Begin typing your search above and press return to search.

అయ్యో అఖిలా.. ప‌ట్టించుకునేవారేరీ..?

By:  Tupaki Desk   |   20 Sep 2021 2:42 AM GMT
అయ్యో అఖిలా.. ప‌ట్టించుకునేవారేరీ..?
X
పూలు అమ్మిన చోటే క‌ట్టెలు అమ్మ‌డం అంటే.. ఏంటో ఆ మాజీ మంత్రికి తెలిసి వ‌స్తోంద‌ట‌. నిన్న మొన్న‌టి వ‌రకు ఇంటి నుంచి బ‌య‌టకు వ‌స్తే.. రెడ్ కార్పెట్ స్వాగ‌తాలు.. మందీ మార్బ‌లాలు.. అంత‌కు మించి.. సొంత కుటుంబ స‌భ్యుల నుంచి కూడా భారీ ఎత్తున గౌర‌వ మ‌ర్యాద‌లు.. దీంతో ఓ రేంజ్‌లో పాలిటిక్స్ చేశారు.. మాజీ మంత్రి. కానీ, ఇప్పుడు ఇవ‌న్నీ తిర‌గ‌బ‌డ్డాయి. మాట్లాడ‌దామ‌న్నా.. మ‌నుషులు క‌నిపించ‌డం లేదు.. రాజ‌కీయాల‌పై చ‌ర్చ‌లు చేద్దామ‌న్నా క‌లుపుకొనిపోయే నాయ‌కులు క‌రువ‌య్యారు. దీంతో ఇప్పుడు కింక‌ర్త‌వ్యం ? అంటూ.. ఆ మాజీ మంత్రి వ‌ర్యులు త‌ల ప‌ట్టుకున్నారు.

ఇంత‌కీ ఆ మాజీ మంత్రి ఎవ‌రో కాదు. అతి పిన్న వ‌య‌సులోనే మంత్రి అయినా.. సీనియ‌ర్ రాజ‌కీయ కుటుంబం నుంచి వ‌చ్చిన భూమా నాగిరెడ్డి గారాల ప‌ట్టి భూమా అఖిల ప్రియ‌. క‌ర్నూలులోని ఆళ్ల‌గ‌డ్డ నియోజ‌క‌వ‌ర్గాన్ని అమ్మ‌గా.. నంద్యాల నియోజ‌క‌వ‌ర్గాన్ని నాన్న‌గా పేర్కొంటూ గ‌త చంద్ర‌బాబు హ‌యాంలో దూకుడు చూపించిన అఖిల‌.. గ‌త ఎన్నిక‌ల త‌ర్వాత కూడా అదే దూకుడు కొన‌సాగించారు. పార్టీ ప‌రంగా.. అధికారం కోల్పోయినా.. వ్య‌క్తిగతంగా ఆళ్ల‌గ‌డ్డ నియోజ‌క‌వ‌ర్గం నుంచి గ‌త ఎన్నిక‌ల్లో ప‌రాజ‌యం ఎదురైనా అఖిల దూకుడు చూపించారు. త‌న‌కు తిరుగులేద‌ని నిరూపించారు. జ‌గ‌న్ ప్ర‌భుత్వ వైఫ‌ల్యాలు.. అక్ర‌మ గ్రావెల్ త‌వ్వకాలు.. వంటివాటిపై తీవ్ర‌స్థాయిలో పోరు సాగించారు.

మాట‌ల తూటాల‌తో ప్ర‌జ‌ల‌ను ఆక‌ర్షించారు. నిత్యం మీడియాలోనూ ఉన్నారు. అయితే.. హైద‌రాబాద్‌లో జ‌రిగిన కిడ్నాప్ ఉదంతంతోపాటు.. సొంత కుటుంబంలో రాజుకున్న టికెట్ల ర‌గ‌డ.. ఇప్పుడు అఖిలకు అశ‌నిపాతంగా మారిపోయింది. సొంత కుటుంబంలో నంద్యాల మాజీ ఎమ్మెల్యే బ్ర‌హ్మానంద‌రెడ్డి అఖిల‌ను లెక్క చేయ‌డం లేదు. త‌ను సొంత‌గా వ‌ర్గాన్ని ఏర్పాటు చేసుకుని.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో టికెట్ సంపాయించు కోవ‌డంతోపాటు.. గెలుపు గుర్రం ఎక్కేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. ఇది అఖిల‌కు అస్స‌లు న‌చ్చ‌డం లేదు. 2017 ఉప ఎన్నిక‌లో ప‌ట్టుబ‌ట్టి అఖిలే.. బ్ర‌హ్మానంద‌రెడ్డికి టికెట్ ఇప్పించారు.

అయితే.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌న సొంత సోద‌రుడు జ‌గ‌ద్విఖ్యాత్‌రెడ్డికి ఈ టికెట్ ఇప్పించుకునే ప్ర‌య‌త్నాలు చేస్తుండ‌డంతో బ్ర‌హ్మానంద రెడ్డి అఖిల‌ను సైడ్ చేసేశారు. ఇక‌, మ‌రో ఫ్యామిలీ మెంబ‌ర్ బీజేపీలో చేరి.. నిత్యం విమ‌ర్శ‌ల‌తో అఖిల‌కు కంటిపై కునుకు లేకుండా చేస్తున్నారు. మ‌రోవైపు.. ఏవీ సుబ్బారెడ్డికి చంద్ర‌బాబు ప్రాధాన్యం ఇస్తున్నార‌నే వార్త‌లు.. అఖిల‌ను మ‌రింత బాధిస్తున్నాయి. అఖిల‌కు ప్రాధాన్యం ఇవ్వ‌డం వ‌ల్ల‌పార్టీ న‌ష్ట‌పోయింద‌నే నివేదిక‌లు చంద్ర‌బాబుకు చేరాయ‌ని.. ఆమె దూకుడు కార‌ణంగా.. ఎవ‌రూ ఆమెతో క‌లిసి ప‌నిచేయ‌డం లేద‌ని.. చంద్ర‌బాబు స‌మాచారం చేరింది. దీంతో అఖిల‌ను దాదాపు ప‌క్క‌న పెట్టార‌ని.. అంటున్నారు. మ‌రి ఇప్పుడు ఏం చేస్తారో చూడాలి.