Begin typing your search above and press return to search.

ఏది ఏమైనా డిసెంబరు 30నే ఆఖరట

By:  Tupaki Desk   |   29 Nov 2016 4:40 PM GMT
ఏది ఏమైనా డిసెంబరు 30నే ఆఖరట
X
పాత పెద్ద నోట్లు అయిన రూ.వెయ్యి.. రూ.500నోట్లను బ్యాంకుల్లో డిపాజిట్ చేసే విషయంపై ప్రభుత్వం తాజాగా ఒక స్పష్టత ఇచ్చింది. విత్ డ్రా విషయంలోనూ.. నోట్ల మార్పిడి విషయంలో పలుమార్పులు చేర్పులు చేసిన ప్రభుత్వం.. పాత పెద్ద నోట్లను బ్యాంకుల్లో డిపాజిట్ చేసుకునే విషయంలో మాత్రం మొదట చెప్పినట్లే వ్యవహరిస్తుంది తప్పించి.. మరో మార్పుకు అవకాశం లేదని తేల్చేసింది. తాజాగా రాజ్యసభలో సభ్యుడు ఒకరు అడిగిన ప్రశ్నకు సమాదానం ఇచ్చిన కేంద్రం.. బ్యాంకుల్లో పాత నోట్లను డిపాజిట్ చేసే విషయంలో కాల పరిమితిని పొడిగించేది లేనే లేదని తేల్చేసింది.

డిసెంబరు31న ఆఖరు తేదీ అని.. ఆ రోజు లోపు ప్రజలు తమ వద్ద ఉన్న పాత రూ.వెయ్యి.. రూ.500 నోట్లను బ్యాంకుల్లో డిపాజిట్ చేసుకోవాలన్నారు. కొత్త నగదు విత్ డ్రా చేసుకునేందుకు బ్యాంకుల వద్ద భారీ క్యూలైన్లు ఉన్నాయని.. ఈ నేపథ్యంలో నగదు డిపాజిట్ చేసేందుకు కొంత గడువును పెంచాలన్న అభ్యర్థన విషయంలో తాము సానుకూలంగా స్పందించేది లేదని తేల్చేశారు.

అదే సమయంలో బ్యాంకుల వద్ద సరిపడ నగదు ఉందని.. రూ.100 నోట్ల చలామణిని కూడా పెంచినట్లు కేంద్ర ఆర్థిక శాఖ సహాయమంత్రి అర్జున్ రామ్ మేగ్వాల్ వెల్లడించారు. డిసెంబరు 30తర్వాత డిపాజిట్లను తీసుకునే ఉద్దేశం ప్రభుత్వానికి ఉందా? అన్న ప్రశ్నకు ఆయన లేనే లేదని తేల్చేయటం గమనార్హం. సో.. బ్యాంకుల్లో పాత నోట్లను డిపాజిట్ చేయాలనుకునే వారు వీలైనంత త్వరగా.. డిపాజిట్లు చేసుకోవటం ఉత్తమం. కాస్త ఆలస్యం చేసినా.. నోట్ల కట్టలు కాస్త.. చిత్తుకాగితాలుగా మారిపోతాయన్న విషయాన్ని మర్చిపోకూడదన్న అభిప్రాయం పలువురు వ్యక్తం చేస్తున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/