Begin typing your search above and press return to search.

ఇక.. ఆ రాష్ట్రంలో హెల్మెట్ లేకుంటే నో పెట్రోల్

By:  Tupaki Desk   |   30 Jun 2016 4:30 AM GMT
ఇక.. ఆ రాష్ట్రంలో హెల్మెట్ లేకుంటే నో పెట్రోల్
X
రోడ్డు ప్రమాదాలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. ఈ ప్రమాదాల్లో ఆందోళన కలిగించే అంశం..టూవీలర్స్ నడిపే వారే ఎక్కువగా ప్రమాదానికి గురి కావటం.. మరణాలు ఎక్కువ సంభవించటం కూడా వీరే ఎక్కువగా ఉన్న అంశం పలు అధ్యయనాల్లో స్పష్టమైంది. రోడ్డు భద్రతపై కేంద్రం సీరియస్ గా దృష్టి సారించిన వేళ.. ప్రమాదాలను తగ్గించే దిశగా అనేక చర్యల్ని చేపడుతోంది. ఇందులో భాగంగా కొన్ని రాష్ట్రాలు ఇప్పటికే ఒక కీలక నిర్ణయాన్ని తీసుకున్నాయి.

హెల్మెట్ లేకుండా పెట్రోల్ కొట్టించుకోవటానికి పెట్రోల్ బంకుల వద్దకు వచ్చే వారికి పెట్రోల్ పోసేందుకు నిరాకరించటం. హెల్మెట్ లేకుండా వచ్చే వారికి పెట్రోల్ ఇవ్వకుండా ఉండే రూల్ ని పాటించాలని తాజాగా కేరళ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయానికి సంబంధించి ఇప్పటికే పెట్రోల్ బంకు యజమానులతో ప్రభుత్వం చర్చలు జరిపాయి. ప్రభుత్వ నిర్ణయాన్నితాము అమలు చేస్తామని వారంతా స్పష్టం చేశారు.

హెల్మెట్ లేకుండా టూవీలర్ మీద వచ్చే వారికి పెట్రోల్ పోసేందుకు నిరాకరించాలన్న నిర్ణయాన్ని ఆయిల్ కంపెనీలకు కూడా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కేరళలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో 50 శాతం టూవీలర్ నడిపేవారైతే.. వీరిలో 80 శాతం మంది హెల్మెట్ లేని కారణంగా తలకు తీవ్రమైన దెబ్బలు తగిలి మరణిస్తున్నారు. హెల్మెట్ తప్పనిసరిగా అమలు చేసిన నేపథ్యంలో ప్రమాదాల్ని కంట్రోల్ చేసే విషయాన్ని పక్కన పెడితే.. తలకు తీవ్రంగా గాయాలు కావటం వల్ల మృతి చెందే వారి సంఖ్య తగ్గే అవకాశం ఉందని చెప్పొచ్చు. రోడ్డు ప్రమాదాలు అత్యధికంగా జరిగే ఏపీలోనూ వెంటనే ఈ తరహా చట్టాన్ని అమలు చేయాల్సిన అవసరం ఉంది. ఈ తరహా నిర్ణయం అమలు చేయటం అంటే.. ప్రజల ప్రాణాలకు ముప్పు కలిగించే పరిస్థితులకు దూరం చేయటమేనని చెప్పొచ్చు. అందుకే తెలంగాణ రాష్ట్ర సర్కారు కూడా ఈ తరహా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పొచ్చు.