Begin typing your search above and press return to search.

కేసీఆర్ సంచలనం.. జేసీ పోస్టులు పీకేస్తూ నిర్ణయం

By:  Tupaki Desk   |   10 Feb 2020 5:18 AM GMT
కేసీఆర్ సంచలనం.. జేసీ పోస్టులు పీకేస్తూ నిర్ణయం
X
తాను అనుకున్నది అనుకున్నట్లుగా జరిగేలా చేయటం కోసం దేనికైనా సిద్ధమన్నట్లుగా వ్యవహరించటం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు అలవాటే. తాజాగా ఆయన అలాంటి పనే ఒకటి షురూ చేశారు. కొద్ది కాలంగా రాష్ట్రంలోని రెవెన్యూ వ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేస్తానని ఆయన చెప్పటం తెలిసిందే. అయితే.. కేసీఆర్ మాటలు ఎప్పటికి అమల్లోకి వచ్చేదన్న సందేహాల్ని పటాపంచలు చేస్తూ.. కీలక నిర్ణయాన్ని ఆదివారం రాత్రి వేళ ఆర్డర్ రూపంలో అమల్లోకి తీసుకొచ్చారు.

పాలనలో సంచలన సంస్కరణలు తీసుకురావాలన్న పట్టుదలతో ఉన్న సీఎం కేసీఆర్ అందులో మొదటి అడుగును వేశారని చెప్పాలి. ఇప్పటివరకూ జిల్లా స్థాయి లో రెవెన్యూ చట్టం అమలు.. భూ వ్యవహారాల్ని పర్యవేక్షించే జేసీల (జాయింట్ కలెక్టర్) పోస్టును రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. వారి స్థానంలో అదనపు కలెక్టర్లను నియమిస్తూ నిర్ణయం తీసుకుంది.

తెలంగాణ రాష్ట్రంలోని చాలా జిల్లాలకు జేసీలుగా ఉన్న వారిని అదనపు కలెక్టర్లుగా వారిని బదిలీ చేసింది. కొన్ని జిల్లాలకు కొత్త వారిని నియమించగా.. 14 జిల్లాలకు వేరే అధికారుల్ని అదనపు కలెక్టర్లు గా నియమిస్తూ జీవో జారీ చేసింది. మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా 49 మంది నాన్ కేడర్.. కేడర్ అధికారుల్ని బదిలీ చేస్తూ సీఎస్ సోమేష్ కుమార్ కీలక జీవోను జారీ చేయటం గమనార్హం.

పల్లె ప్రగతి.. పట్టణ ప్రగతి కార్యక్రమాల అమలుతో పాటు..అకస్మిక తనిఖీలు.. నిర్లక్ష్యం వ్యవహరించే అధికారులు.. సిబ్బంది పై చర్యలు తీసుకునే అధికారాల్ని వీరికి అప్పజెప్పనున్నారు. లే అవుట్ల అనుమతులు.. ప్రాపర్టీ అసెస్ మెంట్స్ తదితర పనులు వీరికి అప్పగించనున్నారు. మున్సిపాలిటీలు.. కార్పొరేషన్లు.. గ్రామ పంచాయితీలు.. పారిశుధ్యం.. పచ్చదనం.. ఇతర మౌలిక సదుపాయాల కల్పన.. నర్సరీ ఏర్పాటు సర్టిఫికెట్ల జారీ లాంటి వాటి అంశాల్ని వీరే పర్యవేక్షించనున్నారు.

ఈ నెల 11న జిల్లా కలెక్టర్ల ను సదస్సును సీఎం కేసీఆర్ నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్లు.. అడిషనల్ కలెక్టర్లు.. అదనపు కలెక్టర్ల పోస్టులు.. విధులు.. బాధ్యతలు.. జాబ్ చార్ట్ పైన స్పష్టత ఇవ్వటం తో పాటు.. ఎలా పని చేయాలన్న సూచనల్ని చేయనున్నట్లు చెబుతున్నారు. కొత్త జిల్లాలు.. కొత్త డివిజన్లు.. కొత్త మండలాలు.. కొత్త మున్సిపాలిటీలు.. కొత్త గ్రామ పంచాయితీలు ఇలా అంతా కొత్త కొత్తగా పాలనను చేయాలని భావిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనలు తెలంగాణ రాష్ట్రాన్ని ఏ దిశగా పయనించేలా చేస్తాయో చూడాలి.మొత్తంగా తెలంగాణలో అవినీతి అన్నది లేకుండా చేయాలన్న కేసీఆర్ కల.. సాధ్యమవుతుందా? అన్నది కాలమే తేల్చాలి.