Begin typing your search above and press return to search.

భాష‌తో ప‌ని లేదు.. కొత్త బొమ్మ అయితే చాల‌ట‌!

By:  Tupaki Desk   |   8 July 2019 4:34 AM GMT
భాష‌తో ప‌ని లేదు.. కొత్త బొమ్మ అయితే చాల‌ట‌!
X
చేతిలో సెల్‌.. అందులో నెట్ అందుబాటులోకి వ‌చ్చాక చాలామంది జీవ‌న‌శైలిలో మార్పు వ‌చ్చింది. ఈ నెట్ కు జియో తోడైన త‌ర్వాత దేశ వ్యాప్తంగా మొబైల్ ఇంట‌ర్నెట్ వినియోగ‌దారుల వినియోగంలో ఒక్క‌సారిగా మార్పు వ‌చ్చింది. అప్ప‌టివ‌ర‌కూ ఎంతో పొదుపుగా.. గంట‌కో.. రెండు గంట‌ల‌కో ఒక‌సారి మొబైల్ లో నెట్ ఆన్ చేసుకొని.. అప్డేట్స్ చూసుకొని.. చ‌ప్పున డేటా ఆఫ్ చేసుకోవ‌టం ఉండేది. జేబులో డ‌బ్బుల్ని ఎంత పొదుపుగా వాడేవారో.. అంత‌కు మించి అన్న‌ట్లు డేటా వినియోగం ఆచితూచి అన్న‌ట్లు ఉండేది.

కానీ.. ఇప్పుడు సీన్ మొత్తం మారిపోయింది. మూడు నెల‌ల ప్యాకేజీ పేరుతో చౌక ధ‌ర‌కే ఆన్ లిమిటెడ్ డేటా వినియోగాన్ని అందుబాటులోకి తేవ‌టంతో భార‌త మొబైల్ వినియోగ‌దారుడి తీరు మొత్తంగా మారిపోయింది. భాష‌తో ప‌ని లేకుండా కొత్త కొత్త వీడియోల్ని చూసేందుకు ఇష్ట‌ప‌డ‌టం ఎక్కువైంది. ఇక‌..సినిమాల విష‌యంలో భాష‌ను అధిగ‌మించి.. ఇంగ్లిషు స‌బ్ టైటిల్స్ కు అల‌వాటు ప‌డ‌టం అంత‌కంత‌కూ పెరిగిన వైనం తాజాగా జ‌రిపిన ఒక స‌ర్వేలో స్ప‌ష్ట‌మైంది.

బ్రిట‌న్ కేంద్రంగా ప‌ని చేసే ఆన్ లైన్ మార్కెట్ రీసెర్చ్.. డేటా అన‌లిటిక్స్ సంస్థ యూగ‌వ్ ఒక నివేదిక‌ను విడుద‌ల చేసింది. అందులో ప‌లు ఆస‌క్తిక‌ర అంశాల్ని పేర్కొంది. 88 శాతం మంది ప్రాంతీయ భాష‌ల్లో వినోదాన్ని.. 55 శాతం విదేశీ భాష‌ల్లో వీడియోల‌ను వీక్షిస్తున్న వైనాన్ని పేర్కొన్నారు. విదేశీ భాష‌ల్లోని వీడియోల‌ను మూడొంతుల మంది చూస్తున్నార‌ట‌. అంతేకాదు.. స్థానిక భాష‌ల‌కు సంబంధించిన వినోదాన్ని 73 శాతం మంది టీవీల్లో చూసేందుకు ప్రాధాన్య‌త ఇస్తున్న విష‌యం బ‌య‌ట‌కు వ‌చ్చింది.

ప్రాంతాల‌తో సంబంధం లేకుండా 82 శాతం మంది సౌతిండియా భాష‌ల వీడియోల‌ను ఇష్ట‌ప‌డుతున్నార‌ట‌. ఇంగ్లిషులోకి అనువాదం చేసిన విదేశీ.. ప్రాంతీయ భాష‌ల్లోని వినోద వీడియోల్ని చూసేందుకు 71 శాతం మంది ఆస‌క్తిని ప్ర‌ద‌ర్శిస్తున్నార‌ట‌. విదేశీ భాష‌ల వీడియోల్ని చూస్తామ‌ని 82 శాతం మంది.. మాతృభాష‌లో వీడియోలు ఉంటే విదేశీ వినోదాన్ని చూస్తామ‌ని 78 శాతం ఆస‌క్తిని వ్య‌క్తం చేశారు. ఇంగ్లిషు అనువాదాల్ని తెలుగోళ్లు 86 శాతం మంది ఓకే అంటే.. క‌న్న‌డిగులు మ‌రో అడుగు ముందుకేసి 88 శాతం మంది త‌మ‌కు ఓకే అని చెప్పేస్తున్నారు. మొత్తంగా చూస్తే.. బొమ్మ ఏదైనా ఫ‌ర్లేదు.. కొత్త‌దైతే చాల‌న్న‌ట్లుగా మొబైల్ వినియోగ‌దారుడి తీరు ఉంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.