Begin typing your search above and press return to search.

మ‌రో థ‌ర్డ్ ఫ్రంట్‌.. కేసీఆర్ కు ఆహ్వానం లేన‌ట్టేనా?

By:  Tupaki Desk   |   8 Sep 2021 7:35 AM GMT
మ‌రో థ‌ర్డ్ ఫ్రంట్‌.. కేసీఆర్ కు ఆహ్వానం లేన‌ట్టేనా?
X
దేశంలో థ‌ర్డ్ ఫ్రంట్ రాజ‌కీయాలు కొత్త‌కాదు. కొన్ని ద‌శాబ్దాలుగా.. ఈ మాట వింటూనే ఉన్నాం. థ‌ర్డ్ ఫ్రంట్ అంటూ.. ప్ర‌య‌త్నాలు ప్రారంభించ‌డం.. ఆవెంట‌నే అంత‌ర్గ‌త కుమ్ములాట‌ల‌తో వెన‌క్కి త‌గ్గ‌డం.. ష‌రా మామూలుగా మారిపోయింది. గ‌తంలో జ‌య‌ల‌లిత, మాయావ‌తి వంటివారు కూడా థ‌ర్డ్ ఫ్రంట్ ప్ర‌య‌త్నాలు చేశారు. కానీ, ప్ర‌ధాని పీఠంపై ఎవ‌రికి వారు ప‌ట్టుప‌ట్ట‌డంతో ఇది ఆదిలోనే క‌నుమ‌రుగైంది. బీజేపీ, కాంగ్రెసే త‌ర థ‌ర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేయాల‌ని.. గ‌త 2017-18 మ‌ధ్య కాలంలో తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ కూడా ప్ర‌య‌త్నించారు.

వివిధ రాష్ట్రాల‌కు హుటాహుటిన ప్ర‌త్యేక విమానంలో వెళ్లి.. నేత‌ల‌ను క‌లిసివ‌చ్చారు. కానీ, ఎందుకో.. ఈ విష‌యంలో ఆయ‌న స‌క్సెస్ కాలేక పోయారు. బీజేపీని వ్య‌తిరేకించే పార్టీలు.. కాంగ్రెస్‌కు దూరం కాలేక పోవ‌డం.. లేదా.. కాంగ్రెస్‌పై ప్రేమ ఉన్నా... బీజేపీని వ్య‌తిరేకించ‌లేక పోవ‌డం.. వంటి అనేక కార‌ణాల‌తో థ‌ర్డ్ ఫ్రంట్ ప్ర‌య‌త్నాలు ముడిప‌డ‌డం లేదు. దీంతో బీజేపీని నిత్యం తిట్టిపోసే నాయ‌కులు కూడా థర్డ్ అన‌గానే వెన‌క్కి జ‌రుగుతున్న ప‌రిణామాల క్ర‌మంలోనే కేసీఆర్ త‌న ప్ర‌య‌త్నాలు విర‌మించుకున్నారు.

ఇక‌, కొన్నాళ్ల కింద‌ట ప‌శ్చిమ బెంగాల్ ముఖ్య‌మంత్రి మ‌మ‌తా బెన‌ర్జీ కూడా థ‌ర్డ్ ఫ్రంట్ అంటూ.. కొన్ని ప్ర‌యోగాలు చేశారు. రాష్ట్రాల సీఎంల‌కు లేఖ‌లు రాశారు. ఈ విష‌యంలోనూ కొంద‌రు ఆమెకు అనుకూలం గా ఉంటే.. మ‌రికొంద‌రు దూరంగా ఉన్నారు. ద‌క్షిణాది రాష్ట్రాల్లో తెలంగాణ‌, ఏపీ, త‌మిళ‌నాడు ఆమెకు స‌హ‌క‌రించేందుకు ముందుకు రాలేదు. దీంతో ఆమె కొన్ని రోజులు దూకుడు ప్ర‌ద‌ర్శించినా.. ఆ త‌ర్వాత‌.. వెన‌క్కి త‌గ్గారు. ఇక‌, ఇప్పుడు.. ముచ్చ‌ట‌గా.. మ‌రోసారి.. థ‌ర్డ్ ఫ్రంట్ రాగాలు వినిపిస్తున్నాయి.

ఇటీవల జైలు నుంచి విడుదలైన ఇండియన్‌ నేషనల్‌ లోక్‌దళ్‌ నేత ఓం ప్రకాశ్‌ చౌతాలా ధర్డ్ ఫ్రంట్ ప్రయత్నాలు చేస్తున్నారు. మాజీ ఉప ప్రధాని దేవీలాల్‌ జయంతి సందర్భంగా రాజకీయ పార్టీలను స‌మావేశ ప‌రిచి.. మూడో కూట‌మి దిశ‌గా పావులు క‌దుపుతున్నారు. దీనికి పేరు పెట్ట‌క‌పోయినా.. బీజేపీ, కాంగ్రెసేత‌ర పార్టీల‌ను ఆహ్వానించి.. జీవం పోయాల‌ని భావిస్తున్నారు.. ఇప్ప‌టి వ‌ర‌కు చౌతాలాకు ములాయం సింగ్‌ యాదవ్‌, బిహార్‌ సీఎం నీతీశ్‌ కుమార్‌, దేవేగౌడ, అకాలీదళ్‌ వంటి పార్టీలు మ‌ద్ద‌తిస్తున్న‌ట్టు తెలుస్తోంది.

అయితే.. ఇతర పార్టీలను కూడా చౌతాలా పిలిచారు. బీజేపీ, కాంగ్రెసేతర పార్టీలతో మూడో కూటమి పెట్టాలన్నది చౌతాలా ల‌క్ష్యంగా ఉంది. ఈ క్ర‌మంలో కీల‌క‌మైన రాజ‌కీయ నాయ‌కుడు.. కేసీఆర్‌కు ఆహ్వానం పంపిన‌ట్టు స‌మాచారం లేదు. అదేస‌మ‌యంల ఏపీ సీఎం జ‌గ‌న్‌, త‌మిళ‌నాడు పార్టీల‌కు కూడా ఆయ‌న ఆహ్వానం పంపిన‌ట్టు స‌మాచారం లేదు. దీనికి కార‌ణం వారు .. బీజేపీతో అంశాల వారీగా.. స‌హ‌కారం అందిస్తుండ‌డ‌మే న‌ని తెలుస్తోంది.కేంద్రంలో థ‌ర్డ్ ఫ్రంట్ ఏర్పాటు విష‌యంలో ఆశ‌లు ఉన్న‌ప్ప‌టికీ.. బీజేపీని వ్య‌తిరేకించే ప‌రిస్థితి మాత్రం క‌నిపించ‌డం లేదు.

ఇక‌, ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న అంచ‌నాల మేర‌కు.. కేంద్రంలో బీజేపిని దించాలంటే.. కాంగ్రెస్‌ను ప‌క్క‌న పెట్ట‌డం వ‌ల్ల సాధ్యం కాద‌ని.. రాజ‌కీయ వ్యూహ‌క‌ర్త‌.. ప్ర‌శాంత్ కిశోర్ అభిప్రాయ‌ప‌డుతున్న విష‌యం తెల‌సిందే. ఇలా చేయ‌డం వ‌ల్ల‌.. ప్ర‌భుత్వ వ్య‌తిరేక ఓటు బ్యాంకు చీలి.. బీజేపీ లాభిస్తుంద‌ని ఆయ‌న భావిస్తున్నారు. ఇక‌, రాష్ట్రాల్లో కూడా బీజేపీని లోపాయికారీగా స‌మ‌ర్ధించే పార్టీలు చాలానే ఉన్నాయి. ఈ నేప‌థ్యంల‌లో థ‌ర్డ్ ఫ్రండ్ ప్ర‌య‌త్నాలు ఇప్ప‌ట్లో స‌క్సెస్ అవుతాయా? అనేది కూడా సందేహ‌మే. మ‌రి ఏంజ‌రుగుతుందోచూడాలి.