Begin typing your search above and press return to search.

బ‌డ్జెట్ స‌మావేశాల్లో మండ‌లి స‌మావేశం ఉండదా?

By:  Tupaki Desk   |   28 Jan 2020 10:24 AM GMT
బ‌డ్జెట్ స‌మావేశాల్లో మండ‌లి స‌మావేశం ఉండదా?
X
ఏపీ శాస‌న‌మండ‌లిని ర‌ద్దు చేస్తూ ఏపీ ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకున్న సంగ‌తి తెలిసిందే. మండ‌లిని ర‌ద్దు చేస్తూ కేబినెట్ నిర్ణ‌యం తీసుకోవ‌డం, ఆ వెంట‌నే ఆ తీర్మానాన్ని అసెంబ్లీ ఆమోదించ‌డం.. చ‌క‌చ‌కా జ‌రిగిపోయాయి. ప్ర‌తిప‌క్ష పార్టీ తెలుగుదేశం గ‌గ్గోలు పెడుతూ ఉన్నా ప్ర‌భుత్వం మాత్రం మండ‌లిని ర‌ద్దు చేసేసింది. అయితే మండ‌లి ఇంకా ఉనికిలో ఉన్న‌ట్టే అని ప్ర‌భుత్వంలోని ముఖ్యులు కూడా ఒప్పుకుంటున్నారు. మండ‌లిని ర‌ద్దు చేస్తూ ఏపీ శాస‌న‌స‌భ నిర్ణ‌యం తీసుకున్నా.. ఇంకా దాని ర‌ద్దు ప్ర‌క్రియ పెండింగ్ లో ఉన్న‌ట్టే.

మండ‌లి ర‌ద్దు తీర్మానం లోక్ స‌భ‌లో పాస్ కావాలి, రాజ్య‌స‌భ‌లో కూడా ఆమోదం పొందాలి. ఆ త‌ర్వాత రాష్ట్ర‌ప‌తి సంత‌కం పెట్టాలి. అప్పుడే మండ‌లి ర‌ద్దు అవుతుంది. అంత‌వ‌రకూ ఎమ్మెల్సీల‌కు వారి వారి హోదాలైతే ఉంటాయి.

అయితే వారికి ఆహోదాలున్నా.. మండ‌లి స‌మావేశం అవుతుందా? అనేది మాత్రం సందేహంగానే ఉంది. ఏపీ శాస‌న‌స‌భ బ‌డ్జెట్ స‌మావేశాలు జ‌ర‌గాల్సి ఉంది. ఈ నేప‌థ్యంలో బ‌డ్జెట్ స‌మావేశాల్లో మండ‌లి స‌మావేశం ఉంటుందా? అనేది చ‌ర్చ‌నీయాంశంగా మారింది. మండ‌లి ఏర్పాటు అయిన‌ప్ప‌టి నుంచి బ‌డ్జెట్ ను శాస‌న‌స‌భ‌తో పాటు శాస‌న‌మండ‌లిలోనూ ప్ర‌వేశ‌పెట్టి ఆమోదం తెలుపుతూ ఉన్నారు. ఈ క్ర‌మంలో ఇప్పుడు బ‌డ్జెట్ స‌మావేశాల్లో మండ‌లి లో
బ‌డ్జెట్ ప్ర‌వేశ పెడ‌తారా, ఆమోదం కోర‌తారా.. అనేది సందేహాస్ప‌దంగా మారింది.

ఈ విష‌యం గురించి న్యాయ‌నిపుణులు ఆస‌క్తిదాయ‌క‌మైన వ్యాఖ్య‌లు చేస్తూ ఉన్నారు. మండ‌లిని ర‌ద్దు చేసిన తీర్మానాన్ని అసెంబ్లీ సెక్ర‌ట‌రీ కేంద్రానికి పంపిన‌ట్టుగా వారు వివ‌రిస్తూ ఉన్నారు. ఇప్పుడు బ‌డ్జెట్ స‌మావేశాల విష‌యాన్ని ప్ర‌క‌టించేది కూడా అదే వ్య‌క్తి అని, ఇలాంటి నేప‌థ్యంలో.. ఇప్పుడు అదే హోదాలోని వ్య‌క్తి ఇప్పుడు మ‌ళ్లీ మండ‌లి సమావేశానికి ప్ర‌క‌ట‌న చేసే అవ‌కాశాలు లేవ‌ని అంటున్నారు. మండ‌లి ర‌ద్దు తీర్మానాన్ని పంపిన త‌ర్వాత రాష్ట్ర ప్రభుత్వం మ‌ళ్లీ మండ‌లి స‌మావేశాల‌కు ఎలాంటి ఏర్పాట్లూ చేయ‌క‌పోవ‌చ్చు అని నిపుణులు అంటున్నారు. ఈ లెక్క‌న మండ‌లి ఉనికిలో ఉన్నా, ఎమ్మెల్సీల‌కు వారి ప‌ద‌వులు ఉన్నా.. మండ‌లి స‌మావేశాలు మాత్రం ఉండ‌క‌పోవ‌చ్చ‌నే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.