Begin typing your search above and press return to search.

మా విద్యుత్ ఉత్పత్తిని ఎవ్వరూ ఆపలేరుః తెలంగాణ‌

By:  Tupaki Desk   |   30 Jun 2021 4:34 PM GMT
మా విద్యుత్ ఉత్పత్తిని ఎవ్వరూ ఆపలేరుః  తెలంగాణ‌
X
ఆంధ్ర‌ప్ర‌దేశ్ - తెలంగాణ మ‌ధ్య జ‌ల వివాదం కొన‌సాగుతూనే ఉంది. రాయ‌ల‌సీమ ఎత్తిపోత‌ల ప‌థ‌కం, పోతిరెడ్డిపాడు ప్రాజెక్టుల విష‌యంలో నెల‌కొన్న పంచాయితీ చినికి చినికి గాలివాన‌లా మారే ప‌రిస్థితి క‌నిపిస్తోంది. ఇప్ప‌టికే ఏపీ స‌ర్కారు తీరుపై తెలంగాణ కృష్ణాబోర్డుకు లేఖ రాసిన సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో కృష్ణాబోర్డు ప్రాజెక్టుల‌ను ప‌రిశీలించేందుకు సైతం సిద్ధ‌మైంది.

ఈ నేప‌థ్యంలోనే.. బుధ‌వారం నిర్వ‌హించిన ఏపీ కేబినెట్ స‌మావేశంలో సీఎం జ‌గ‌న్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. తెలంగాణ‌లో ఉన్న ఏపీ వాసుల‌ను ఇబ్బంది పెడ‌తార‌నే ఉద్దేశంతోనే వేచి చూసే ధోర‌ణిలో ఉన్నామ‌ని జ‌గ‌న్ వ్యాఖ్యానించిన‌ట్టుగా వార్త‌లు వ‌చ్చాయి. అదేవిధంగా.. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి విద్యుత్ ఉత్ప‌త్తి కోసం అనుమ‌తి లేకుండానే తెలంగాణ నీటిని వాడుతున్న విష‌యాన్ని మ‌రోసారి కృష్ణాబోర్డు దృష్టికి తీసుకెళ్లాల‌ని మంత్రుల‌ను జ‌గ‌న్ ఆదేశించారు.

ఈ విష‌యమై తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రి జ‌గ‌దీష్ రెడ్డి స్పందించారు. శ్రీశైలం ప్రాజెక్టులో నీళ్లు ఉన్నంత కాలం విద్యుత్ ఉత్ప‌త్తి చేసి తీరుతామ‌ని, దీన్ని అడ్డుకోవ‌డం ఎవ‌రిత‌ర‌మూ కాద‌ని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏం చేయాలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ నిర్ణ‌యిస్తుందా? అని ప్ర‌శ్నించారు.

ఏపీ ప్రాజెక్టుల‌పైనా ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. రాయ‌ల‌సీమ లిఫ్ట్ ఇరిగేష‌న్ ముమ్మాటికీ అక్ర‌మ‌మేన‌ని అన్నారు. పోతిరెడ్డిపాడు ప్రాజెక్టును కూడా దుర్మార్గంగా వెడ‌ల్పు చేస్తున్నార‌ని ఆరోపించారు. దీంతో.. ఈ వివాదం ఏ మ‌లుపు తిరుగుతుందో అర్థంకాని ప‌రిస్థితి నెల‌కొంది.