Begin typing your search above and press return to search.

తెలంగాణ‌కు క‌రెంట్ క‌ట్ చేయ‌నున్న ఏపీ

By:  Tupaki Desk   |   6 Jun 2017 4:46 AM GMT
తెలంగాణ‌కు క‌రెంట్ క‌ట్ చేయ‌నున్న ఏపీ
X
విభ‌జ‌న అనంత‌రం రెండు తెలుగు రాష్ట్రాల మ‌ధ్య ఉన్న పంచాయితీలు అన్నిఇన్ని కావు. ఇద్ద‌రు చంద్రుళ్ల మ‌ధ్య రాజ‌కీయంగా లెక్క‌లు తేడాగా ఉన్నా.. ఇరువురు క‌లిసిన‌ప్పుడు కులాసాగా క‌బుర్లు చెప్పుకోవ‌టం క‌నిపిస్తుంది. అదే స‌మ‌యంలో ఇరువురు వేర్వేరుగా మాత్రం విభ‌జ‌న ఇష్యూలు ఉన్నాయ‌ని.. వాటిని ప‌రిష్క‌రించుకోవాల్సి ఉంద‌న్న మాట‌ను చెబుతుంటారు. కాల‌గ‌ర్భంలో మూడేళ్లు క‌లిసిపోయిన‌ప్ప‌టికీ నేటికీ.. రెండు రాష్ట్రాల మ‌ధ్య‌నున్న ఇష్యూలు ఒక కొలిక్కి రాలేద‌నే చెప్పాలి.

ఇదిలా ఉంటే.. తాజాగా క‌రెంటు ఇష్యూ రెండు రాష్ట్రాల మ‌ధ్య కొత్త త‌ల‌నొప్పిని తెచ్చి పెట్టే ప్ర‌మాదం ఉన్న‌ట్లుగా క‌నిపిస్తోంది. తెలంగాణ‌కు ఏపీ స‌ర‌ఫ‌రా చేసే విద్యుత్‌ కు ఇవ్వాల్సిన బ‌కాయిలు కొండ‌లా పేరుకుపోయాయి. దీని విష‌య‌మై గ‌డిచిన కొంత‌కాలంగా రెండు రాష్ట్రాల మ‌ధ్య పంచాయితీ న‌డుస్తోంది.

విభ‌జ‌న చ‌ట్టం ప్ర‌కారం ఏపీలో ఉత్ప‌త్తి అయ్యే థ‌ర్మ‌ల్ విద్యుత్ లో 53.89 శాతం తెలంగాణ‌కు.. తెలంగాణ‌లో ఉత్ప‌త్తి అయ్యే థ‌ర్మ‌ల్ విద్యుత్ లో 46.11 శాతం ఏపీకి స‌ర‌ఫ‌రా అవుతోంది.

రెండు రాష్ట్రాల మ‌ధ్య విద్యుత్ పంపిణీకి సంబంధించిన నెల‌వారీ బిల్లులు ప‌ర‌స్ప‌రం ఇచ్చి పుచ్చుకుంటున్నారు. ఇందులో భాగంగా తెలంగాణ రాష్ట్రం నుంచి ఏపీకి రూ.4449 కోట్ల బ‌కాయిల రూపంలో రావాల్సి ఉంది. అయితే.. విద్యుత్ బ‌కాయిల‌కు.. ఆస్తి హ‌క్కుల పంపిణీకి ముడిపెడుతూ తెలంగాణ ప్ర‌భుత్వం.. విద్యుత్ సంస్థ‌లు ఏపీకి పైసా కూడా ఇవ్వ‌టం లేదు.

ఈ వ్య‌వ‌హారంపై తెలంగాణ రాష్ట్రం పెట్టిన మెలిక‌తో ఏపీ విద్యుత్ సంస్థ‌లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నాయి. త‌మ‌కు చెల్లించాల్సిన బ‌కాయిల్ని చెల్లించ‌ని ప‌క్షంలో తెలంగాణ‌కు విద్యుత్ స‌ర‌ఫ‌రాను నిలిపివేస్తామంటూ ఏపీ విద్యుత్ సంస్థ‌లు స్ప‌ష్టం చేస్తున్నాయి. ఇలాంటి వేళ రెండు రాష్ట్రాల‌కు చెందిన విద్యుత్ సంస్థ‌ల మ‌ధ్య‌నున్న విభేదాల్ని ప‌రిష్క‌రించుకునేందుకు అధికారులు స‌మావేశ‌మ‌య్యారు.

మొత్తానికి.. ఏపీకి తాము రూ.3149 కోట్ల మొత్తాన్ని చెల్లించాల్సి ఉంద‌న్న విష‌యాన్ని తెలంగాణ అధికారులు ఒప్పుకున్నారు. అయిన‌ప్ప‌టికీ ఏపీకి చెల్లించాల్సిన విద్యుత్ బ‌కాయిల్ని తెలంగాణ విద్యుత్ సంస్థ‌లు చెల్లించ‌క‌పోవ‌టంతో ఏపీ తీవ్ర నిర్ణ‌యాన్ని తీసుకుంది. తెలంగాణ చెల్లించాల్సిన బ‌కాయిలు కొండ‌లా పేరుకుపోయిన నేప‌థ్యంలో తెలంగాణ‌కు ఈ రోజు (మంగ‌ళ‌వారం) నుంచి విద్యుత్ స‌ర‌ఫ‌రాను నిలిపివేయ‌నున్న‌ట్లుగా ఏపీ విద్యుత్ సంస్థ‌లు వెల్ల‌డించాయి. మ‌రి.. దీని ప్ర‌భావం ఎలా ఉంటుందో చూడాలి. అయినా.. సంప‌న్న రాష్ట్రమైన తెలంగాణ‌.. విద్యుత్ బ‌కాయిల్ని చెల్లించ‌క‌పోవ‌టం ఏమిటి? ఇష్యూల ప‌రంగా ఏదైనా తేడాలు ఉంటే మాట్లాడుకొని ప‌రిష్క‌రించుకోవాలే కానీ.. తెగేదాకా ప‌రిస్థితిని ఎందుకు తీసుకొస్తున్న‌ట్లు?

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/