Begin typing your search above and press return to search.

నవ్వొద్దు.. నిమ్మకాయల స్కాం.. అదీ జైలులో

By:  Tupaki Desk   |   7 May 2022 11:31 AM GMT
నవ్వొద్దు.. నిమ్మకాయల స్కాం.. అదీ జైలులో
X
ఏం చేస్తాం అసలే కలికాలం.. అందులోనూ వేసవి కాలం.. ఎండలు తీవ్రంగా మండుతున్న కాలం.. నిమ్మ కాయల ధర బంగారం అయిపోతున్న కాలం.. సూపర్ మార్కెట్లో మోస్తరు సైజున్న నాలుగు కాయలు రూ.40. అదే వీధి చివర సంతలో రూ.8కి ఒక కాయ. అవీ పెద్దగా సైజు ఉండేవీ కావు. ఎందుకోగానీ ఈ సంవత్సరం నిమ్మకాయలకు కరువొచ్చింది. ఎన్నడూ లేనంతగా ధరలు మండిపోతున్నాయి. ఏటా సహజంగానే ఎండాకాలంలో నిమ్మకాయల ధర పెరుగుతుంది. కాకపోతే కాయ నాలుగు రూపాయిల నుంచి ఐదు రూపాయిలు ఉంటాయి. ఈసారి మాత్రం రెండింతలు, మూడింతలు పెరిగింది. అసలు నాణ్యమైన నిమ్మకాయలే దొరకని పరిస్థితి కూడా ఉంది.

వేసవిలో చలువ.. చౌక

ఎండా కాలంలో ఎక్కువమంది షర్బత్ లకు ప్రాధాన్యమిస్తారు. అందులోనూ నిమ్మకాయలతో చేసినవాటిని ఇష్టపడతారు. సిట్రస్ జాతి పండు కావడంతో శరీరానికీ నిమ్మకాయ మంచిది. పైగా కొవిడ్ కాలం కావడంతో సిట్రస్ జాతి పండ్లకు గిరాకీ పెరిగింది. ఆరోగ్యాన్ని కోరుకుంటున్నవారు ఇలాంటి పండ్లను ఎక్కువగా తీసుకుంటున్నారు. ఇక మన ఊళ్లలో లెమన్ జ్యూస్.. అదే నిమ్మ రసం గురించి చెప్పేదేముంది. చాలామంది ఫేవరెట్ జ్యూస్ ఇది. తక్కువ ఖర్చు కూడా. అందుకే వేసవిలో కూల్ డ్రింక్స్ షాపుల్లో నిమ్మ రసం బాగా అమ్ముడవుతుంది.

ఎన్నో స్కాంలు విన్నాం కానీ..

బిహార్ లో దాణా స్కాం.. అసోంలో ఎల్వోసీ స్కాం.. బెంగాల్ లో శారదా చిట్స్ స్కాం.. ఉమ్మడి ఏపీలో సాగునీటి స్కాం.. ఇలా ప్రతి రాష్ట్రంలో ఏదో ఒక స్కాం విన్నాం. కానీ, ఇది మాత్రం భిన్నం. పంజాబ్ లో నిమ్మకాయల స్కాం వెలుగుచూసింది. వేసవి తాపం పెరిగిపోతున్న వేళ నిమ్మ ధరలు పెరిగిపోతుండటంతో పంజాబ్‌లోని ఓ జైలులో నిమ్మకాయల స్కాం వెలుగుచూసింది. కిలోనిమ్మకాయల ధర మార్కెట్లో దాదాపు రూ.200లకు పైగా పలుకుతుండటంతో ఇదే అదునుగా భావించిన జైలు అధికారులు వాటిని కొనకుండానే కొన్నట్టుగా రికార్డుల్లో చూపించి అడ్డంగా బుక్కైపోయారు.

నిధుల దుర్వినియోగానికి పాల్పడినట్టు తేలడంతో జైలు సూపరింటెండెంట్‌ గుర్నామ్‌ లాల్‌ను ఉన్నతాధికారులు సస్పెండ్‌ చేశారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కపుర్తలా మోడ్రన్‌ జైలులో అక్రమాలు జరుగుతున్నట్టు తెలియడంతో జైళ్ల శాఖ ఏడీజీపీ వీరేంద్ర కుమార్‌ ఈ నెల 1న ఇద్దరు సీనియర్‌ అధికారుల్ని ఆకస్మిక తనిఖీల కోసం పంపారు. దీంతో అక్కడి రికార్డుల్ని పరిశీలించగా.. కిలో రూ.200 చొప్పున 50 కిలోల నిమ్మకాయలు కొనుగోలు చేసినట్టు గుర్తించారు. అయితే, ఖైదీలు తమకు భోజనంలో నిమ్మకాయలు ఏమీ ఇవ్వడంలేదని ఈ తనిఖీ బృందానికి చెప్పడంతో అసలు విషయం బయటపడింది.

ఈ వ్యవహారంపై పంజాబ్‌ జైళ్ల శాఖ మంత్రి హర్‌జోత్‌ సింగ్‌ బియాన్స్‌ ఆగ్రహం వ్యక్తంచేశారు. జైలు సూపరింటెండెంట్‌పై విచారణకు ఆదేశించారు. దర్యాప్తులో అక్రమాలు వెలుగుచూడటంతో గుర్నామ్‌ లాల్‌ను సస్పెండ్‌ చేసినట్టు ఉన్నతాదికారులు వెల్లడించారు. జైలులో ఖైదీలకు నాసిరకం ఆహారాన్ని ఇవ్వడం, సరిపడా భోజనం పెట్టడంలేదని ఈ తనిఖీ బృందం గుర్తించింది. అలాగే, జైలులో తయారు చేసిన ప్రతి చపాతి 50 గ్రామాల కంటే తక్కువ బరువు ఉండటాన్ని చూస్తుంటే గోధుమ పిండి కూడా పక్కదారి పట్టి ఉండొచ్చని భావిస్తున్నారు. కూరగాయల కొనుగోళ్లకు సంబంధించి కూడా అక్రమాలు జరిగినట్టు అధికారులు తమ నివేదికలో పేర్కొన్నారు.