Begin typing your search above and press return to search.

యువ‌రాజును త‌క్కువ‌గా అంచ‌నా వేయ‌కండి

By:  Tupaki Desk   |   18 Dec 2017 6:18 AM GMT
యువ‌రాజును త‌క్కువ‌గా అంచ‌నా వేయ‌కండి
X
స్నేహానికి నిలువెత్త నిద‌ర్శ‌నంగా నిలుస్తుంది శివ‌సేన పార్టీ. బీజేపీకి మొద‌ట్నించి మిత్రుడిగా ఉన్న ఈ పార్టీ.. క్లిష్ట ప‌రిస్థితుల్లోనూ మిత్ర‌ధ‌ర్మాన్ని కొన‌సాగిస్తూ బీజేపీకి అండ‌గా నిలిచింది. స‌మ‌కాలీన రాజ‌కీయాల్లో మిత్ర‌ధ‌ర్మం ఎలా ఉంటుందో ప్ర‌త్యేకించి చెప్పాల్సిన అవ‌స‌రం ఉండ‌దు. అలాంటిది సుదీర్ఘ‌కాలంగా ఎలాంటి ప‌రిస్థితులు ఎదురైనా బీజేపీకి అండ‌గా నిలిచిన శివ‌సేన‌.. మోడీ హ‌యాంలో మొద‌లైన త‌ర్వాత ఈ రెండు పార్టీల మ‌ధ్య గ్యాప్ రావ‌టం తెలిసిందే.

మిత్రుడిగా వ్య‌వ‌హ‌రిస్తూనే.. అవ‌కాశం వ‌చ్చిన ప్ర‌తిసారీ పిన్నీసుతో గుచ్చిన‌ట్లుగా మాట్లాడే శివ‌సేన అధినేత‌.. తాజాగా వ‌చ్చిన అవ‌కాశాన్ని ఏ మాత్రం మిస్ కాలేదు. రెండు ద‌శాబ్దాల‌కు పైగా గుజ‌రాత్ లో న‌డిచిన బీజేపీ హ‌వాకు బ్రేకులు వేస్తున్న‌ట్లుగా వ‌చ్చిన ఫ‌లితాల‌పై త‌న‌దైన శైలిలో రియాక్ట్ అయ్యారు శివ‌సేన అధినేత ఉద్ద‌వ్ ఠాక్రే.

ముందుగా అనుకున్న అంచ‌నాల‌కు భిన్నంగా.. మేజిక్ మార్క్‌ కు కాస్త ఎక్కువ అధిక్య‌త ల‌భించ‌టంపై ఉద్ద‌వ్ స్పందించారు. దేశంలో రాహుల్ శ‌కం మొద‌లైంద‌న్నారు. గుజ‌రాత్ ఎన్నిక‌లు వార్ వ‌న్ సైడ్ కాద‌ని.. కాంగ్రెస్‌ ను త‌క్కువ‌గా అంచ‌నా వేయొద్ద‌న్న విష‌యాన్ని వెల్ల‌డించేలా గుజ‌రాతీల తీర్పు ఉన్న నేప‌థ్యంలో యువ‌రాజు రాహుల్‌ పై ఉద్ద‌వ్ ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించారు.

గుజ‌రాత్ ఎన్నిక‌ల ఫ‌లితం ఎలా ఉన్నా కాంగ్రెస్ బాధ్య‌త‌లు మోయ‌టంలో రాహుల్ ప‌రిపూర్ణ‌త సాధించార‌న్నారు. కాంగ్రెస్ భారం మొత్తం ఇప్పుడు రాహుల్ మీద‌నే ఉంద‌న్నారు. బీజేపీకి ఎదురొడ్డి నిలిచే నేత రాహుల్ గాంధీనేన‌న్న ఆయ‌న‌.. రాహుల్ గాంధీని ఎవ‌రూ త‌క్కువ‌గా అంచ‌నా వేయ‌కూడ‌ద‌న్నారు. యుద్ధ‌భూమిలో రాహుల్ ఎదురొడ్డి నిలిచార‌ని.. ఆయ‌న మీద ఆయ‌న‌కున్న విశ్వాస‌మే కాంగ్రెస్ ను ముందుకు తీసుకెళుతుంద‌న్నారు.

రాహుల్ గాంధీని విమ‌ర్శించ‌టం మీద దృష్టి త‌గ్గించి.. ప్ర‌జా స‌మ‌స్య‌ల మీదా.. పాల‌న మీద దృష్టి పెడితే మంచిద‌న్న అభిప్రాయాన్ని వ్య‌క్తం చేశారు. మామూలుగా ఉద్ద‌వ్ మాట‌ల్ని లైట్ తీసుకునే మోడీ అండ్ కోకు.. తాజా ప‌రిణామాల్లో మాత్రం ఇబ్బందిక‌ర ప‌రిస్థితి ఖాయ‌మ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.