Begin typing your search above and press return to search.

ఓటరు.. ఎవరూ ఫూల్ చేయలేరు..

By:  Tupaki Desk   |   3 April 2019 1:30 AM GMT
ఓటరు.. ఎవరూ ఫూల్ చేయలేరు..
X
ఓటరు తెలివైనోడు.. దేశంలో ఎవరెన్ని చెప్పినా వింటాడు.. ఎన్ని హామీలు కురిపించినా తడుస్తాడు.. ఎన్ని డబ్బులు ఇచ్చినా తీసుకుంటాడు.. కానీ తన భవిష్యత్ నిర్ణయించే ఎన్నకల్లో మాత్రం సరైన నిర్ణయం తీసుకుంటాడు.. ఇలాగే 2014లో మోడీని నమ్మి స్వతంత్ర భారత చరిత్రలోనే పొత్తులు లేకుండా ఏకపక్షంగా బీజేపీని గద్దెనెక్కించారు.

ఇక మొన్నటి తెలంగాణ ఎన్నికల్లోనూ కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, టీజేఎస్ లు మహాకూటమిగా మారి రాహుల్ గాంధీ, చంద్రబాబు, ఉత్తమ్ కోదండరాం లాంటి ఉద్దండులు పోటీచేసి వరాల వాన కురిపించినా.. బక్కపలుచని కేసీఆర్ బోటాబోటా హామీలకే జై కొట్టారు. కాంగ్రెస్ కోట్లు కుమ్మరించినా కానీ కేసీఆర్ కే విజయం కట్టబెట్టారు..

ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లోనూ అసెంబ్లీ ఎన్నికలు నువ్వా నేనా అన్న రీతిలో కొనసాగుతున్నాయి. అధికారటీడీపీ, ప్రతిపక్ష వైసీపీ ఈ ఎన్నికలను జీవన్మరణ సమస్యగా భావిస్తూ పోరాడుతున్నాయి. అందుకే తెలుగు వారు ఎక్కడున్నా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఎవరు గెలుస్తారనే ఉత్కంఠతో ఉన్నారు.

ప్రస్తుతం ఏపీలో జోరుగా ప్రచారం జరుగుతోంది. 11నే ఎన్నికలు ఈ సందర్భంగా ఏ పార్టీ ఎంత డబ్బు ఇచ్చినా తీసుకుందామని ఓటర్లు రెడీ అయ్యారట.. ఎవరిచ్చినా.. ఎంతిచ్చినా సరే మోహమాట పడకుండా తీసుకుంటామని గ్రామాలు, పట్టణాల్లో ప్రజలు డిసైడ్ అయిపోయారట.. అవేమైనా వారి సొంత డబ్బులా.? ప్రజలను దోచిన డబ్బులే కదా.. అందుకే తీసుకుందామంటూ ప్రజలు చర్చించుకుంటున్నారు. కానీ ఎంతిచ్చినా సరే ఓటు మాత్రం ఎవరికి వేయాలో వారు డిసైడ్ అయిపోయారట.. తమ సమస్యలు ఎవరైతే పరిష్కరిస్తారో.. తమకు ఎవరైతే ఈ ఐదేళ్లు అందుబాటులో ఉంటారో వారికే ఓటేద్దామని డిసైడ్ అయ్యారట..

ఇలా ఓటర్లు అందరూ కూడా డబ్బులు తీసుకోవడానికి రెడీ అయ్యారట.. కానీ రాష్ట్ర భవిష్యత్తును మార్చే ఎన్నికల్లో ఓటును మాత్రం డబ్బుకు ఆశపడి వేయకూడదని గట్టిగా నిర్ణయించుకున్నారట.. ఏపీ ఓటర్లలో వచ్చిన ఈ మార్పును పసిగట్టిన వివిధ పార్టీ అభ్యర్థులు ఈసారి డబ్బు ఎంతిచ్చినా ప్రలోభ పెట్టినా ఓటు మనకు పడే అవకాశాలు లేవని తలలు పట్టుకుంటున్నారట.. ఈ మారిన ఓటర్ మైండ్ సెట్ ఇప్పుడు ఏపీలోని రాజకీయ పార్టీలకు వణుకు పుట్టిస్తోంది.