Begin typing your search above and press return to search.

రైతుల‌పై ఐటీ బాదుడు..సో బ్యాడ్ అంటున్న జైట్లీ

By:  Tupaki Desk   |   10 May 2017 5:40 AM GMT
రైతుల‌పై ఐటీ బాదుడు..సో బ్యాడ్ అంటున్న జైట్లీ
X
మిగ‌తా పౌరుల మాదిరిగా రైతులపై కూడా పన్ను విధించాలని నీతి ఆయోగ్ సభ్యుడు బిబేక్ దేబ్‌ రాయ్ గత నెల చేసిన ప్రకటన పెద్ద దుమారాన్నే సృష్టించిన విషయం తెలిసిందే. ఈ విష‌యంలో కేంద్ర ప్ర‌భుత్వం తీవ్రంగా ఇరుకున ప‌డుతున్న నేప‌థ్యంలో అవ‌కాశం వ‌చ్చిన‌పుడ‌ల్లా కేంద్ర మంత్రులు న‌ష్ట‌నివార‌ణ చ‌ర్య‌లు చేప‌డుతూనే ఉన్నారు. తాజాగా కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ టోక్యోలో మీడియాతో మాట్లాడుతూ అన్నదాతల వ్యవసాయ రాబడిపై పన్ను విధించే ఆలోచన ప్రభుత్వానికి లేదని స్పష్టం చేశారు. అంతేకాదు సంపన్న రైతులనేవారు చాలా అరుదని కూడా ఆయన అభిప్రాయపడ్డారు.

వ్యవసాయ రంగం ఇప్పుడు చాలా సంక్షోభంలో ఉందని, అందువల్ల వ్యవసాయాదాయంపై పన్ను విధించే ప్రశ్నే లేదని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. నీతిఅయోగ్ స‌భ్యుడి ఆ వ్యాఖ్యలను తాను ఇప్పటికే వ్యతిరేకించానని, రైతులపై పన్ను విధించే ఆలోచన ప్రభుత్వానికి లేదని స్పష్టంగా చెప్పానని జైట్లీ తెలిపారు. వ్యవసాయ రంగం ఇప్పటికే సంక్షోభంలో ఉందని, వ్యవసాయ కమతాలు కూడా చాలా చిన్నవేనని ఆయన అన్నారు. సంపన్న రైతులు అనేవారు చాలా అరుదని, అందువల్ల వ్యవసాయ రంగాన్ని ఆదుకోవలసిన సమయంలో దానిపై పన్ను విధించడం సరికాదని అన్నారు. రైతులకు సాయం చేయాలే తప్పితే పన్ను వేయరాదని కూడా ఆయన స్పష్టం చేశారు. ఏది ఏమయినా వ్యవసాయాదాయంపై పన్ను విధించే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకే ఉంటుందని, ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ పని చేస్తుందని తాను అనుకోవడం లేదన్నారు. వ్య‌వసాయ ఆదాయంపై పన్ను విధించడంపై బిబేక్ దేబ్‌ రాయ్ చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమైనవని, ప్రభుత్వం ఆలోచన కాదని నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు అరవింద్ పనగరియా కూడా చెప్పడం తెలిసిందే.

కాగా, మొండి బకాయిల వసూలు రుణ గ్రహీతలపై చర్యలు తీసుకోవడానికి, మొండి బకాయిల వసూలుకు బ్యాంకులకు సలహా ఇవ్వడానికి కమిటీలను ఏర్పాటు చేయడానికి రిజర్వ్ బ్యాంకుకు అధికారాలు కల్పిస్తూ గత వారం జారీ చేసిన ఆర్డినెన్స్ గురించి అడగ్గా, నిరర్థక ఆస్తుల సమస్య పరిష్కారానికి సమయం పడుతుందని, అయితే బ్యాంకులు ఇప్పుడు వాటి వసూలుకు చర్యలను వేగవంతం చేశాయని జైట్లీ చెప్పారు. ఇప్పటికే ఆర్డినెన్స్ జారీ చేయడం జరిగిందని, ఆర్‌బిఐ సైతం కొన్ని మార్గదర్శకాలను ప్రకటించిందని, మేనేజిమెంట్‌ కు సంబంధించి కూడా కొన్ని మార్పులు జరిగాయని తెలిపారు. జాయింట్ లెండింగ్ ఫోరమ్ (జెఎల్‌ ఎఫ్) వ్యవస్థద్వారా మొండి బకాయిల వసూళ్లు ప్రారంభమవడం తదుపరి చర్య అని ఆయన అంటూ, వీటి ఏర్పాటుకు బ్యాంకులు సహకరిస్తాయని ఆశిస్తున్నామన్నారు. మొండి బకాయిలను ప్రారంభ దశలోనే గుర్తించి 45 రోజుల్లోనే సమస్యను సరిదిద్దడానికి కార్యాచరణ ప్రణాళికను సూచించడానికి 2014లోనే ఈ జెఎల్‌ఎఫ్ వ్యవస్థ అమలులోకి వచ్చింది. అయితే వ్యక్తిగత ఖాతాల విషయంలో ఎలా ముందుకెళ్లాలనే దానిపై బ్యాంకుల మధ్య ఏకాభిప్రాయం లేకపోవడంతో ఇది సక్రమంగా పని చేయలేదు.