Begin typing your search above and press return to search.

ద‌య‌చేసి వినండి...అంత‌ర్జాతీయ విమాన ప్ర‌యాణం చాన్స్ లేదు

By:  Tupaki Desk   |   1 Aug 2020 9:00 AM IST
ద‌య‌చేసి వినండి...అంత‌ర్జాతీయ విమాన ప్ర‌యాణం చాన్స్ లేదు
X
క‌రోనా మ‌హ‌మ్మారి ప్ర‌భావం ఏమాత్రం త‌గ్గ‌క‌పోవ‌డంతో అంత‌ర్జాతీయ విమాన స‌ర్వీసుల‌పై నిషేధాన్ని కేంద్ర ప్ర‌భుత్వం మ‌రోసారి పొడిగించింది. కరోనా వైరస్ మహమ్మారి కట్టడికి విధించిన లాక్‌డౌన్‌ కారణంగా మార్చి 23న జాతీయ అంతర్జాతీయ ప్రయాణీకుల విమానాలను నిలిపివేసిన సంగతి తెలిసిందే. దాన్ని ఆగ‌స్టు 31 వ‌ర‌కు పొడ‌గిస్తూ తాజాగా ఈ మేర‌కు పౌర‌విమానయాన శాఖ ఒక ప్ర‌క‌టన విడుద‌ల చేసింది. అయితే, అంత‌ర్జాతీయ క‌మ‌ర్షియ‌ల్ ప్యాసెంజ‌ర్ ఫ్లైట్ల‌కు మాత్ర‌మే ఈ నిషేధం వ‌ర్తిస్తుంద‌ని భార‌త పౌర‌విమాన‌యాన శాఖ తెలిపింది.

గ‌త ఏప్రిల్ నుంచి భార‌త పౌర‌విమాన‌యాన శాఖ అంత‌ర్జాతీయ విమాన స‌ర్వీసుల‌పై నిషేధాన్ని విడ‌త‌ల వారీగా పొడిగిస్తూ వస్తోంది. చివ‌రిసారిగా జూలై 15 నుంచి 31 వ‌ర‌కు నిషేధాన్ని పొడిగించింది. శుక్ర‌వారం నాటికి ఆ గడువు కూడా ముగియ‌డంతో ఏకంగా మ‌రో నెల రోజుల‌పాటు నిషేధాన్ని పొడిగిస్తున్న‌ట్లు తెలిపింది. అంత‌ర్జాతీయ కార్గో ఆప‌రేష‌న్స్‌కు, డైరెక్ట‌రేట్ జ‌న‌ర‌ల్ ఆఫ్ సివిల్ ఏవియేష‌న్ (డీజీసీఏ) అనుమ‌తితో న‌డుస్తున్న ప్ర‌త్యేక విమానాల‌కు ఈ నిషేధం వ‌ర్తించ‌ద‌ని స్ప‌ష్టం చేసింది.

క‌రోనా క‌ల్లోలం నేప‌థ్యంలో దాదాపు రెండు నెలల విరామం తర్వాత మే 25న ప్రత్యేక నిబంధనలతో దేశీయ విమాన సేవలు తిరిగి ప్రారంభమ‌య్యాయి. అయితే, అంత‌ర్జాతీయ అంత‌ర్జాతీయ విమాన స‌ర్వీసుల రాక‌పోక‌ల‌పై మాత్రం నిషేధం కొన‌సాగుతోంది. వచ్చే ఆగ‌స్టు 31 అర్ధ‌రాత్రి 11:59 వ‌ర‌కు నిషేధం పొడిగించాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది' అని సివిల్ ఏవియేష‌న్ మినిస్ట్రీ ఒక‌‌ ప్ర‌క‌ట‌న‌లో పేర్కొం‌ది.