Begin typing your search above and press return to search.

సానియా బెడ్రూం విషయాలు బీబీసీ అడిగిందా?

By:  Tupaki Desk   |   26 Nov 2015 4:09 AM GMT
సానియా బెడ్రూం విషయాలు బీబీసీ అడిగిందా?
X
మీడియాతో సున్నం పెట్టుకునే సెలబ్రిటీలు మామూలే. కానీ.. టెన్నిస్ స్టార్ సానియా మీర్జా అందుకు భిన్నం. వీలైనంతవరకూ మీడియాకు దూరంగా ఉండే ఆమె.. ఎప్పుడైనా మీడియాను కలిసినా.. వారు అడిగే ప్రశ్నలకు ఓపిగ్గా సమాధానం ఇవ్వటం.. నొచ్చుకునేలా మాట్లాడకుండా ఉండటం లాంటివి చేస్తుంటారు. సంచలన స్టేట్ మెంట్లు.. వివాదాస్పద వ్యాఖ్యలకు ఆమె దూరం. అలాంటి సానియాకు చిర్రెత్తే ప్రశ్నలు వేసిన ప్రముఖ మీడియా సంస్థ బీబీసీ మీద సానియా మీర్జా అగ్రహం వ్యక్తం చేశారు.

క్రికెట్ ను విపరీతంగా అభిమానించే భారతదేశంలో.. టెన్నిస్ కు అంత ప్రాచుర్యం లభించేలా చేసిన సానియామీర్జాను తాజాగా బీబీసీ ఇంటర్వ్యూ చేసింది. ఈ సందర్భంగా అడిగిన ప్రశ్న ఆమెకు చిరాకు తెప్పించటమే కాదు.. ఆవేశంగా మాట్లాడేలా చేసింది. ఒకే ఏడాదిలో పది టైటిళ్లు గెలిచి బ్రహ్మాండమైన ఫాంలో ఉన్న సానియకు లింగ వివక్ష ప్రశ్నలు ఎదురయ్యాయి. కెరీర్ అద్భుతంగా సాగుతున్న సమయంలో.. మీరు తల్లి ఎప్పుడు అవుతారన్న ప్రశ్న ఆమెకు ఆగ్రహాన్ని కలిగేలా చేసింది.

అత్యుత్తమ ఆటతీరును ప్రదర్శిస్తున్న ఒక క్రీడాకారిణికి సంబంధించి.. వ్యక్తిగతమైన విషయాల మీద సంధించిన ప్రశ్న చిరాకు తెప్పించింది. దీంతో.. కటువైన మాటలు సానియామీర్జా నోటి నుంచి వచ్చేశాయి. మీరు తల్లి ఎప్పుడు అవుతారన్న ప్రశ్నకు చిరాకు పడిన సానియా.. ‘‘నా బెడ్ రూమ్ లో ఏం జరుగుతుందో హక్కు ఎవరికీ లేదు’’ అంటూ మండిపడింది. సానియా నోటి నుంచి ఇలాంటి సమాధానం వచ్చన తర్వాత ఇంకేం ప్రశ్నలు వేయగలరు.

అద్భుతమైన ఫాంలో ఉంటే ఒక అటగాడిని.. ‘‘మీరు ఎంతమందిని పిల్లల్ని పుట్టించాలని అనుకుంటున్నారు’’ లాంటి ప్రశ్నలు వేస్తారా? కానీ.. ఒక మహిళా క్రీడాకారిణికి ఇలాంటి ప్రశ్నలు వేయాల్సిన అవసరం ఉందా..? ఒకవేళ.. వ్యక్తిగత విషయాల్ని అడగాల్సి వస్తే.. సున్నితంగా.. ఇబ్బంది పడకుండా ఉండేలా వేయాల్సింది. ఏమైనా సానియా నోట ఘాటైన మాట వచ్చేలా మాత్రం బీబీసీ చేయగలిగిందని చెప్పొచ్చు.