Begin typing your search above and press return to search.

చంద్ర‌బాబు చ‌క్రాలు తిర‌గ‌డం లేదా?

By:  Tupaki Desk   |   15 Dec 2018 6:11 AM GMT
చంద్ర‌బాబు చ‌క్రాలు తిర‌గ‌డం లేదా?
X
జాతీయ రాజకీయాలు రోజు రోజు కు మారుతున్నాయి. భారతీయ జనతా పార్టీ- కాంగ్రెస్ పార్టీల జయాపజయాలను బట్టి జాతీయ రాజకీయాలలో పలు మార్పులు చోటు చేసుకుంటున్నాయి. జాతీయ పార్టీలకు ప్రత్యామ్నాయంగా మిగిలిన పార్టీలు ఏకమవుతున్నాయి. అయితే ఏఏ పార్టీలు కూటమిగా ఏర్పాడతాయి. ఒక కూటమి కాకుండా రెండు కూటములు ఏర్పడతాయా అన్నది చర్చనీయాంశంగా మారింది. భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ తో కలసి ప్రాంతీయ పార్టీలన్నింటిని కలుపుకుని కూటమిని ఏర్పటు చేయడానికి గతంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ప్రయత్నించారు.


మాజీ ప్రధాని దేవెగౌడ- మమతా బెనర్టీ- స్టాలిన్ వంటి నాయకులను కలుసుకున్నారు. జాతీయ స్థాయిలో మహాకూటమి ఏర్పాటు పై చర్చలు జరిపారు. అయితే తెలంగాణ ముందస్తు ఎన్నికలు ముంచుకు రావడంతో కాంగ్రెస్‌ తో కలసి ప్రజాకూటమిగా ఏర్పడ్డారు. తెలంగాణ ఎన్నికలలో బాబు ఏర్పాటు చేసిన ప్రజాకూటమికి చావు దెబ్బ తగిలింది. తెలంగాణలో అధికారంలో ఉన్న తెలంగాణ రాష్ట్ర సమితి గొప్ప‌ విజయాన్ని అందుకుంది. ఈ పరాజయంతో ఏ కూటమి అయిన చంద్రబాబు వస్తే అది ఐరన్ లెగ్గే అని నిరూపణ అయ్యింది.

తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు కూడా బీజేపీ కాంగ్రెస్‌లకు వ్యతిరేకంగా ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేయనున్నారు. కేసీఆర్‌ కూడా దక్షిణాది నాయకులైన దేవెగౌడ- స్టాలిన్‌ల తో పాటు మమతా బెనర్జీని కలిశారు. తెలంగాణ లో విజయం అందించిన స్పూర్తితో జాతీయ స్థాయిలో అన్ని పార్టీలను కలిపేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. కె. చంద్రశేఖర రావు ఏర్పాటు చేస్తున్న ఫెడరల్ ఫ్రంట్‌ లో చంద్రబాబు నాయుడి పార్టీ తెలుగుదేశానికి స్థానం ఉండదు. ఇద్దరి చంద్రుల మధ్య పచ్చగడ్డి కూడా భగ్గుమంటోంది. ఇక కొత్తగా మమతా బెనర్టీ కూడా తన ఆధ్వర్యంలో ఫ్రంట్ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు.

ఈ ఫ్రంట్‌ లో కూడా చంద్రబాబు నాయుడి కి స్థానం ఉండకపోవచ్చు అంటున్నారు. దీనికి మొదటి కారణం తెలంగాణలో చంద్రబాబు నాయుడి సారధ్యంలో ఏర్పడిన ప్రజాకూటమి అట్టర్‌ఫ్లాప్‌ కావడమే. ఇక రెండో కారణం మమతా దీదీ ఫ‌్రంట్‌ లోకి చంద్రబాబును ఆహ్వానిస్తే ఆ ఫ్రంట్‌ ను ఆయన కబ్జా చేస్తారని దక్షిణాది నాయకులతో కలసి ఆ ఫ‌్రంట్‌ ను తనకు అనుకూలంగా మార్చుకుంటారని మమతా బెనర్జీ భావిస్తున్నారు. పైగా చంద్రబాబు నాయుడి రాజకీయాలను వెన్నుపోట్లను గుర్తెరిగిన మమతా బెనర్జీ తన ఫ్రంట్‌లోకి వచ్చేందుకు చంద్రబాబుకు అవకాశం ఇవ్వరని పరిశీలకులు అంటున్నారు. మొత్తానికి జాతీయ స్దాయిలో చక్రం తిప్పుదామనుకుంటున్న చంద్రబాబుకు ఎదురు దెబ్బ తగిలే అవకాశాలే ఎక్కువంటున్నారు.