Begin typing your search above and press return to search.

జంపింగ్ ఎమ్మెల్యే వద్దు... ఫ్యాన్ పార్టీలో తుఫాన్

By:  Tupaki Desk   |   20 Jan 2023 2:30 AM GMT
జంపింగ్ ఎమ్మెల్యే వద్దు... ఫ్యాన్ పార్టీలో తుఫాన్
X
ఆయన జంపింగ్ ఎమ్మెల్యే. ఆయన మీద మాకు నమ్మకం లేదు. ఆయన తన సొంత క్యాడర్ కోసమే పనిచేస్తున్నారు. వారికే అన్ని విధాలుగా ప్రయారిటీ ఇస్తున్నారు. మొదటి నుంచి పార్టీలో ఉన్న మాకు ఎలాంటి ప్రాధాన్యత కల్పించడంలేదు. ఆయనకు టికెట్ ఇస్తే ఈ సీటు పార్టీ కోల్పోయినట్లే అని కచ్చితంగా కుండబద్ధలు కొట్టినట్లుగా వైసీపీ నేతలు చెప్పేస్తున్నారు. అలా విశాఖ సౌత్ సీట్లో ఫ్యాన్ పార్టీలో తుఫాన్ స్టార్ట్ అయింది.

విశాఖ జిల్లా వైసీపీ రీజనల్ కో ఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి ఎదుటనే వైసీపీ నేతలు మొహమాటం లేకుండా ఉన్న విషయం చెప్పారని అంటున్నారు. ఇంతకీ ఆ జంపింగ్ తమ్ముడు ఎవరూ అంటే సౌత్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్. ఆయన 2020లో వైసీపీ జెండా పట్టుకున్నారు. జగన్ కి జై అన్నారు. తెలుగుదేశం పార్టీ మూడు సార్లు టికెట్ ఇస్తే రెండు సార్లు గెలిచిన ఆయన తన రాజకీయం అంతా సైకిల్ పార్టీలోనే చేస్తూ వచ్చారు. అయితే పార్టీకి అధికారం పోవడంతో ఆయన ప్లేట్ ఫిరాయించేశారు.

ఇక విశాఖ సౌత్ లో చాలా మంది నాయకులు వైసీపీకి ఉన్నారు. వర్గ పోరు తీవ్రంగా ఉంది. బహు నాయకత్వంతో వైసీపీ అక్కడ చిక్కిపోతోంది. రెండు సార్లు ఎన్నికల్లో పోటీ చేస్తే చేదు ఫలితాలే వచ్చాయి ఇక లాభం లేదని గెలిచిన ఎమ్మెల్యేనే తమ వైపు తిప్పుకుని వైసీపీ తృప్తి పడుతోంది. ఆయనకే వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇవ్వాలని కూడా అధినాయకత్వం డిసైడ్ అయినట్లుగా వార్తలు వస్తున్నాయి.

ఇక వాసుపల్లి వైఖరి చూస్తే ఆయన వైసీపీలో తన సొంత వర్గాన్ని మెయింటెయిన్ చేస్తున్నారు. తనతో పాటు టీడీపీ నుంచి వచ్చిన వారికే ఆయన అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. దాంతో వైసీపీలో మొదటి నుంచి ఉన్న వారికీ ఎమ్మెల్యేకూ మధ్య పోరాటమే సాగుతోంది. ఆయన మాటను ధిక్కరించి సొంతంగా కార్పోరేటర్లుగా గెలిచిన వారు ఉన్నారు. వారు వచ్చే ఎన్నికల్లో తమలో ఒకరికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని గట్టిగా కోరుతున్నారు.

అయితే హై కమాండ్ మాత్రం వాసుపల్లి సామాజికవర్గం, ఆయన బలాన్ని అంచనా వేస్తూ ఆయన గెలుస్తారు అని భావిస్తోంది. కానీ విశాఖ సౌత్ లో తెలుగుదేశం ఎప్పటి నుంచో బలంగా ఉంది. వాసుపల్లి సొంత బలం కంటే పార్టీ బలంతోనే గెలుస్తూ వచ్చారు. ఇపుడు కూడా అత్యధిక క్యాడర్ పార్టీతోనే ఉండిపోయింది. దాంతో పాటు వాసుపల్లి రెండు సార్లు గెలిచారు. ఆయన మీద మోజు కూడా జనాలకు తీరింది అని అంటున్నారు. సరైన అభ్యర్ధిని తెలుగుదేశం పార్టీ కనుక దింపితే కచ్చితంగా వైసీపీ ఓడిపోతుంది అని అంటున్నారు.

ఇలా చూసుకుంటే వాసుపల్లి గ్రాఫ్ తగ్గిపోతోంది. వైసీపీలో గ్రూపులు పెరిగిపోతున్నాయి. దాంతో వాసుపల్లికి టికెట్ ఇస్తే సొంత పార్టీలోనే ఓడిస్తామని అంటున్నారు. అపుడు తెలుగుదేశానికి పని మరింత సులువు అవుతుందని అంటున్నారు. వైవీ సుబ్బారెడ్డి సౌత్ నియోజకవర్గం పంచాయతీని తీర్చలేకపోతున్నారు. అందరికీ నచ్చచెప్పి పరిస్థితిని ఒక కొలిక్కి తెచ్చే ప్రయత్నం చేస్తున్నా వర్గ పోరు సలసల మండుతోంది. ఈ నేపధ్యంలో వాసుపల్లి తెలుగుదేశంలోకి తిరిగి వెళ్తారా అన్న చర్చ కూడా సాగుతోంది. ఏది ఏమైనా 2024లోనూ విశాఖ సౌత్ సీటు వైసీపీకి హ్యాండ్ ఇచ్చేలాగానే కనిపిస్తోంది అని అంటున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.