Begin typing your search above and press return to search.

ఆక్సిజన్ కొరతతో అన్ని రాష్ట్రాలు సతమతం.. కానీ కేరళ కాదు ఎందుకంటే!

By:  Tupaki Desk   |   28 April 2021 11:30 PM GMT
ఆక్సిజన్ కొరతతో అన్ని రాష్ట్రాలు సతమతం.. కానీ కేరళ కాదు ఎందుకంటే!
X
రెండో వేవ్లో కరోనా కోరలు చాచిన వేళ దేశంలోని వివిధ రాష్ట్రాల్లో అధిక సంఖ్యలో వైరస్ బారిన పడుతున్నారు. బాధితులు ఎంతోమంది ఆక్సిజన్ అందక అల్లాడుతూ ప్రాణాలు విడుస్తున్నారు. దేశ రాజధాని సహా దాదాపు అన్ని రాష్ట్రాలు ప్రాణవాయువు కొరతతో అల్లాడుతున్నాయి. ఒక్క కేరళ మాత్రం ఇందుకు భిన్నం. అక్కడి కరోనా బాధితులకు సరిపడా ఆక్సిజన్ అందుతోంది. రానున్న రోజుల్లోనూ సరిపోతుందని అధికారులు చెబుతున్నారు. కరోనా బారిన పడిన వారు ఊపిరి అందక ఉసురుపోతున్న దాఖలాలు లేవు.

కేరళ బాధితులకు సరిపోను ఆక్సిజన్ తో పాటు తమిళనాడుకు 70 టన్నులు, కర్ణాటకకు 16 టన్నుల ప్రాణవాయువును ఎగుమతి చేస్తున్నట్లు అధికారిక గణాంకాలు ఉన్నాయి. ఆ రాష్ట్రంలో కొవిడ్ బాధితుల కోసం 35 టన్నులు, ఇతర అవసరాలకు 45 టన్నుల ఆక్సిజన్ అవసరం ఉందని అధికారులు తెలిపారు. కానీ 199 టన్నుల ప్రాణవాయువును ఉత్పత్తి చేస్తున్నట్లు వెల్లడించారు. అవసరమైతే ఉత్పత్తిని మరింత పెంచుతామని అంటున్నారు. ఇక అక్కడ కొవిడ్ బాధితులకు ఆక్సిజన్ అవసరం చాలా తక్కువే ఉంటుందని వైద్యులు తెలిపారు.

ఆ రాష్ట్రంలో ఆశ వర్కర్లు, పంచాయతీ సభ్యులు ప్రజారోగ్యానికి వెన్నెముక వంటి వారు. కరోనా వేళ వార్డు కమిటీ పద్ధతిని మళ్లీ ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు. వార్డులో ఎవరికైనా స్వల్ప జ్వరం ఉన్నా వెంటనే అప్రమత్తమవుతున్నామని పేర్కొన్నారు. అందుకు తగు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ఫలితంగా వైరస్ తీవ్రమై ప్రాణాల మీదకు వచ్చే అవకాశం లేదని అంటున్నారు. కానీ వారం రోజుల్లో ఆక్సిజన్ అవసరం 73 మెట్రిక్ టన్నుల నుంచి 84 మెట్రిక్ టన్నులకు పెరిగిందని చెప్పారు.

కేరళలోని ఆక్సిజన్ ఉత్పత్తి కేంద్రాలు వంద శాతం పనిచేయకున్నా అవసరానికి కన్నా ఎక్కువ ఉత్పత్తి ఉంది. అత్యవసరమైతే వెంటనే ఉత్పత్తిని పెంచుతామని చెబుతున్నారు. కరోనా మొదటి దశలోనే అక్కడి ప్రభుత్వం అప్రమత్తమైంది. గతేడాది తాము చేసిన ప్రయోగాలు ఇప్పుడు ఫలిస్తున్నాయని అంటున్నారు. ఆ రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టినట్లు ప్రభుత్వం అధికారిక ప్రకటన విడుదల చేసింది. అందుకే అన్ని రాష్ట్రాల కన్నా భిన్నమైన పరిస్థితులు కేరళలో ఉన్నాయి.