Begin typing your search above and press return to search.

తెలుగు స‌భ‌ల‌కూ బాబుకు ఆహ్వానం అంద‌లేదే!

By:  Tupaki Desk   |   14 Dec 2017 11:26 AM GMT
తెలుగు స‌భ‌ల‌కూ బాబుకు ఆహ్వానం అంద‌లేదే!
X
తెలుగు నేల రెండు రాష్ట్రాలుగానే కాకుండా మ‌రో రెండు... మొత్తంగా నాలుగు రాష్ట్రాలుగా మారినా కూడా తెలుగు నేల‌లోని ప్ర‌జ‌లంతా ఒక్క విష‌యంలో ఉమ్మ‌డిగానే ఉంటారు. వారంద‌రి మాతృ భాష తెలుగు అన్న ఒకే ఒక్క విష‌యంలో. ప్ర‌స్తుతానికి ఉమ్మ‌డి ఏపీ తెలంగాణ‌ - ఏపీగా రెండు రాష్ట్రాలుగా విడిపోయినా... తెలంగాణ సీఎం క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర‌రావు - ఏపీ సీఎం నారా చంద్ర‌బాబునాయుడుల‌ను మ‌నం తెలుగు రాష్ట్రాల సీఎంలుగానే పిలుచుకుంటున్నాం. అంతేనా... దేశ రాజ‌ధాని ఢిల్లీలోనూ దాదాపుగా వీరిద్ద‌రికి సోద‌ర రాష్ట్రాల‌కు చెందిన సీఎంలుగానే అంతా భావిస్తున్నారు. మ‌రి ఒక రాష్ట్రంలో జ‌రుగుతున్న కార్య‌క్ర‌మాల‌కు మ‌రో రాష్ట్రానికి చెందిన పాల‌నాధినేత‌గా పొరుగు రాష్ట్ర సీఎంకు ఆహ్వానం త‌ప్ప‌నిస‌రిగా అందాల్సిందే. ఇందులో ఏమాత్రం సందేహం లేదు. మొన్న‌టికి మొన్న హైద‌రాబాదులో జ‌రిగిన గ్లోబ‌ల్ ఎంట‌ర్‌ ప్రెన్యూర్ స‌మ్మిట్‌ కు ఏపీ సీఎంగా చంద్ర‌బాబుకు ఆహ్వానం అందుతుంద‌ని అంతా ఆశించారు. అదే స‌మ‌యంలో జీఈఎస్ ప్రారంభం రోజునే హైద‌రాబాదీల చిర‌కాల ప్రాజెక్టు హైద‌రాబాదు మెట్రో రైలును కూడా ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ జాతికి అంకితం చేశారు. కేసీఆర్ హ‌యాంలో ఈ ప్రాజెక్టు పూర్తి అయినా... ఉమ్మ‌డి రాష్ట్ర సీఎం హోదాలో చంద్ర‌బాబే ఈ ప్రాజెక్టుకు ఆద్యుడ‌ని చెప్పాలి. అలాంటిది చంద్ర‌బాబుకు మెట్రో రైలు ప్రాజెక్టు ప్రారంభోత్స‌వానికి కూడా ఆహ్వానం అంద‌లేదు.

తొలుత చంద్ర‌బాబు - కేసీఆర్ ఇద్ద‌రూ టీడీపీలోనే ఉన్నా... ఆ త‌ర్వాత కేసీఆర్ పార్టీ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చి సొంతంగా టీఆర్ ఎస్ పేరిట పార్టీ పెట్టుకున్నారు. అదే పార్టీ వేదిక‌గా 14 ఏళ్ల పాటు అలుపెర‌గ‌ని పోరు సాగించిన కేసీఆర్‌... తెలంగాణ ప్ర‌జ‌ల చిర‌కాల వాంఛ అయిన ప్ర‌త్యేక రాష్ట్రాన్ని సాధించారు. తెలంగాణ ప్ర‌త్యేక రాష్ట్ర సాధ‌న‌ను సీమాంధ్ర‌కు చెందిన వ్య‌క్తిగా చంద్ర‌బాబు మొద‌టి నుంచి అడ్డుకున్నార‌నే ప్ర‌చారం ఉంది. ఈ నేప‌థ్యంలో ఇప్ప‌టికీ వ్య‌క్తిగతంగా మిత్రులుగానే కొన‌సాగుతున్న కేసీఆర్‌ - చంద్ర‌బాబులు పాల‌నా వ్య‌వ‌హారాల్లో మాత్రం బ‌ద్ధ శ‌త్రువుల్లానే కొన‌సాగుతున్నారు. ఈ విష‌యంలో చంద్రబాబు కాస్తంత ప‌ట్టూవిడుపులు ప్ర‌ద‌ర్శిస్తున్నా కేసీఆర్ మాత్రం... చంద్ర‌బాబును ఇప్ప‌టికీ శ‌త్రువుగానే ప‌రిగ‌ణిస్తున్న‌ట్లుగా క‌నిపిస్తోంది. ఈ క్ర‌మంలోనే జీఈఎస్ స‌ద‌స్సుకు గానీ, మెట్రో రైలు ప్రారంభోత్స‌వానికి గానీ కేసీఆర్ స‌ర్కారు నుంచి చంద్రబాబుకు ఆహ్వానం అంద‌లేదు. స‌రే... అవేవో తెలంగాణ ప్ర‌భుత్వానికి చెందిన సొంత నిర్ణ‌యాలుగా భావించ‌వ‌చ్చు. అయితే రెండు రాష్ట్రాల ప్ర‌జ‌ల మాతృభాష‌గా ఉన్న తెలుగుకు సంబంధించి ప్ర‌పంచ తెలుగు మ‌హాస‌భ‌లకు రేపు తెర లేవ‌నుంది. హైద‌రాబాదు కేంద్రంగానే ప్రారంభం కానున్న ఈ స‌ద‌స్సుకు ఓ తెలుగు రాష్ట్రానికి సీఎంగా ఉన్న చంద్ర‌బాబుకు ఆహ్వానం త‌ప్ప‌నిస‌రి అన్న భావ‌న ఉంది.

ఇదే భావ‌న‌తో ఏకీభ‌వించిన తెలంగాణ స‌ర్కారు కూడా ప్ర‌పంచ తెలుగు మ‌హాస‌భ‌ల‌కు చంద్ర‌బాబుకూ ఆహ్వానం ప‌లుతామ‌ని గ‌తంలో ప్ర‌క‌టించింది కూడా. అయితే ఇప్పుడు తెలంగాణ ప్ర‌భుత్వానిధినేత‌గా ఉన్న కేసీఆర్ యూట‌ర్న్ తీసుకున్న‌ట్లుగా క‌నిపిస్తోంది. రేపు అట్ట‌హాసంగా ప్రారంభం కానున్న ఈ స‌భ‌ల‌కు ఇప్ప‌టిదాకా చంద్ర‌బాబుకు ఆహ్వాన‌మే అంద‌లేదు. దీంతో రేప‌టి తెలుగు ప్ర‌పంచ మ‌హాస‌భ‌ల ప్రారంభోత్స‌వానికి చంద్ర‌బాబును కేసీఆర్ దూరంగా పెట్టేసిన‌ట్టేన‌న్న వాద‌న వినిపిస్తోంది. తెలుగు రాష్ట్రం కాని మ‌హారాష్ట్ర‌కు గ‌వ‌ర్న‌ర్‌ గా వ్య‌వ‌హ‌రిస్తున్న సీహెచ్ విద్యాసాగ‌ర్ రావుకు ఆహ్వానం ప‌లికిన కేసీఆర్ స‌ర్కారు.... చంద్ర‌బాబుకు ఇప్ప‌టిదాకా ఆహ్వానం ప‌ల‌క‌లేదంటే... చంద్ర‌బాబును ప్రారంభోత్స‌వ వేడుక‌ల‌కు దూరంగా పెట్టాల‌ని కేసీఆర్ నిర్ణ‌యించుకున్న‌ట్లేన‌న్న వాద‌న వినిస్తోంది. ఇదిలా ఉంటే... తెలుగు మ‌హాస‌భ‌ల ముగింపు స‌మావేశానికి రాష్ట్ర‌ప‌తి రామ్‌ నాథ్ కోవింద్ హాజ‌రుకానున్నారు. రాష్ట్ర‌ప‌తి వ‌స్తున్న నేప‌థ్యంలో మ‌రో తెలుగు రాష్ట్రానికి సీఎంగా ఉన్న చంద్ర‌బాబుకు కేసీఆర్ స‌ర్కారు ఆహ్వానం ప‌ల‌క‌డం ఖాయ‌మేన‌న్న వాద‌న లేకపోలేదు. అయితే ఇప్పుడు మారిన‌ట్లుగానే అప్పుడు కూడా కేసీఆర్ మ‌న‌సు మార‌కుంటే... ముగింపు స‌మావేశానికి కూడా చంద్ర‌బాబుకు ఆహ్వానం ద‌క్క‌క‌పోవ‌చ్చ‌న్న మ‌రో వాద‌న కూడా వినిపిస్తోంది.