Begin typing your search above and press return to search.

కోనసీమలో ఇంటర్నెట్ లేక జనాలు కష్టాలు మామాలుగా లేవుగా!

By:  Tupaki Desk   |   30 May 2022 9:52 AM GMT
కోనసీమలో ఇంటర్నెట్ లేక జనాలు కష్టాలు మామాలుగా లేవుగా!
X
ఆంధ్రప్రదేశ్ లోని కోనసీమ జిల్లా అమలాపురంలో మే 24న జరిగిన అల్లర్లు, విధ్వంసానికి సంబంధించి పోలీసులు 150 మందిని నిందితులను గుర్తించారు. వీరంతా దాడుల్లో ప్రత్యక్షంగా పాల్గొన్నవారేనని పోలీసులు చెబుతున్నారు. వీరిలో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతోపాటు పలు పార్టీలకు చెందినవారు ఉన్నారని తెలుస్తోంది. ఇప్పటికే 50 మందికి పైగా నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. వారిని అన్ని కోణాల్లో విచారిస్తున్నారు. కోనసీమ అల్లర్లకు సంబంధించి పోలీసులు 12 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. వీడియో ఫుటేజ్ లు, సోషల్ మీడియా పోస్టులు, సీసీ కెమెరాలు, వాట్సాప్ మెసేజుల ఆధారంగా కేసు దర్యాప్తు చేస్తున్నారు.

మరోవైపు కోనసీమలో ఇంకా పోలీసుల పహారా కొనసాగుతోంది. ఎటువంటి పుకార్లు, అసత్య వార్తలు వ్యాపించకుండా పోలీసులు ఇంటర్నెట్ మీద నిషేధం విధించారు. ఈ నిషేధం మరికొద్ది రోజులు కొనసాగుతుందని.. ఆ తర్వాత ఎత్తేస్తామని ఏలూరు రేంజ్ డీఐజీ పాలరాజు చెబుతున్నారు. కోనసీమలో జరుగుతున్న అల్లర్లపై పుకార్లు నమ్మవద్దని ప్రజలను కోరారు. ప్రజలు సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేశారు. కోనసీమలో సెక్షన్ 30, 144 సెక్షన్ అమలులో ఉన్నందున్న ర్యాలీలు, సభలు, రహస్య సమావేశాలు నిర్వహించరాదని పేర్కొన్నారు.

ఇంటర్నెట్ సేవల నిలిపివేతలో ప్రజలంతా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కోనసీమలో ఇంటర్నెట్ నిషేధం విధించడంతో ముమ్మిడివరం, అమలాపురం, కొత్తపేట, పి.గన్నవరం, రాజోలు నియోజకవర్గాలో సేవలు ఆగిపోయాయి. దీంతో పలు కార్యకలాపాలకు తీవ్ర ఆటంకాలు ఏర్పడుతున్నాయి. ముఖ్యంగా ఇంటి వద్ద పనులు చేస్తున్న సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వాట్సాప్‌, మెయిల్స్‌ చెక్‌ చేసుకునేందుకు సిగ్నల్ కోసం యువకులు గోదావరి తీరానికి వెళ్తున్నారు. డేటా సిగ్నల్‌ అందిన చోట అందరూ గుమిగూడుతున్నారు.

ఇక వర్కు ఫ్రమ్ హోం చేస్తున్నవారు ఇప్పటికే ఇంటర్నెట్ లేక ఇబ్బందులు తలెత్తడంతో వేరే ఊళ్లలో ఉన్న బంధువులు ఇళ్లకు వెళ్లిపోయారు. చుట్టాల ఇళ్లలో ఉండి పనులు చేసుకుంటున్నారు. ఇలా ఇంకా ఎన్నాళ్లు ఉండాలో తెలియక వారంతా తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఇక స్మార్టు పోన్లలో వీడియోలు, పాటలు, గేమ్సు ఆడుకోవడానికి అలవాటు పడినవారు ఇంటర్నెట్ లేకపోవడంతో అల్లాడిపోతున్నారు.

అలాగే కొంతమంది పెళ్లయిన ఆడవాళ్లు ఇంటర్నెట్ లేక స్మార్టు ఫోన్లు, స్మార్టు టీవీలు చూసుకునే అవకాశం లేకపోవడంతో తీవ్రంగా బోరుకొడుతోందని చెబుతున్నారు. స్మార్టు ఫోన్లకు అలవాటు పడ్డ ప్రాణాలు కావడంతో పెళ్లయిన యువతులు అత్తవారింటి నుంచి తమ పుట్టింటికి వెళ్లిపోయి అక్కడ ఊపిరిపీల్చుకుంటున్నారు. అక్కడ ఇంటర్నెట్ వస్తుండటంతో వినోదంతో తమ ఫోన్లలో సేదతీరుతున్నారు. ఇక కోనసీమ ప్రాంతానికి చెందిన అమ్మాయిలయితే అటు పుట్టింటికి వెళ్లలేక, ఇటు అత్తింటిలోనూ ఉండలేక అల్లాడిపోతున్నారు. మరికొంతమంది అటు స్మార్టుఫోన్లు లేక స్మార్టు టీవీలు లేక పాతకాలంలో మాదిరిగా ప్రశాంత జీవనం గడుపుతున్నారు. తమ చిన్నారులతో చిన్ననాటి ఆటలు ఆడిస్తున్నారు.

కాగా, రాష్ట్ర ప్రభుత్వం కోనసీమ జిల్లా పేరును డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జిల్లాగా మార్చడాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళనకారులు చేపట్టిన నిరసనలు ఒక్కసారిగా తీవ్రరూపం దాల్చిన సంగతి తెలిసిందే. అమలాపురం అంతటా హైటెన్షన్ వాతావరణం చోటు చేసుకుంది. రవాణా శాఖ మంత్రి పినిపె విశ్వరూప్, వైఎస్సార్సీపీ ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ కుమార్ ఇళ్లను ఆందోళనకారులు తగులబెట్టిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా కొంతమంది రోడ్లపైకి వచ్చి రాళ్ల దాడికి దిగటంతో 30 మంది పోలీసులకు గాయాలయ్యాయి. పోలీసులు వారిని అదుపు చేసేందుకు లాఠీచార్జ్ చేయడంతో పాటు గాల్లోకి కాల్పులు కూడా జరిపాల్సి వచ్చింది.