష్ట్రం కావ‌డంతో బయటి వ్యక్తుల చొరబాట్లు ఎక్కువ‌య్యాయి.

ఇటీవ‌ల ఈ వ్య‌వ‌హారంపై బీజేపీ ఎమ్మెల్యే ఖుముక్చమ్ జోయ్‌కిసాన్ శాస‌న స‌భ‌లో తీర్మానం ప్ర‌వేశం పెట్టారు. ఈ సంద‌ర్భంగా మ‌ణిపూర్ జ‌నాభా గ‌ణాంకాల‌ను సభ‌కు వివ‌రించారు. మ‌ణిపూర్‌లో 1971-2001 మధ్య జనాభా వృద్ధి 153.3 శాతం ఉండగా.. 2001-2011లో అది 250 శాతమని తెలిపారు. ఈ నేప‌థ్యంలో జ‌నాభా నియంత్ర‌ణ‌కు చ‌ర్య‌లు తీసుకోవాల్సిన అవ‌స‌ర‌ముందన్నారు.

కాగా బీజేపీ అధికారంలో ఉన్న అసోం రాష్ట్రం కూడా ఇదే తరహా ఆదేశాలు జారీ చేసింది. 2021న లేదా ఆ తర్వాత ఒకటి లేదా అంతకంటే ఎక్కువ మంది భాగస్వాములు ద్వారా ఇద్దరు కంటే ఎక్కువ మంది సంతానం కలిగి ఉంటే.. ప్రభుత్వ ఉద్యోగం పొందేందుకు కుద‌ర‌ద‌ని అసోం ప్ర‌భుత్వం సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. ఇప్పుడు అసోం బాట‌లోనే మ‌ణిపూర్ ప్ర‌భుత్వం ప్ర‌భుత్వ ప్ర‌యోజ‌నాల‌ను అడ్డుగా పెట్టి జ‌నాభా నియంత్ర‌ణ‌కు చ‌ర్య‌లు తీసుకుంటోంది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.