Begin typing your search above and press return to search.

ఆ ఊళ్ళో 55 ఏళ్ళకన్నా బతకటంలేదట

By:  Tupaki Desk   |   15 April 2022 2:22 AM GMT
ఆ ఊళ్ళో 55 ఏళ్ళకన్నా బతకటంలేదట
X
ఏలూరు జిల్లా ముసునూరు మండలంలోని అక్కిరెడ్డిగూడెం జనాల బాధ కొత్తకోణంలో వెలుగు చూస్తున్నది. తమ ప్రాంతంలోని జనాల్లో ఎక్కువమంది 55 ఏళ్ళకన్నా బతకటంలేదంటు జనాలు వాపోయారు. దానికి ప్రధాన కారణం కలుషితమైనపోయిన నీరేనట. నీరెందుకు కలుషితమైపోతోందంటే పోరస్ కెమికల్ ఫ్యాక్టరీయే ప్రధాన కారణమని ఆరోపిస్తున్నారు. రెండు రోజుల క్రితం అక్కిరెడ్డిగూడెంలోని పోరస్ కెమికల్ ఫ్యాక్టరీలో భారీ ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే కదా.

కెమికల్ తయారీ ఫ్యాక్టరీలోని వ్యర్ధాలన్నింటినీ యాజమాన్యం భూగర్భంలోకి పంపించేస్తోందట. ఆ విధంగా భూగర్భంలోకి వెళుతున్న నీరే బావులు, బోర్ల రూపంలో తమ ఇళ్ళల్లోకి చేరుతున్నట్లు బాధితులు చెప్పారు. ఆ నీటిని తాగటం వల్లే తమకు అనారోగ్యాలు పెరిగిపోతున్నట్లు మొత్తుకున్నారు. ఆ అనారోగ్యాల వల్లే తమ ప్రాంతంలోని జనాల్లో ఎక్కువమంది 55 ఏళ్ళకు మించి బతకటంలేదంటున్నారు.

6 ఏళ్ళ వయసు నుండే పిల్లాల్లో గ్యాస్ ప్రాబ్లెమ్, కిడ్నీల సమస్యలు, చిన్న వయసులోనే మోకాళ్ళ నొప్పులు, పిల్లల్లో ఎదుగుదల లేకపోవటం, కంటి సమస్యల్లాంటివి అనేకం మీదపడ్డాయట. నాలుగేళ్ళ క్రితం తమ ఊరిలో ఎవరికీ కిడ్నీ సమస్యలు లేవని అయితే ఇపుడు ఎనిమిదిమంది ప్రతిరోజు డయాలసిస్ చేయించుకుంటున్నట్ళు ఊరిజనాలు చెబుతున్నారు. తమ అనారోగ్యానికి కారణం కాలుష్యకారకమైన నీరే అని ఎంతమందికి ఫిర్యాదులు చేసినా ప్రభుత్వం పట్టించుకోలేదని రూపేష్ మండిపోతున్నారు.

ఫ్యాక్టరీ నుండి వెలువడుతున్న వ్యర్ధాల వల్ల తామంతా అనారోగ్యానికి గురవుతున్నట్లు 2016, 17లో కాలుష్య నియంత్రణ మండలికి ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా ఉపయోగం కనబడలేదన్నారు. తాము ఫిర్యాదులు చేసినపుడు ఏదో మొక్కుబడిగా తనఖీలు చేసిన అధికారులు తర్వాత పట్టించుకోలేదన్నారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఇపుడింత భారీ అగ్నిప్రమాదం జరిగిందంటు జనాలు భోరుమంటున్నారు.

అంటే ఇపుడు జరిగిన ప్రమాదానికి, కలుషిత వ్యర్ధాలకు సంబంధం లేకపోయినా ఫ్యాక్టరీని ఇక్కడి నుండి తరలించమన్న తమ డిమాండును అధికారులు పట్టించుకునుంటే బాగుండేదని జనాలంటున్నారు. మరి ఇప్పటికైనా ప్రభుత్వం జనాల బాధను పట్టించుకుంటుందా ?