Begin typing your search above and press return to search.

దేశాధ్యక్షురాలు షేక్ హ్యాండ్ ఇస్తుంటే నో చెప్పేశాడు

By:  Tupaki Desk   |   4 March 2020 4:38 AM GMT
దేశాధ్యక్షురాలు షేక్ హ్యాండ్ ఇస్తుంటే నో చెప్పేశాడు
X
కొవిడ్ 19 వైరస్ కొత్త రూల్స్ ను తెచ్చేసింది. మర్యాదల్ని వదిలేయటమే కాదు మొహమాటాల్ని పక్కన పెట్టేసేలా చేస్తోంది. వైరల్ గా మారిన తాజా వీడియోనే ఇందుకు నిదర్శనం. దేశాధ్యక్షురాలు స్వయంగా దగ్గరకు వచ్చిన షేక్ హ్యాండ్ ఇస్తే.. కాదనే సాహసం చేస్తారా? కానీ.. అలా చేసేలా చేసింది కొవిడ్. చైనాలో మొదలై.. ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలకు పాకి ‘షేక్’ చేస్తున్న ఈ మాయదారి వైరస్ పుణ్యమా అని ఊహించటానికి వీల్లేని కొత్త సీన్లు తెర మీదకు వస్తున్నాయి.

అంతకంతకూ పెరుగుతున్న కొవిడ్ ముప్పుతో కొత్త అలవాట్లకు శ్రీకారం చుడుతున్నారు. ఇప్పటి వరకూ కలుసుకున్నంతనే కరచాలనం.. ఆత్మీయ హగ్గుల్ని పక్కన పెట్టేస్తున్నారు. కాస్త దూరంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎదుటి వ్యక్తి ఎంతటివారలైనా సరే.. ఈ రూల్ ను పక్కాగా ఫాలో అవుతున్న వైనం ఇప్పుడు పెరుగుతోంది. దీనికి నిదర్శనం తాజాగా వైరల్ అవుతున్న వీడియో గా చెప్పేయొచ్చు.

జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్ నిన్నటి రోజున (మంగళవారం) బెర్లిన్ లోని ఒక సదస్సుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా తన కేబినెట్ లోని మంత్రి హార్స్ట్ సీహోఫర్‌ను చూసి.. గౌరవంతో దగ్గరకు వెళ్లి షేక్ హ్యాండ్ ఇస్తూ చేయి ముందుకు చాచారు. దేశాధ్యక్షురాలు స్వయంగా దగ్గరకు వచ్చి షేక్ హ్యాండ్ ఇస్తున్నంతనే రియాక్ట్ కావటం మామూలే. అందుకు భిన్నంగా నవ్విన ఆయన.. షేక్ హ్యాండ్ అక్కర్లేదన్నట్లు గా వ్యవహరించారు.

కొవిడ్ వైరస్ ను గుర్తు చేసుకున్న ఆమె.. ఫర్లేదంటూ చేతిని గాల్లో ఊపి ‘ఇట్స్ ఓకే’ అన్న సంకేతాన్ని ఇచ్చి తన సీట్లోకి వెళ్లి కూర్చున్న చిట్టి వీడియో వైరల్ గా మారింది. ఎదుట ఉన్నది దేశాధ్యక్షురాలైనప్పటికీ.. కొవిడ్ వైరస్ కు చెక్ పెట్టేందుకు ఇలాంటి ముందస్తు జాగ్రత్తలు చాలా అవసరమన్న మాట సర్వత్రా వినిపిస్తోంది. ఈ వీడియోనూ షేర్ చేస్తూ.. దేశీయ నమస్తేను ఫాలో కావాలన్న సందేశాన్ని పలువురు ఇస్తుండటం గమనార్హం.