Begin typing your search above and press return to search.

జూనియర్ కు ఆహ్వానపత్రం కూడా అందలేదా?

By:  Tupaki Desk   |   21 Oct 2015 11:36 AM GMT
జూనియర్ కు ఆహ్వానపత్రం కూడా అందలేదా?
X
2009లో ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికలు గుర్తున్నాయా? ఆ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున స్టార్ క్యాంపైనర్ గా వ్యవహరించి.. తన తూటాల్లాంటి మాటలతో విపరీతంగా ఆకట్టుకున్నారు జూనియర్ ఎన్టీఆర్. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన రోడ్డు ప్రమాదానికి గురై.. ఆసుపత్రి పాలైతే.. తెలుగు తమ్ముళ్లు ఎంతగా కిందామీదా పడిపోయారో గుర్తుండే ఉంటుంది.

అయితే.. ఆ తర్వాత కాలంలో పార్టీ మీద పట్టు పెంచుకోవటానికి జూనియర్ చేసిన ప్రయత్నాలకు చెక్ పెట్టిన పరిస్థితుల్లో పార్టీ పట్ల కాస్తంత కినుకును ప్రదర్శించటం.. అదే అదనుగా ఆయన్ను పార్టీకి సంబంధించి కార్యకలాపాలకు దూరం చేయటం తెలిసిందే.

తెలుగుదేశం పార్టీకి తాను సైనికుడినని.. పార్టీ కోసం ఎంతకైనా సిద్ధమని చెప్పిన ఎన్టీఆర్.. 2014 సార్వత్రిక ఎన్నికల్లో తన గొంతును విప్పలేదు. అంతకుంటే.. విప్పే అవకాశం చంద్రబాబు ఇవ్వలేదన్న మాట వినిపించేది. తన కుమారుడ్ని పార్టీలో పెద్ద పీట వేయటంలో భాగంగా జూనియర్ ను పక్కన పెట్టినట్లుగా ప్రచారం జరిగింది. అదే సమయంలో.. జూనియర్ సైతం తనకు తాను అధిక ప్రాధాన్యత ఇవ్వటం కూడా బాబు మైండ్ సెట్ మారేందుకు కారణంగా చెబుతారు.

ఇదిలా ఉంటే.. తాజాగా ఏపీ రాష్ట్ర రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి జూనియర్ ఎన్టీఆర్ కు ఆహ్వానపత్రం కూడా అందలేదని చెబుతున్నారు. ఆయన తండ్రి హరికృష్ణకు మాత్రం నామమాత్రంగా ఆహ్వాన పత్రాన్ని అందించారని చెబుతున్నారు. పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు కావటంతో ఆయనకు ఆహ్వానపత్రాన్ని పంపిన బాబు అండ్ కో.. జూనియర్ కు మాత్రం అస్సలు ఆహ్వాన పత్రాన్నే పంపలేదని చెబుతున్నారు.

మరోవైపు జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు మంత్రుల బృందం చేత ఆహ్వానం అందజేసి.. పిలివటమే కాదు.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా ఫోన్ చేసి శంకుస్థాపన కార్యక్రమానికి రావాలని ఆహ్వానించారు. ఓపక్క పవన్ కు అంత ప్రాధాన్యత ఇచ్చి.. మరోవైపు జూనియర్ ఎన్టీఆర్ కు కనీసం ఆహ్వానం కూడా పంపలేదన్న వార్త.. జూనియర్ అభిమానుల్ని బాధకు గురి చేస్తుందన్న మాట వినిపిస్తోంది.