Begin typing your search above and press return to search.

వెంకయ్యతో బాబు దోస్తీకి చెక్ ప‌డిందా?

By:  Tupaki Desk   |   18 July 2017 12:52 PM GMT
వెంకయ్యతో బాబు దోస్తీకి చెక్ ప‌డిందా?
X
ముప్ప‌వ‌రపు వెంక‌య్య‌నాయుడు, నారా చంద్ర‌బాబునాయుడు... ఒక‌రు బీజేపీ నేత‌గా రాజ‌కీయాల్లోకి ప్ర‌వేశించి ఆ పార్టీలోనే చివ‌రి దాకా కొన‌సాగితే... మ‌రొక‌రు కాంగ్రెస్‌ తో రాజ‌కీయ ప్ర‌స్థానాన్ని ప్రారంభించి ఆపై టీడీపీలోకి జంప్ చేసి ఆ పార్టీనే హ‌స్త‌గ‌తం చేసుకున్న నేత‌. పార్టీలు వేరైనా... పేర్ల చివ‌ర ఇద్ద‌రికీ నాయుడు ఉండ‌టం మూలానో - లేక ఇద్ద‌రూ ఒకేసారి అసెంబ్లీలో అడుగుపెట్ట‌డం కార‌ణమో తెలియదు గానీ... వారిద్ద‌రూ మంచి స్నేహితులు. వేర్వేరు పార్టీల్లో ఉన్నా.. ఎక్క‌డ క‌నిపించినా వారి మ‌ధ్య ఆత్మీయ ప‌ల‌క‌రింపులు ఉంటాయి. ఇక ఇద్ద‌రూ క‌లిసి వేదిక‌నెక్కితే... ఒక‌రి త‌ర్వాత ఒక‌రు... ఒక‌రిని ఒక‌రు తెగ పొగిడేసుకుంటారు. ఈ త‌ర‌హా ప‌ర‌స్ప‌ర‌ పొగ‌డ్త‌లు గుప్పించుకునే నేత‌లు మ‌న‌కు దాదాపుగా క‌నిపించ‌రు. ఇప్పుడు బీజేపీ - టీడీపీ మిత్రప‌క్షాలుగా ఉన్నాయి గానీ... రెండు పార్టీలు మిత్ర‌ప‌క్షాలుగా లేకున్నా కూడా వెంక‌య్య‌ - చంద్ర‌బాబుల మ‌ధ్య స్నేహం మాత్రం చెక్కు చెద‌ర‌కుండానే ఉంది.

నిన్న‌టిదాకా కేంద్ర కేబినెట్ లో కీల‌క శాఖ మంత్రిగా ఉన్న వెంక‌య్య‌... రాష్ట్ర విభ‌జ‌న కార‌ణంగా ఆర్థిక లోటుతో స‌త‌మ‌త‌మ‌వుతున్న రాష్ట్రాన్ని గ‌డ్డ‌న‌ప‌డేసేందుకు అహ‌ర్నిశ‌లూ కృషి చేస్తున్నాన‌ని చెప్పుకుంటున్న చంద్ర‌బాబుకు ఢిల్లీలో పెద్ద దిక్కుగానే ఉన్నారు. చంద్ర‌బాబు ఎప్పుడు ఢిల్లీ వెళ్లినా... వెంక‌య్య‌ను క‌ల‌వాల్సిందే. వెంక‌య్యే స్వ‌యంగా చంద్ర‌బాబును వెంట‌బెట్టుకుని ప‌లువురు కేంద్ర పెద్దల వ‌ద్ద‌కు వెళుతుంటారు. ఆయా శాఖ‌ల్లో పెండింగ్ లో ఉన్న ఏపీ ప‌నుల‌ను కూడా వెంక‌య్యే క‌దిలిస్తుంటారు. ఈ క్ర‌మంలోనే వెంక‌య్య కేంద్ర మంత్రిగా ఉంటేనే త‌మ‌కు మంచిద‌ని... రాష్ట్రప‌తి - ఉప‌రాష్ట్రప‌తి ప‌ద‌వుల‌కు వెంక‌య్య వెళ్లిపోతే... త‌మ‌ను ప‌ట్టించుకునే వారెవ‌రంటూ టీడీపీ నేత‌ల‌తో పాటు చంద్ర‌బాబు కూడా తెగ ఇదైపోయారు.

అయితే వీట‌న్నింటినీ ప‌క్క‌న‌పెట్టేసిన వెంక‌య్య పార్టీ అధిష్ఠానం ఆదేశాల మేర‌కు ఉప‌రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థిగా బ‌రిలోకి దిగిపోయారు. నేటి ఉద‌యం ఆయ‌న ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ - బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు అమిత్ షా - పార్టీ ప్ర‌ముఖులు వెంట రాగా త‌న నామినేష‌న్‌ ను దాఖ‌లు చేశారు. అయితే క్రియాశీల రాజ‌కీయాల‌కు స్వ‌స్తి చెప్పి రాజ్యాంగ ప‌ద‌వికి ఎంపిక కోసం నామినేష‌న్ వేస్తున్న త‌న చిర‌కాల మిత్రుడు వెంక‌య్య‌కు అభినంద‌న‌లు తెల‌పాల‌ని భావించిన చంద్ర‌బాబు... నేటి ఉద‌యం ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌కు వెళుతున్న‌ట్లు నిన్న రాత్రే ప్ర‌క‌టించారు. అంతేకాకుండా నేడు జ‌ర‌గ‌నున్న కేబినెట్ స‌మావేశాన్ని కూడా చంద్ర‌బాబు వాయిదా వేసుకున్న‌ట్లు వార్త‌లు వినిపించాయి.

అయితే ఏమైందో, ఏమో తెలియ‌దు గానీ... చంద్ర‌బాబు ఢిల్లీ టూర్ కేన్సిల్ అయ్యింది. త‌న మిత్రుడి నామినేష‌న్‌ ను స్వ‌యంగా ప‌ర్య‌వేక్షించాలని భావించిన చంద్ర‌బాబు ఎందుకో గానీ... త‌న ప్ర‌య‌త్నాన్ని విర‌మించుకున్నారు. దీనికి సంబంధించి విభిన్న వాద‌న‌లు వినిపిస్తున్నాయి. అస‌లు వెంక‌య్య నామినేష‌న్‌ కు రావాల‌ని చంద్ర‌బాబుకు ఆహ్వాన‌మే అంద‌లేద‌న్న‌ది అందులో ఒక‌టి. మొన్న రాష్ట్రప‌తి అభ్య‌ర్థిగా రామ్ నాథ్ కోవింద్ నామినేష‌న్ సంద‌ర్భంగా చంద్ర‌బాబు అండ్ కో నానా హ‌డావిడి చేశారు. అయితే ఎన్డీఏ మిత్ర‌ప‌క్షంగా ఉన్న టీడీపీ అధినేత‌గా చంద్ర‌బాబుకు... వెంక‌య్య నామినేష‌న్ ఆహ్వానం ఎందుకు అంద‌లేద‌న్న కార‌ణం తెలియ‌రాలేదు.

ఇంకోవైపు నిన్న‌టిదాకా యాక్టివ్ పాలిటిక్స్ లో ఉన్న వెంక‌య్యతో చంద్ర‌బాబు ఎన్ని సార్లు భేటీ అయినా ఎవ‌రూ ప‌ట్టించుకోలేదు. అయితే ఇక‌పై వెంక‌య్య రాజ్యాంగ ప‌ద‌విలో కూర్చోనున్నారు. ఈ క్ర‌మంలో ఎప్పుడుబ‌డితే అప్పుడు ఇక‌పై వెంక‌య్య‌ను క‌లిసే అవ‌కాశం చంద్ర‌బాబుకు రాక‌పోవ‌చ్చు. ఈ కోణంలో ఆలోచించే వెంక‌య్య నామినేష‌న్‌ కు చంద్ర‌బాబుకు బీజేపీ అధిష్ఠానం ఆహ్వానం పంప‌లేద‌న్న వాద‌న కూడా వినిపిస్తోంది. కార‌ణ‌మైదేనా కావ‌చ్చు గానీ... త‌న చిర‌కాల మిత్రుడు కీల‌క ప‌ద‌విని ద‌క్కించుకునేందుకు వేసిన నామినేష‌న్ ఘ‌ట్టానికి చంద్ర‌బాబుకు ఆహ్వానం అంద‌క‌పోవ‌డం మాత్రం కాస్తంత బాధ క‌లిగించేదే.