Begin typing your search above and press return to search.

పాదయాత్ర మినహా బాబుకు మరో ఆప్షన్ లేదా?

By:  Tupaki Desk   |   4 Oct 2021 2:30 AM GMT
పాదయాత్ర మినహా బాబుకు మరో ఆప్షన్ లేదా?
X
అధికారంలో ఉన్న వేళ బలహీనతలు సైతం బలంగా కనిపిస్తాయి. మరింత బాగా అర్థం కావాలంటే.. ఆరోగ్యవంతులకు కొన్ని అనారోగ్యాలు ఉన్నా పెద్దగా పట్టించుకోరు. కానీ.. ఏదైనా పెద్ద జబ్బు వచ్చి పడినప్పుడు.. అప్పటికే ఉన్న రోగాలు ఒక్కసారిగా మీద పడటమే కాదు.. రోగ తీవ్రతను మరింత పెంచుతుంది. ఓటమి పెద్ద జబ్బు లాంటిది. విడి వేళలో ఓకే కానీ.. లెక్క తేడా వచ్చినంతనే చిన్న లోపాలు సైతం పెద్ద తప్పులుగా కనిపిస్తూ ఉంటాయి. 2019 ఎన్నికల్లో దారుణమైన ఓటమిని చవిచూసిన చంద్రబాబుకు.. అప్పటివరకు తనకు కనిపించని లోపాలు ఆయన కళ్ల ముందు కనిపించటం మొదలయ్యాయి.

అప్పటివరకు ఆయనకు అత్యంత సన్నిహితులుగా ఉన్న వారిలో పలువురు పార్టీ నుంచి వీడిపోవటమే కాదు.. తాను పెద్దగా పట్టించుకోని వారు మాత్రం.. పార్టీకి అండగా నిలిచిన పరిస్థితి. దీంతో.. ఆయనకు తత్వ్తం బోధ పడిందని చెబుతారు. గెలుపు వేళ.. పార్టీ.. కార్యకర్తలు కనిపించని బాబుకు.. ఓటమి వేళలో మాత్రం పార్టీ గుర్తుకు వస్తుంది. దాన్ిన బలోపేతం చేయటం మీదన ఆయన ఎక్కువగా ఫోకస్ చేస్తుంటారు. గడిచిన రెండున్నరేళ్లలో ఆయన ఎప్పుడూ ఎదుర్కోనన్ని సవాళ్లను ఎదుర్కొన్నారు.

ఓపక్క వయోభారం.. మరోవైపు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎత్తుల్ని చిత్తు చేసే విషయంలో ఆయన తరచూ ఫెయిల్ అవుతున్నారు. దీంతో.. ఆయనకు మహా ఇబ్బందిగా మారింది. గతంతో పోలిస్తే.. చంద్రబాబులో ఇటీవల ఎదురైన ఓటమి ఆయన్ను చాలానే మార్చిందని చెప్పాలి. పార్టీకి అన్నీ తానై ఉన్న వేళ.. ఏ మాత్రం వెనకుడగు వేసినా.. అది మరింత నష్టాన్ని కలిగిస్తుందన్న విషయాన్ని గుర్తించిన ఆయన.. దిద్దుబాటు చర్యల్ని వేగవంతం చేశారు. అధికార వైసీపీని ఎదుర్కొనేందుకు.. ప్రజల్లో తన బలాన్ని పెంచుకునేందుకు ఆయన ఇప్పుడు ప్రయత్నిస్తున్నారు.

మొన్నటి వరకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ అంతగా ఫోకస్ చేయని తీరుకు భిన్నంగా ఇటీవల కాలంలో ఆయన స్పీడ్ పెంచారు. గడిచిన వారం రోజులుగా చూస్తే.. ఏపీ ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న టీడీపీ తేలిపోగా.. అధికారపక్షానికి అసలుసిసలు ప్రత్యర్థులు జనసేన అన్న భావన కలిగేలా చేయటంలో పవన్ సక్సెస్ అయ్యారు. ఇదే తీరు కొంతకాలం పాటు సాగితే.. రాజకీయ సమీకరణాల్లో చాలానే మార్పులు చోటు చేసుకునే వీలుంది.

ఇలాంటివేళ..పార్టీని మరింత ఉత్తేజితం చేయటానికి.. ప్రజల్లో తన పలుకుబడిని మరింత పెంచుకోవటానికి బాబు తన అమ్ములపొదిలో ఉన్న పాదయాత్ర అస్త్రాన్ని బయటకు తీయాలన్న ఆలోచనలో ఉన్నట్లు చెబుతున్నారు. వాస్తవానికి.. ఆయన ఇప్పటికే పాదయాత్ర కానీ బస్సు యాత్ర కానీ చేయాలన్న నిర్ణయాన్ని తీసుకోవటం.. ఎన్నికలకు ఏడాదిన్నర ముందు చేపట్టాలని భావించారు. అయితే.. ముందస్తు మాట వినిపించటంతో పాటు.. అధికారపక్షం దూకుడుకు కళ్లం వేయాలంటే.. తాను జనంలోకి వెళ్లటం తప్పించి మరో మార్గం లేదన్న విషయాన్ని గుర్తించిన ఆయన.. పాదయాత్రకు సిద్ధమవుతున్నట్లుగా చెబుతున్నారు. ప్రజాయాత్ర పేరుతో ప్రజల్లోకి వెళ్లాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. ఇంత వయసులో పాదయాత్ర చేయాలని బాబు డిసైడ్ అయితే.. అది భారీ సాహసమే అవుతుంది. ఆయన పట్టుదలకు ఇదో నిదర్శనంగా మారుతుందని చెప్పాలి. క్లిష్టమైన. కష్టమైన పాదయాత్ర ప్రకటనను బాబు ఎప్పుడు చేస్తారన్నది ఇప్పుడు ఉత్కంటగా మారింది.