Begin typing your search above and press return to search.

ప‌గ‌లు పోయాయ్‌.. మాటలు కలిశాయ్‌

By:  Tupaki Desk   |   21 March 2019 2:16 AM GMT
ప‌గ‌లు పోయాయ్‌.. మాటలు కలిశాయ్‌
X
దశాబ్దాల వైరం... ఎన్నిక‌ల పుణ్యంతో - అధికార దాహంతో మాయ‌మైపోయింది. ప‌రోక్షంగానో - ప్ర‌త్య‌క్షంగానో వారి గొడ‌వ‌ల‌ వ‌ల్ల చాలా ఘోరాలు జ‌రిగాయి. ఎంతో మంది ఆస్తులు పోగొట్టుకున్నారు. అంత‌కుమించి విలువైన త‌మ జీవితాల‌ను నాశ‌నం చేసుకున్నారు. కానీ కాలం అన్నిటికీ ప‌రిష్కారాలు వెతికిపెడుతుంది. అందుకే వైరాలు పోయాయి. స్నేహాలు మొలిచాయి.

ఎప్ప‌ట్నుంచో ప్ర‌త్య‌ర్థులుగా ఉన్న కుటుంబాలను ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఏకం చేశారు. స‌రే ఆయ‌న ఇంట్లో ఉన్న వైరాల‌ను (ఉదా. పురంధేశ్వ‌రి) క‌లుపులేక‌పోయారు గానీ చారిత్ర‌క ప్ర‌త్య‌ర్థుల‌ను ఏకం చేసిన ఘ‌న‌త ద‌క్కించుకున్నారు. మూడు కుటుంబాలు 2019 ఎన్నికల్లో ఒకే పార్టీ కోసం బరిలోగి దిగుతున్నాయి. ఒకరి ప్రచారం కోసం మరొకరు రంగంలోగి దిగుతున్నారు. ఆ రెండు కుటుంబాలు మరేవో కావు.. జేసీ-పరిటాల - వంగవీటి-దేవినేని - కేఈ-కోట్ల కుటుంబాలు.

అనంతతపురం జిల్లాలో పరిటాల రవి - జేసీ దివాకర్‌ రెడ్డి కుటుంబాల మధ్య తీవ్రమైన గొడ‌వ‌లు ఉన్నాయి. ప‌రిటాల ర‌విదే చాలా కాలం పైచేయి న‌డిచినా... ఒక‌రి వ‌ర్గాన్ని ఒక‌రు ఎంతో కొంత దెబ్బ‌తీసుకున్నారు. ఇక‌ రాజకీయ వైరుధ్యాల సంగతి అందరికి తెలిసిందే. పరిటాల రవి కుటుంబం మొదటి నుంచి టీడీపీలోనే ఉంది. ప‌రిటాల ర‌వి హ‌త్య స‌మ‌యంలో ప‌రిటాల సునీత జేసీపై కూడా ఆరోప‌ణ‌లు చేశారు. ఆయన చనిపోయిన తర్వాత.. పరిటాల రవి భార్య సునీత రాప్తాడు నుంచి గెలిచారు. 2014లో తెదేపా అధికారంలోకి వచ్చాక మంత్రి కూడా అయ్యారు. రాష్ట్ర విభజన తర్వాత జేసీ కుటుంబం టీడీపీలోకి రాక తప్పలేదు. 2014 ఎన్నికల్లో జేసీ దివాకర్‌ రెడ్డి అనంతపురం లోక్‌ సభ స్థానానికి - ఆయన సోదరుడు ప్రభాకర్‌ రెడ్డి తాడిపత్రి అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి గెలిచారు. ఇప్పటికి పరిటాల - జేసీ కుటుంబాల మధ్య అంత సయోధ్య లేకపోయినా... రాజకీయంగా ఒకే పార్టీలో కొనసాగుతున్నారు. ఇప్పుడు వారి వారసులు రంగంలోగి దిగుతున్నారు. రాప్తాడు నుంచి పరిటాల శ్రీరామ్‌ పోటీ చేస్తుండగా.. అనంతపురం ఎంపీ అభ్యర్థిగా జేసీ కుమారుడు జేసీ పవన్‌ బరిలో ఉన్నాడు. అనంతపురం పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలోకే రాప్తాడు కూడా వస్తుంది. దీంతో.. ఇప్పుడు వీరిద్దరూ కలిసి పనిచేస్తున్నారు. మొన్నటికి మొన్న చంద్రబాబునాయుడు అనంతపురం టూర్‌ ని సక్కెస్‌ చేయడానికి వీళ్లిద్దరే కలిసి పనిచేశారు. సో.. వారసులు కలిసిపోవడంతో... సీమలో శాంతి మ‌రింత వ‌ర్దిల్లుతుంద‌ని అనుకోవ‌చ్చు.

ఇక విజయవాడలో కొన్ని దశాబ్దాలుగా బద్ధ శత్రువులుగా ఉన్న వంగవీటి - దేవినేని కుటుంబాలు ఇప్పుడు తెదేపాలోకి వచ్చాయి. గతంలో వంగవీటి రంగా కాంగ్రెస్‌ లో ఉండేవారు. దేవినేని నెహ్రూ మొదట్లో టీడీపీ.. తర్వాత కాంగ్రెస్‌లోకి వెళ్లి.. తిరిగి టీడీపీలోకి వచ్చారు. ఇటీవలే నెహ్రూ మరణించారు. ప్రస్తుతం రంగా - నెహ్రూ వారసులిద్దరూ టీడీపీలోనే ఉన్నారు. రంగా కుమారుడు రాధాకృష్ణ మొదట కాంగ్రెస్‌ లోనూ.. తర్వాత ప్రజారాజ్యం - వైసీపీలో కొనసాగి రెండు వారాల క్రితం టీడీపీలో చేరారు. మరోవైపు దేవినేని నెహ్రూ కుమారుడు అవినాష్‌ తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతూ గుడివాడ నుంచి పోటీ చేయనున్నారు. వంగవీటి రాధా మాత్రం ఎక్కడనుంచి పోటీ చేయకపోయినా.. టీడీపీ స్టార్‌ క్యాంపెయినర్‌ గా రంగంలోగి దిగారు. దీంతో.. ఇప్పుడు దేవినేని అవినాష్‌ కోసం - అలాగే టీడీపీ కోసం రాధా ఎన్నికల ప్రచారం కూడా నిర్వహిస్తున్నాడు. సో.. బెజవాడలో రంగా - నెహ్రూల కాలంలో మొదలైన వర్గ వైషమ్యాలు కూడా ఇప్పుడు దాదాపుగా ఎండ్‌ కు వచ్చేసినట్లే.

ఇపుడు క‌ర్నూలులోనూ ఇదే ప‌రిస్థితి. కోట్ల కుటుంబం - కేఈ కుటుంబం క‌లిసి ప‌నిచేస్తున్నాయి. ఈ మేర‌కు వారు బ‌హిరంగ ప్ర‌క‌ట‌న‌లు కూడా చేశారు. మొత్తానికి ఈ చారిత్ర‌క శ‌త్రువులు వైరాల‌ను పక్క‌న‌పెట్టేయ‌డం రాజ‌కీయాల్లో కొత్త మార్పు అనే చెప్పుకోవాలి.