Begin typing your search above and press return to search.

రానున్న ఐదు రోజులూ చెన్నైలో చీక‌ట్లే

By:  Tupaki Desk   |   2 Dec 2015 1:10 PM GMT
రానున్న ఐదు రోజులూ చెన్నైలో చీక‌ట్లే
X
కుండ‌పోత‌గా కురుస్తున్న వ‌ర్షాల కార‌ణంగా త‌మిళ‌నాడుకు జ‌రిగిన న‌ష్టం ఒక ఎత్తు అయితే.. ఒక్క చెన్నై మ‌హాన‌గ‌రానికి జ‌రిగిన న‌స్టం మ‌రో ఎత్తు. భారీగా కురిసిన వ‌ర్షాల‌తో వ‌ర‌ద నీరు రోడ్ల మీద‌కు పోటెత్త‌టంతో వీధుల‌న్నీ వాగులుగా మారిపోయాయి. అడుగు తీసి అడుగు బ‌య‌ట‌కు పెట్ట‌లేని ప్రాంతాలెన్నో.

టీవీ ఛాన‌ళ్ల‌లో చూపించే ప్రాంతాల‌న్నీ అంద‌రూ వెళ్ల‌గ‌లిగిన ప్రాంతాలు మాత్ర‌మే. ఎవ‌రూ వెళ్ల‌లేక‌పోతున్న ప్రాంతాలు పెద్ద ఎత్తున ఉన్నాయి. భారీగా నీళ్లు నిలిచిపోవ‌టంతో.. వ‌ర‌ద పోటెత్తిన ప్రాంతాల‌కు ఎలా వెళ్లాలో తెలీక మీడియా ప్ర‌తినిధులు ఇబ్బంది ప‌డుతున్న ప‌రిస్థితుల్లో అస‌లు న‌ష్టం ప్ర‌పంచానికి ఇంకా తెలీని ప‌రిస్థితి. దీనికి తోడు.. రెండు రోజులుగా చెన్నై మ‌హాన‌గ‌రంలోని 60 శాతం విద్యుత్తు సౌక‌ర్యం లేదు. గ‌త 24 గంట‌లుగా దాదాపుగా 90 శాతానికి పైనే విద్యుత్తు స‌ర‌ఫ‌రా కాని ప‌రిస్థితి.

మ‌రి అంధ‌కారంలో న‌గ‌రం ఎంత‌కాలం ఉంటుందో ఎవ‌రూ చెప్ప‌లేక‌పోతున్నారు. ఎందుకంటే.. విద్యుత్తు స‌ర‌ఫ‌రా పున‌రుద్ధ‌రించాలంటే.. క‌నీసం వ‌ర‌ద నీరు త‌గ్గుముఖం ప‌ట్టాలి. ఇదంతా జ‌ర‌గాలంటే క‌నీసం నాలుగు నుంచి ఐదు రోజులు ప‌డుతుంద‌ని చెబుతున్నారు. రాత్రిళ్లు సైతం ప‌ట్ట‌ప‌గ‌లు మాదిరి వెలిగిపోయే చెన్న‌పురి నిండా ఇప్పుడు చీక‌ట్లు నిండుకున్నాయి. ఇక‌.. బ‌హుళ అంత‌స్తుల్లో నివ‌సించే వారి ప‌రిస్థితి మ‌రింత దారుణంగా మారింది. లిఫ్ట్ లు ఆగిపోవ‌టం.. మోటార్లు ప‌ని చేయ‌క‌పోటంతో గుక్కెడు నీటి కోసం వారు త‌పించి పోతున్నారు. కంటి ముందు నీరు క‌నిపిస్తున్నా.. క‌నీస అవ‌స‌రాల‌కు కావాల్సిన నీటి కోసం క‌ట‌క‌ట‌లాడుతున్న దౌన్యం చెన్నైవాసులది.