Begin typing your search above and press return to search.

చంద్రబాబు చించేశారు.. మోడీ ముంచేశారు

By:  Tupaki Desk   |   13 Nov 2016 4:24 PM GMT
చంద్రబాబు చించేశారు.. మోడీ ముంచేశారు
X
రాజధాని అమరావతి ప్రాంత గ్రామాల్లో గత ఐదురోజులుగా రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. భూముల ధరలు సరే అసలు సాధారణ జీవనం గడుపుకునేందుకు చిల్లర కోసం పరుగులు తీయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.. గత ఏడాదిన్నర కాలంగా గుంటూరు - మంగళగిరి - తుళ్లూరు - తాడేపల్లి - విజయవాడ ప్రాంతాల్లో ఎకరం భూమి కొనాలంటే రెండు కోట్ల పైచిలుకు మాటే. ఇప్పుడు భూముల కొనుగోలుకు ఎవరూ ముందుకు రావడంలేదు. దీంతో భూ సమీకరణకు భూములిచ్చిన రైతుల పరిస్థితి అమ్మబోతే అడివి.. కొనబోతే కొరివి చందంగా మారింది.. రాజధానిలో తమకున్న స్థలాలు అమ్ముకోవాలంటే భయపడే పరిస్థితులు ఉత్పన్నమయ్యాయి. ఈ హఠాత్పరిణామాలకు రైతులు ఆందోళన చెందుతున్నారు.

కోట్లలో లావాదేవీలు జరుగుతున్న నేపథ్యంలో రాజధానికి స్వచ్ఛందంగా భూములిచ్చిన తమకు మూలధనం పన్నుతో పాటు ఇన్ కంటాక్స్ నుంచి మినహాయింపు ఇవ్వాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఇటీవల రాజధాని ప్రభుత్వ భవనాల శంకుస్థాపన సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం ఈ విషయాన్ని కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీకి వివరించారు. త్వరలో కేంద్రం పరిశీలించి నిర్ణయం తీసుకుంటుందని జైట్లీ స్పందించారు. ఇప్పుడు నోట్ల రద్దుతో అసలు భూములు కొనేందుకే ఎవరూ ముందుకు రావటంలేదని రైతులు వాపోతున్నారు.

రాజధాని ప్రాంతంలో అత్యధికంగా ఉండవల్లిలో ఎకరం 12 లక్షల మేర ప్రభుత్వం నిర్ణయించిన ధర ఉంది. బహిరంగ మార్కెట్‌ లో రెండుకోట్ల పై చిలుకు పలుకుతోంది. తుళ్లూరులో ఎకరం 9 లక్షలు - వెంకటపాలెంలో 11లక్షలు - పెనుమాక - కృష్ణాయపాలెం గ్రామాల్లో 8 నుంచి 10 లక్షలు - మంగళగిరిలో 6 నుంచి 8లక్షల వరకు ఎకరం ధర ఉంటే కోటీ 50 లక్షల వరకు బహిరంగ మార్కెట్‌ లో ఇప్పటి వరకు కొనుగోలు చేశారు. నోట్ల రద్దుకు ముందు రాజధాని ప్రతిపాదిత గ్రామాల నుంచి రిజిస్ట్రేషన్లశాఖకు రోజుకు రు. 50 కోట్ల మేర ఆదాయం లభించింది. ప్రస్తుతం రిజిస్ట్రేషన్లు నిలిచిపోవడంతో అందులో పదో వంతు ఆదాయం కూడా రావడం లేదు.

అమరావతిని వేగంగా నిర్మిస్తారని ఆశపడిన రైతులకు చంద్రబాబు తీరు కొంత నష్టం కలిగించగా ఇప్పుడు మోడీ తీసుకున్న నిర్ణయం మరింత దెబ్బతీసింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/