Begin typing your search above and press return to search.

ఆంధ్రోళ్ల మీద మోడీకి కోప‌మెంతో బ‌డ్జెట్ చెప్పేస్తుందా?

By:  Tupaki Desk   |   5 July 2019 11:36 AM GMT
ఆంధ్రోళ్ల మీద మోడీకి కోప‌మెంతో బ‌డ్జెట్ చెప్పేస్తుందా?
X
ప్ర‌ధాని మోడీ నేతృత్వంలోని కేంద్ర‌ప్ర‌భుత్వం ప్ర‌వేశ పెట్టిన బ‌డ్జెట్ మీద చాలానే ఆశ‌లు పెట్టుకున్నారు ఆంధ్రోళ్లు. మోడీతో చంద్ర‌బాబు పెట్టుకున్న పంచాయితీ కార‌ణంగా గ‌డిచిన రెండు బ‌డ్జెట్ ల‌లో ఏపీకి ఎలాంటి ప్ర‌యోజ‌నం జ‌ర‌గ‌లేదు. ఈ నేప‌థ్యంలో ఏపీలో ఏర్ప‌డిన కొత్త ప్ర‌భుత్వానికి కాస్తంత అయినా చేయూత ఇచ్చేలా తాజా బ‌డ్జెట్ ఉంటుంద‌ని భావించారు.

అయితే.. ఏపీ మీద త‌న‌కు ఎలాంటి ఆస‌క్తి లేద‌న్న విష‌యం తాజా బ‌డ్జెట్ చెప్పేసింద‌ని చెప్పాలి. ఏపీకి ఒక్క పైసా కూడా కేటాయించ‌ని కేంద్ర బ‌డ్జెట్ ను చూసిన‌ప్పుడు మోడీని ఆంధ్రోళ్లు ఏ మాత్రం న‌మ్మాల్సిన అవ‌స‌రం లేద‌న్న విష‌యం తాజా బ‌డ్జెట్ స్ప‌ష్టం చేసింద‌ని చెప్పక త‌ప్ప‌దు. కేంద్రం మీద చంద్ర‌బాబు యుద్ధాన్ని ప్ర‌క‌టించిన నేప‌థ్యంలో ఏపీకి ఎలాంటి ప్రాధాన్య‌త ఇవ్వ‌కుండా.. కేటాయింపుల్లో మోడీ క‌ర‌కుగా వ్య‌వ‌హ‌రించార‌న్న పేరు ఉంది. బాబు కార‌ణంగా ఏపీ న‌ష్ట‌పోయింద‌న్న భావ‌న ప‌లువురిలో ఉంది.

కానీ.. కొత్త ప్ర‌భుత్వానికి తాను ఎలాంటి స‌హ‌కారం అందించ‌న‌న్న విష‌యాన్నితాజా బ‌డ్జెట్ స్ప‌ష్టం చేసింద‌ని చెప్పాలి. విభ‌జ‌న సంద‌ర్భంగా ఇవ్వాల్సిన ఏ విష‌యంలోనూ కేంద్రం క‌నిక‌రించ‌లేదు. ఆర్థిక లోటుతో కొట్టుమిట్టాడుతున్న వేళ‌.. ఏపీలోని సెంట్ర‌ల్ వ‌ర్సిటీకి.. ఏపీ ట్రైబ‌ల్ వ‌ర్సిటీకి నిధులు కేటాయిస్తాన‌ని హామీ ఇచ్చింది. ఇవే కాదు.. ఐఐటీ.. ఐఐఎం.. నిట్.. ఐఐఎస్ఈఆర్.. ట్రిపుల్ ఐటీల‌కు సైతం ఒక్క‌పైసా కూడా బ‌డ్జెట్ లో కేటాయింపులు జ‌ర‌ప‌లేదు. దీంతో.. వీటి నిర్వ‌హ‌ణ మొత్తం ఏపీ ప్ర‌భుత్వం మీద‌నే ప‌డ‌నుంది.

అస‌లే ఆర్థిక క‌ష్టాల‌తో ఉన్న ఏపీ ప్ర‌భుత్వానికి.. తాజా బ‌డ్జెట్ తో ఎలాంటి మేలు జ‌ర‌గ‌క‌పోగా.. మ‌రింత ఇబ్బందికి గురి చేసేలా ఉంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. ఇదంతా చూస్తే.. ఆంధ్రోళ్లంటే ప్ర‌ధాని మోడీకి ఎందుకంత కోపం అన్న సామాన్యుడి ప్ర‌శ్న‌కు స‌మాధానం దొర‌క‌ని ప‌రిస్థితి. తాజా బ‌డ్జెట్ చూసిన త‌ర్వాత మోడీని ఆంధ్రోళ్లు ఎప్ప‌టికి న‌మ్మ‌కూడ‌ద‌న్న విష‌యం ఫ్రూవ్ అయ్యింద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.