Begin typing your search above and press return to search.

ఆ ఎంపీ సీటు మాకొద్దు బాబోయ్‌..!

By:  Tupaki Desk   |   8 March 2019 5:16 AM GMT
ఆ ఎంపీ సీటు మాకొద్దు బాబోయ్‌..!
X
ఏపీలో పార్టీ మార్పుల కార్యక్రమం జోరుగా సాగుతోంది. ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీలోకి నాయకులు జంపింగ్‌ కొట్టే పనిలో ఉన్నారు. టికెట్‌ దక్కించుకోవడమే లక్ష్యంగా సొంత పార్టీలోకి మారడానికి ఏమాత్రం వెనుకాడడం లేదు. ముఖ్యంగా టీడీపీలో టికెట్‌ రాదని సూచనలు అందిన వెంటనే వైసీపీలోకి జంప్‌ కొడుతున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు ఉన్న టీడీపీ వ్యూహం మరోసారి మారినట్లవుతోంది.

నరసాపురం టీడీపీ పార్లమెంట్‌ నియోజకవర్గం ఇన్‌ చార్జిగా ఉన్న రఘురామకృష్ణం రాజు అప్పటి వరకు టీడీపీలో ఉన్నారు. ఒక్కసారిగా వైసీపీలోకి చేరడంతో టీడీపీ షాక్‌ కు గురైంది. దీంతో నరసాపురం టీడీపీ అభ్యర్థి కోసం టీడీపీ తీవ్రంగా సెర్చ్‌ చేస్తోంది. వాస్తవానికి ఇప్పటి వరకు నరసాపురం ఎంపీ అభ్యర్థిని ప్రకటించలేదు. ఈ కోణంలో టికెట్‌ పై అనుమానాలు ఉన్నందునే రఘురామకృష్ణ పార్టీ మారారానే ప్రచారం జోరుగా సాగుతోంది. ఇప్పటి వరక ఇన్‌ చార్జిగా ఉన్న రఘురామ పార్టీ మారారు. అటు చూస్తే ఎన్నికల షెడ్యూల్‌ కు కూడా ఎంతో సమయం లేదు. దీంతో బలమైన అభ్యర్థి కోసం అనేక కోణాల్లో అన్వేషిస్తోందట టీడీపీ.

పశ్చిమగోదావరి జిల్లాలో టీడీపీ బలంగా ఉంది. గత ఎన్నికల్లో ఈ జిల్లాలో 15కి 15 స్థానాల్లో విజయం సాధించింది. అయితే ఈసారి సామాజిక కోణంలో గెలుపు గుర్రాలను ఎంపిక చేసే పనిలో టీడీపీ ఉందట. ఈ క్రమంలో రాజు, కాపు, శెట్టి బలిజ సామాజిక నేతనే ఎంపీ అభ్యర్థి కోసం గాలింపు చేస్తోందట. గతంలో ఎంపీగా గెలిచిన కొత్తపల్లి సుబ్బారాయుడితో పాటు ప్రస్తుత జిల్లా పార్టీ అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి అలాగే మంత్రి పితాని సత్యనారాయణ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.

తోట సీతారామలక్ష్మి ప్రస్తుతం రాజ్యసభకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. అయితే ఆమె తన కుమారుడు జగదీశ్‌ కు భీమవరం లేదా తాడేపల్లి గూడెం టికెట్‌ ఇవ్వాలని అడుగుతోంది. ఈ నేపథ్యంలో తోట సీతారామలక్ష్మి పోటీ చేయకపోవచ్చనే చర్చ సాగుతోందట. మరోవైపు మంత్రి పితాని సత్యనారాయణ కూడా టికెట్‌ కోసం జోరుగా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఆయన వైసీపీ వైపు చూస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. వైసీపీ రాజమండ్రి టికెట్‌ ఇస్తే పితాని పార్టీని వీడే అవకాశం ఉందని అంటున్నారు. అదే సమయంలో టీడీపీ మానకొల్లు టికెట్‌ ఇస్తే పోటీ చేయవచ్చనే ఆలోచనలో ఉన్నారట. మొత్తానికి నర్సాపురం ఎంపీ కోసం వారు ఆసక్తి చూపడం లేదట.

ఇక కాపు సామాజిక వర్గానికి చెందిన కొత్తపల్లి సుబ్బారాయుడి పేరు నర్సాపురం కోసం టీడీపీ ఆలోచిస్తోందట. అయితే ఆయన నర్సాపురం ఎమ్మెల్యేగా పోటీ చేయాలని ఆలోచిస్తున్నారట. ఇదే సమయంలో నర్సాపురం ఎమ్మెల్యే మాధవనాయుడు మరోసారి పోటీకి రెడీ అవుతున్నారు. అయితే ఎమ్మెల్యే టికెట్‌ సాధించడం కోసం కొత్తపల్లి సుబ్బారాయుడు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారట.

ఈ విధంగా నర్సాపురం ఎంపీ టికెట్‌ కోసం ఎవరూ ముందుకు రావడం లేదట. ఈ నేపథ్యంలో రాజుల సామాజికవర్గం నుంచి నాయకుడికి బరిలోకి దింపాలని అధిష్టానం ఆలోచిస్తోందట. రఘురామకృష్ణను తట్టుకొని నిలబడే గెలుపు గుర్రం కోసం అన్వేషిస్తోందట.