Begin typing your search above and press return to search.

బీజేపీ నుంచా.. వామ్మో పోటీచేయలేం..

By:  Tupaki Desk   |   3 March 2019 5:12 AM GMT
బీజేపీ నుంచా.. వామ్మో పోటీచేయలేం..
X
ఏపీలో బీజేపీ పరిస్థితి అటూ ఇటూ కాకుండా పోతోంది. విభజన సమయంలో కాంగ్రెస్‌ సీన్‌ ఏంటో ఇప్పుడు బీజేపీ పరిస్థితి అలాగే మారింది. విభజన సమయంలో ఆనాడు కాంగ్రెస్‌ పరిస్థితి ఇలాగే ఉంది. సీనియర్‌ నేతల నుంచి చోటా,మోటా నాయకులంతా ఇతర పార్టీల వైపు వెళ్లాల్సిన పరిస్థితి ఉండేది. అయితే ఉన్నవారికి ఎక్కడా అవకాశం రాకపోవడంతో ఆందోళన చెందారు. ఆ సమయంలో ఏపీలో ఉనికి కూడా లేని బీజేపీ 4 అసెంబ్లీ, 2 లోక్‌ సభ స్థానాలను గెలుచుకుంది. కాంగ్రెస్‌ మాత్రం డిపాజిట్లు కోల్పోయి చావుదెబ్బ తింది.

2014లో ఏపీలో కాస్త పట్టునిలుపుకున్న బీజేపీకి ఈసారి మాత్రం సీన్‌ రివర్స్‌ కానుంది. ప్రత్యేక హోదా అంటూ గెలిచిన ఆ పార్టీకి ఆ తరువాత హోదా లేదు ప్రత్యేక ప్యాకేజీయే అంటూ చెప్పుకొచ్చింది. కనీసం అది కూడా ఇవ్వకపోవడంతో ఏడాది నుంచి ఏపీలో బీజేపీ తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటోంది. చివరికి పొత్తు ఉన్న టీడీపీ కూడా బీజేపీతో తెగదెంపులు చేసుకుంది. ఆ తరువాత బీజేపీ పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. ఈ నేపథ్యంలో పార్టీ కేడర్‌ లో ధైర్యం నింపే దిశగా బీజేపీ ప్రయత్నం చేస్తోంది.

ఇందులో భాగంగా పార్టీ అధ్యక్షుడు అమిత్‌ షా ఒకటికి రెండుసార్లు ఏపీకి వచ్చారు. అలాగే మోదీ కూడా ఫిబ్రవరిలో గుంటూరుకు వచ్చి చంద్రబాబును టార్గెట్‌ చేశారు. నెలరోజుల్లోనే మరోసారి ఏపీకి ఇటీవలే వచ్చారు మోదీ. అంతకుముందు రైల్వే జోన్‌ ప్రకటించి మరో వివాదాన్ని తెరలేపారు. వాల్తేరు డివిజన్‌ లో మెజారిటీ భాగాన్ని రాయ్‌ ఘట్‌ కు తరలించి ఉత్తరాంధ్ర ప్రజల ఆగ్రహానికి గురయ్యారు.

ఇలా బీజేపీ ఎన్ని ప్లాన్లు వేసినా చివరకు ఏపీలో వ్యతిరేకతే వస్తోంది. మోదీ వచ్చిన పార్టీ నాయకుల్లో ధీమా రావడం లేదు. ఇటీవలే ఎమ్మెల్యే సత్యనారాయణ పార్టీకి గుడ్‌ బై చెప్పారు. బీజేపీ సీనియర్‌ నాయకురాలు ఫురందేశ్వరి కుమారుడిని వైసీపీలోకి పంపారు. అలాగే మరో నేత కావూరి సాంబశివరావు ఏ పార్టీలోకి వెళ్లాలా..? అని ఆలోచిస్తున్నారు.

ఇప్పుడున్న పరిస్థితుల్లో బీజేపీకి డిపాజిట్లయినా వస్తాయా..? అన్న అనుమానాలున్నాయి. అదే సమయంలో ఒక్కసీటయినా గెలుస్తామా..? అన్న ధీమా పార్టీ నేతల్లో కనిపించడం లేదు. దీంతో చాలా మంది బీజేపీ నుంచి పోటీకి ముందుకు రావడం లేదని తెలుస్తోంది. ఈ పరిస్థితుల్లో మోడీ వచ్చినా పార్టీకి లోకల్‌ గా సపోర్టు లేనంతకాలం కష్టమేనంటున్నారు విశ్లేషకులు.