Begin typing your search above and press return to search.

ఆ దేశాల్లో నో మాస్క్.. ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుంటున్న ప్రజలు!

By:  Tupaki Desk   |   1 Jun 2021 1:30 AM GMT
ఆ దేశాల్లో నో మాస్క్.. ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుంటున్న ప్రజలు!
X
కరోనా.. మాస్క్.. శానిటైజర్, ఐసోలేషన్ ఏ దేశ వార్తలు చూసినా ఇవి మాత్రం తప్పలేదు కదా. ధనిక, పేద తేడా లేకుండా దాదాపు అన్నిదేశాల్లోనూ కరోనా విజృంభించింది. కాగా కొన్ని దేశాలు వైరస్ ను చాలా తెలివిగా తిప్పికొట్టాయి. తొలి నుంచి పక్కా ప్రణాళిక అమలు చేస్తూ వైరస్ ను జయించాయి. ఆ దేశాలు ప్రస్తుతం ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుంటున్నాయి. అదేనండి ఏడాది కాలంగా ముక్కూ, మూతిని కవర్ చేస్తూ మాస్కులు ధరిస్తున్నారు కదా. వైరస్ కట్టడి విజయవంతమైనందున కొన్ని దేశాలు మాస్క్ అవసరం లేదని ప్రకటించేశాయి. ఇక్కడి ప్రజలు ప్రశాంతంగా ఊపిరిపీల్చుకుంటున్నారు.

గూటి నుంచి బయటకు వచ్చాం
ఓ గూటిలో మగ్గి బయటకు వచ్చిన పక్షుల్లాగా చాలా స్వేచ్ఛగా ఉందంటున్నారు ఇజ్రాయిల్ ప్రజలు. ఇన్నాళ్లు మాస్కులు ధరించి ఏదో కృత్రిమంగా బతికామని చెబుతున్నారు. ఆ దేశం పటిష్ఠ ప్రణాళికతో అతి తక్కువ కాలంలో కరోనాను అదుపులోకి తీసుకొచ్చింది. కొవిడ్ రహిత దేశంగా ప్రకటించుకున్న తొలి దేశం. జనవరి నుంచి ఏప్రిల్ వరకే ఏకంగా 70 శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేసింది. ఇండోర్ ప్రదేశాలైన ప్రార్థనా మందిరాలు, షాపింగ్ మాళ్లలో మాత్రం మాస్కు ధరించాల్సిందేనని స్పష్టం చేసింది. ఆ దేశంలో మొత్తం 8 లక్షల మందికి వైరస్ సోకగా 6వేల మంది మృతి చెందారు. ప్రస్తుతం అక్కడ కొత్త కేసులు లేవు.

గార్డియన్ ఆఫ్ పీస్ వాలంటీర్లు
హిమాలయాల్లోని చల్లని దేశం భూటాన్. వైరస్ ను సమర్థవంతంగా ఎదుర్కొన్న దేశం. తొలి నుంచే పటిష్ఠ చర్యలు చేపట్టింది. ఆ దేశంలో లాక్డౌన్ విధించాల్సిన పరిస్థితులు రాలేదంటే అర్థం చేసుకోవచ్చు. భారత్ కు సమీపంలో ఉన్న ఆ దేశంలో ఇప్పటివరకు కేవలం 1,309 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వారిలో ఒక్కరే మృతి చెందడం గమనార్హం. చిన్న దేశం కాబట్టి వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగంగా పూర్తి చేసింది. గార్డియన్ ఆఫ్ పీస్ వాలంటీర్ల పేరుతో 90 శాతం మంది వయోజనులకు టీకా ఇచ్చింది. ఆ దేశంలో 1200 టీకా కేంద్రాలు ఏర్పాటు చేసింది. రాజకీయ నాయకులు, ఇతర సెలిబ్రిటీలు వ్యాక్సినేషన్ పై క్రియాశీల పాత్ర పోషించారు. అలా కొవిడ్ ను జయించి మాస్క్ ధారణ అవసరం లేని దేశంగా మారింది.

అమెరికా భేష్
కరోనా తొలి దశలో అల్లకల్లోలమైన దేశం అమెరికా. కోట్లలో పాజిటివ్ కేసులు, లక్షల్లో మరణాలు సంభవించి ఆ దేశ ప్రజలు ఉలిక్కిపడ్డారు. అనంతరం జో బైడెన్ వచ్చాక పరిస్థితి కాస్త కుదుట పడింది. వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేశారు. రెండు డోసులు తీసుకున్నవారు రన్నింగ్, వాకింగ్, చిన్న చిన్న సమూహాల్లో మాస్క్ ధరించాల్సిన అవసరం లేదని ప్రకటించింది. ఇండోర్ ప్రదేశాలు సినిమా థియేటర్లు, మాళ్లు, స్టేడియాల్లో మాస్క్ ధారణ తప్పనిసరి సూచించింది.

మాస్క్ రహిత చైనా
కరోనా పుట్టిళ్లుగా భావించే చైనా మాస్క్ రహిత దేశంగా మారింది. వైరస్ విజృంభణ ప్రభావాన్ని తొలినాళ్లలోనే గుర్తించి పటిష్ఠ చర్యలు చేపట్టింది. లాక్ డౌన్ ను కఠినంగా అమలు చేస్తూ కట్టడి చేసింది. వ్యాక్సినేషన్ ప్రక్రియ వందశాతం పూర్తయింది. ఇక సాధారణ పరిస్థితులు వచ్చాయి. రెస్టారెంట్లు, హోటళ్లు, థీమ్ పార్కులను మళ్లీ తెరిచారు. అంతేకాకుండా ఇటీవలె వుహాన్ స్ట్రాబెర్రీ మ్యూజిక్ ఫెస్ట్ ను నిర్వహించడం గమనార్హం. ఇక ఆ దేశంలో మాస్క్ ధరించాల్సిన అవసరం లేదని డ్రాగన్ కంట్రీ ప్రకటించుకుంది.

ఆంక్షలు సడలింపు
మాస్క్ ధరించే నిబంధనల్లో చెక్ రిపబ్లిక్ కొన్ని మార్పులు చేసింది. రెండు మీటర్ల దూరంలో ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకుంటే మాస్క్ అవసరం లేదని చెప్పింది. అయితే ఆ సంఖ్య పెరిగినా లేదా వ్యక్తుల మధ్య దూరం తగ్గినా మాస్క్ మస్ట్ అని సూచించింది. బస్సులు, రైళ్లు, దుకాణాల్లో తప్పనిసరిగా ధరించాల్సిందేనని స్పష్టం చేసింది. పిల్లల డేకేర్ సెంటర్లను ఇప్పటికే ప్రారంభించారు. మరికొన్ని ఆంక్షలను సడలించే అవకాశం ఉంది. ఆ దేశంలో 16 లక్షల మంది వైరస్ బారిన పడగా 29 వేల మంది మరణించారు.

కొవిడ్ ట్రేసర్
కరోనాను ఎదుర్కొవడంలో న్యూజిలాండ్ విజయవంతమైంది. కొవిడ్ ట్రేసర్ యాప్ ను అందుబాటులోకి తీసుకొచ్చారు. భవనాలు, వాహనాలకు క్యూఆర్ కోడ్ ను అమర్చి వైరస్ లక్షణాలు ఉన్న వారిని గుర్తించే సాంకేతికతను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇలా బాధితులను వెంటనే గుర్తించి వైద్య సాయం అందించారు. ఆ దేశంలో 2,658 కొవిడ్ కేసులు నమోదైతే 26 మంది మృతి చెందారు. ఇక ఆ దేశంలో నో మాస్క్ రూల్ ను అమల్లోకి తెచ్చారు. ఇటీవల జరిగిన ఓ సంగీత కచేరీలో 50 వేల మంది పాల్గొన్నారు. వాళ్లు మాస్క్ ధరించకపోవడంతో పాటు భౌతిక దూరం పాటించలేదు. ఇక నుంచి కొవిడ్ భయం లేదని సంతోషం వ్యక్తం చేస్తున్నారు.