Begin typing your search above and press return to search.

ఏపీలో 11వ రోజు.. పింఛన్ కోసం ఎదురుచూపులు?

By:  Tupaki Desk   |   12 Feb 2021 11:30 AM GMT
ఏపీలో 11వ రోజు.. పింఛన్ కోసం ఎదురుచూపులు?
X
ఏపీ సీఎం జగన్ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న పథకాల అమలు కరోనా కల్లోలంతో అల్లకల్లోలం అవుతోంది. కరోనా దెబ్బకు ఆర్థిక వ్యవస్థ కుప్పకూలడంతో ఇప్పుడు నిధుల కోసం ప్రభుత్వాలు నానా అగచాట్లు పడుతున్నాయి. ఏపీలో నవరత్నాలు, సంక్షేమ పథకాలు బోలెడు ప్రకటించడంతో వారి నిర్వహణ భారం ఇప్పుడు జగన్ సర్కార్ కు గుదిబండగా మారింది.

తాజాగా ఏపీలో ఫిబ్రవరి నెల మొదలై 11 రోజులు దాటుతున్నా పెన్షనర్లకు పింఛను చెల్లింపులు పూర్తి స్థాయిలో జరగలేదని ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు, విశ్రాంత ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆల్ఫ్రెడ్ ఆరోపించారు. పెన్షన్లు అందక వారంతా తల్లడిల్లిపోతున్నారన్నారు. పెన్షనర్లకు పింఛన్ ఇచ్చిన తర్వాతే తమకు జీతాలు చెల్లించాలని అనేకసార్లు ఆర్థిక శాఖ ఉన్నతాధికారులకు విన్నవించినా ఉపయోగం లేదని బొప్పరాజు పేర్కొన్నారు. ప్రతినెలా ఏపీలో ఇదే తంతు నడుస్తోందని బొప్పరాజు ఆరోపించారు.

రాష్ట్రంలో 4 లక్షల మంది పెన్షనర్లకు గతంలో ప్రతినెల 1వ తేదీన పెన్షన్ వచ్చేదని.. తీవ్ర ఇబ్బందులుంటే 2, 3 రోజులు ఆలస్యమయ్యేదని బొప్పరాజు అన్నారు. కానీ ఇప్పుడు పెన్షన్ ఏ రోజు వస్తుందో గ్యారెంటీ లేదన్నారు. కరోనా పరిస్థితుల్లో పెరిగిన ఖర్చుల నేపథ్యంలో తమకొచ్చే కొద్దిపాటి మొత్తం కోసం వారంతా ఎదురుచూస్తున్నారన్నారు.ఇక ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన పలు బిల్లులు ఆర్థికశాఖలో పేరుకుపోయి ఉన్నాయన్నారు. ఆర్థిక శాఖ ఉన్నతాధికారులతో సీఎస్ మాట్లాడి ఈ సమస్యను పరిష్కరించాలని బొప్పరాజు కోరారు.