Begin typing your search above and press return to search.

కాల్ మనీ 'కామ'ప్

By:  Tupaki Desk   |   28 Dec 2015 6:57 AM GMT
కాల్ మనీ కామప్
X
సంచలనం సృష్టించిన కాల్‌ మనీ కేసు నీరుగారిపోతోందా...? ప్రభుత్వం - విపక్షం రెండూ కూడా ఇది కామప్ కావడమే బెటరని అనుకుంటున్నాయా? తాజా పరిణామాలు చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. నిజానికి కాల్‌ మనీ వ్యవహరాన్ని పోలీసులు అత్యంత చాకచాక్యంగా దర్యాప్తు చేపట్టి అసలు నిందుతులను కనుగొన్నారు. మొదట దర్యాప్తు చాలావేగంగా సాగింది. కమిషనర్ సవాంగ్‌ పై నమ్మకముండటంతో ఇప్పటిదాకా వెయ్యికి పైగా పిర్యాదులు వచ్చాయి. కానీ, దర్యాప్తు మాత్రం ఒక్క అడుగు కూడా ముందుకు పడడం లేదని తెలుస్తోంది. చిన్నాచితకా వ్యక్తులను పట్టుకుని పెద్దలను తప్పించే కార్యక్రమం సాగుతోందని... అన్నిపార్టీలవారు ఇందులో ఉండడం... రాష్ట్రమంతటా ఇలాంటి కేసులు ఉండడమే దీనికి కారణమని తెలుస్తోంది. అరెస్టులు - వ్యక్తులు లక్ష్యం కాకుండా ఇకపై కొత్త చట్టంతో దీన్ని ఎదుర్కోవడం తప్పిస్తే ఇంతవరకు జరిగిన విషయంలో మాత్రం ప్రముఖులను తప్పిస్తారని అంటున్నారు.

కాల్ మనీ కేసులో కొంతమంది ఇప్పటికి దొరకలేదు. పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ వెంట విదేశాలలో విహరించిన శ్రీకాంత్ పోలీసులకు ఇంతవరకు దొరకలేదు. విద్యుత్ శాఖలో ఉద్యోగి అయినటువంటి సత్యానందం ఆచూకీ కూడా లేదు. చెన్నుపాటి శ్రీను ఎక్కడున్నాడో తెలియదు. దీంతో పోలీసులు పట్టుకోలేకపోతున్నారా పట్టుకోవడం లేదా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎర్రచందనం స్మగ్లర్లను ఈజీగా పట్టుకుంటున్నారు... గంగిరెడ్డిని కూడా రెడ్ కార్నర్ నోటీస్ ఇచ్చి అత్యంత చాకచక్యంగా పట్టుకోగలిగారు. కానీ కాల్‌ మనీ వ్యవహారంలో పోలీసులు ఈ నిందితులను పట్టుకోలేకపోతున్నారంటే ఎవరూ నమ్మడం లేదు. దీంతో కాలయాపన చేసి కేసు నీరుగార్చే ప్రయత్నం జరుగుతోందని అంతా అనుకుంటున్నారు.