Begin typing your search above and press return to search.

కోర్టు క్లారిటీ:గాంధీని చంపింది గాడ్సేనే..!

By:  Tupaki Desk   |   8 Jan 2018 2:50 PM GMT
కోర్టు క్లారిటీ:గాంధీని చంపింది గాడ్సేనే..!
X
సుదీర్ఘ‌కాలంగా సాగుతున్న చ‌ర్చ‌కు స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానం తెర‌దించింది. జాతిపిత‌ మహాత్మా గాంధీ హత్యలో ఓ విదేశీ సంస్థ హస్తం ఉందని - ఈ కేసును తిరిగి విచారించాలని దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం విచారణలో భాగంగా ఈ ధర్మాసనం ఏర్పాటైంది. దీనికి సంబంధించిన అమికస్ క్యూరీగా అమరేంద్ర శరణ్‌ ను సుప్రీం నియమించింది. `గాంధీని చంపింది గాడ్సేనే.. ఆరు దశాబ్దాల తర్వాత ఈ కేసును తిరగదోడాల్సిన పని లేదు`.. అని కోర్టు నియమించిన అమికస్ క్యూరీ - సీనియర్ లాయర్ అమరేంద్ర శరణ్ ఇవాళ సుప్రీంకోర్టుకు స్పష్టం చేశారు.

ముంబైకి చెందిన డాక్టర్ పంకజ్ ఫడ్నిస్ ఈ పిల్ దాఖలు చేయ‌గా...జస్టిస్ ఎస్‌ ఏ బోబ్డె నేతృత్వంలోని ధర్మాసనం ఈ కేసుపై విచారణ జరుపుతోంది. అయితే కేసు పునర్విచారణ అవసరం లేదని శరణ్ తన నివేదికలో స్పష్టంచేశారు. విదేశీ సంస్థ హస్తం ఉందనడానికి ఎలాంటి ఆధారాలు లేవని ఆయన వెల్లడించారు. `గాంధీ శరీరంలోకి దిగిన బుల్లెట్లు, ఏ పిస్తోలు నుంచి వాటిని ఫైర్ చేశారు.. ఎవరు కాల్చారు.. దాని వెనుక కుట్ర.. ఇలా అన్నింటినీ స్పష్టంగా గుర్తించారు. అందులో ఎలాంటి అనుమానాలకు తావులేదు. అందువల్ల దీనిపై కొత్తగా మరో నిజనిర్ధారణ కమిటీగానీ పునర్విచారణగానీ అవసరం లేదు` అని శరణ్ నివేదిక తెలిపింది. గాడ్సే కాకుండా మరో అజ్ఞాత వ్యక్తి గాంధీ హత్యలో పాలుపంచుకున్నట్లు ఎలాంటి ఆధారాలు లేవని స్పష్టంచేసింది.

ఈ సందర్భంగా పిటిష‌న‌ర్ వాద‌న‌ను తోసిపుచ్చింది. గాంధీ శరీరంలో దిగిన నాలుగో బుల్లెట్ ఎవరో అజ్ఞాత వ్యక్తి కాల్చిందని, దానివల్లే ఆయన మరణించారన్న పిటిషనర్ వాదనను కూడా శరణ్ ఖండించారు. 60 ఏళ్ల తర్వాత గాంధీ హత్యపై పునర్విచారణ జరపడం తెలివైన నిర్ణయమే అవుతుందా అని గతేడాది అక్టోబర్‌లో సుప్రీంకోర్టు ఆశ్చర్యం వ్యక్తంచేసింది. దీనిపై కోర్టు పలు ప్రశ్నలు లేవనెత్తినా.. పిల్‌లోని పలు అంశాలను క్షుణ్నంగా పరిశీలించి తుది నిర్ణయం తీసుకుంటామని సుప్రీం తెలిపింది. దీనికి సంబంధించి శరణ్‌ ను అమికస్ క్యూరీగా నియమించి.. పిటిషన్‌ను పరిశీలించాల్సిందిగా ఆదేశించింది. ఈ మేర‌కు కోర్టు తాజాగా ఈ వ్యాఖ్య‌లు చేసింది.