Begin typing your search above and press return to search.

కేంద్రం క్లారిటీ!...అసెంబ్లీ సీట్ల పెంపు లేదంతే!

By:  Tupaki Desk   |   1 Aug 2017 11:25 AM GMT
కేంద్రం క్లారిటీ!...అసెంబ్లీ సీట్ల పెంపు లేదంతే!
X
తెలుగు రాష్ట్రాల అసెంబ్లీల్లో సీట్ల సంఖ్య‌ను పెంచాల‌న్న వాద‌న ఎప్ప‌టి నుంచో బ‌లంగా వినిపిస్తున్న వాద‌నే. ఏపీ పున‌ర్వ‌వస్థీక‌ర‌ణ చ‌ట్టం ఆధారంగా ఇటు ఏపీతో పాటు అటు తెలంగాణ‌లోనూ అసెంబ్లీ సీట్లు పెర‌గాల్సి ఉంది. దీనిపై రెండు రాష్ట్రాల్లోని అధికార పార్టీలు ఇప్ప‌టిదాకా చ‌ర్చోప‌చ‌ర్చ‌లు జ‌రిపాయి. ప్ర‌తిప‌క్షాల‌ను సాధ్య‌మైనంత బ‌ల‌హీన‌ప‌రిచేందుకు రెండు రాష్ట్రాల్లో ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ చేప‌ట్టిన రెండు అధికార పార్టీలు టీఆర్ఎస్‌, టీడీపీలు ముందూ వెనుకా చూసుకోకుండా ఇత‌ర పార్టీల నుంచి వ‌చ్చిన నేత‌ల‌కు రెడ్ కార్పెట్ ప‌రిచాయి. ఈ సంద‌ర్భంగా ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లో అప్ప‌టికే ఆ పార్టీకి అండ‌గా ఉన్న నేత‌లు ఎన్ని అభ్యంత‌రాలు చెప్పినా కూడా... రెండు పార్టీల అధినేత‌లు కేసీఆర్‌, చంద్ర‌బాబు వాటిని పెడ‌చెవినే పెట్టేశారు.

అంతేకాకుండా వ‌చ్చే ఎన్నిక‌ల్లోపై అసెంబ్లీ సీట్ల సంఖ్య త‌ప్ప‌నిస‌రిగా పెరుగుతుంద‌ని, సీట్లు పెరిగితే త‌ప్ప‌నిస‌రిగా ప్రాధాన్యం ఇస్తామ‌ని అసంతృప్త నేత‌ల‌తో పాటు పార్టీలోకి రావాల‌నుకుంటున్న నేత‌ల‌కు చెప్పి త‌మ ప‌ని కానిచ్చేశారు. తీరా మొన్న‌టి ఢిల్లీ ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా ఇప్ప‌టికిప్పుడు అసెంబ్లీ సీట్ల పెంపుద‌ల అంత ఈజీ కాద‌న్న మోదీ స‌ర్కారు... సీట్లు పెంచ‌డం లేద‌ని, ఉన్న‌వాటితోనే లాగించేయాల‌ని కూడా ఇద్ద‌రు చంద్రుళ్ల ముఖం మీదే చెప్పేసింది. అయితే ఈ మాట అధికారికంగా ఎక్క‌డ కూడా చెప్పిన దాఖ‌లా క‌నిపించ‌లేదు. తాజాగా పార్ల‌మెంటు స‌మావేశాల్లో భాగంగా నేటి ఉద‌యం లోక్ స‌భ‌లో టీడీపీ సంధించిన ఓ ప్ర‌శ్న‌కు స్పందించిన మోదీ స‌ర్కారు ఇదే అంశాన్ని కుండబ‌ద్ద‌లు కొట్టేసింది. 2019లోగా రెండు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల‌ను పెంచే యోచ‌నేది త‌మ వ‌ద్ద లేద‌ని, అయినా సీట్ల సంఖ్యను పెంచాల‌ని య‌త్నించినా 2019 ఎన్నిక‌ల్లోగా అది సాధ్యం కాక‌పోవ‌చ్చ‌ని త‌న వైఖ‌రిని సుస్ప‌ష్టం చేసింది.

వెర‌సి ఇద్ద‌రు చంద్రుళ్ల ప్ర‌గాఢ వాంఛ‌గా మారిన అంశాన్ని మోదీ స‌ర్కారు అట‌కెక్కించేసింది. టీడీపీ ఎంపీ ముర‌ళీమోహ‌న్, టీఆర్ఎస్ ఎంపీ కొత్త ప్ర‌భాక‌ర్ రెడ్డి వేసిన ప్ర‌శ్న‌కు కేంద్రమంత్రి హన్స్ రామ్ సూటీగానే స‌మాధానం ఇచ్చేశారు. 2019లోగా అసెంబ్లీ సీట్లను పెంచాలంటే, రాజ్యాంగంలోని ఆర్టికల్ 170(3)ని సవరించడం ఒక్కటే మార్గమని, అది కుదరదని వెల్లడించారు. 2026లో అప్పటి జనాభా లెక్కల ఆధారంగానే అన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పునర్వ్యవస్థీకరణ ఉంటుందే తప్ప, ఈలోగా నియోజకవర్గాల పెంపు ఉండదని వెల్లడించారు. దీంతో ఈ విషయంలో మరింత స్పష్టత వచ్చినట్లయింది.