Begin typing your search above and press return to search.

టీడీపీని ఎదురించిన వనజాక్షికి పోస్టింగే లేదు?

By:  Tupaki Desk   |   27 April 2020 9:10 AM GMT
టీడీపీని ఎదురించిన వనజాక్షికి పోస్టింగే లేదు?
X
చంద్రబాబు సీఎంగా ఉన్న హయాంలో నాటి టీడీపీ ఇసుక మాఫియాపై ఆ లేడీ తహసీల్దార్ బాగా పోరాడింది. మాజీ టీడీపీ ఎమ్మెల్యే , విప్, ఫైర్ బ్రాండ్ అయిన చింతమనేని ఇసుక మాఫియాను అడ్డుకుంది. చింతమనేని దౌర్జన్యాన్ని ధైర్యంగా ఎదురించింది. ఈ ఎపిసోడ్ ను బాగా వాడుకున్న నాటి ప్రతిపక్ష వైసీపీ ఎన్నికల్లో లబ్ధి పొంది ఇప్పుడు అధికారంలో ఉంది.

టీడీపీ ఆగడాలను ఎదురించిన ఆ తహసీల్దార్ పేరు వనజాక్షి. తహసీల్దార్ గా ఆమె టీడీపీ దూకుడు ఎమ్మెల్యే చింతమనేనికి ఎదురెళ్లి నాడు కష్టాలపాలయ్యారు. అయితే ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం వచ్చినా ఆమె కష్టాలు తీరడం లేదు.

విజయవాడ రూరల్ మండలం తహసీల్దార్ గా పనిచేస్తున్న వనజాక్షి రెండు నెలలుగా అనారోగ్యం కారణాలతో సెలవులో ఉంటున్నారు. అయితే తాజాగా కోలుకొని ఉద్యోగంలోకి చేరడానికి రెడీ అయ్యారు. అయితే ఆమెకు నెల దాటినా జాయిన్ అయ్యేందుకు ప్రభుత్వం ససేమిరా అంటోంది. మొదట్లో ఏరికోరి ఆమెను కీలకమైన విజయవాడ రూరల్ తహసీల్దార్ గా పోస్టింగ్ ఇచ్చింది వైసీపీ సర్కార్. కానీ ఇప్పుడు సెలవులో వెళ్లాక తిరిగొచ్చిన ఆమెకు పోస్టు ఇవ్వకపోవడంతో రెండు సార్లు సెలవులును పొడిగించుకోవడం అధికారవర్గాల్లో చర్చనీయాంశమైంది.

సీఎం వైఎస్ జగన్ కు అత్యంత సన్నిహితుడు..ప్రభుత్వ సలహాదారుల్లో కీలకమైన ఒక నాయకుడు ఆమెను విధుల్లో చేర్చుకోవద్దని కృష్ణా జిల్లా అధికార యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేసినట్లు ప్రచారం సాగుతోంది. దీంతో టీడీపీని ఎదురించి వైసీపీకి మైలేజ్ రావడానికి దోహదపడ్డ అధికారికి ఇప్పుడు పోస్టింగ్ కూడా లేని పరిస్థితి ఏర్పడిందనే టాక్ అధికార వర్గాల్లో నడుస్తోంది.

అయితే మొదట్లో అధికారపార్టీ నేతలు చెప్పినట్టే నడుచుకున్న వనజాక్షికి కీలక పోస్టింగ్ దక్కింది. అయితే ఆ తర్వాత నిబంధనల ప్రకారం ఆమె పనులు చేయడం అధికార పార్టీ నేతలకు నచ్చలేదని గుసగుసలు వినిపిస్తున్నాయి. టీడీపీకి జరిగినట్టే తమకూ జరగకూడదనే కావాలనే వనజాక్షికి పోస్టింగ్ ఇవ్వడం లేదని అధికారవర్గాల్లో చర్చ జరుగుతోంది.