Begin typing your search above and press return to search.

మైనారిటీ వ‌ర్గాల్లో ఊపేది? వైసీపీ వ్యూహం బెడిసికొడుతోందా?

By:  Tupaki Desk   |   25 July 2022 3:57 AM GMT
మైనారిటీ వ‌ర్గాల్లో ఊపేది?  వైసీపీ వ్యూహం బెడిసికొడుతోందా?
X
ఏపీ అధికార పార్టీ వైసీపీ వ‌చ్చే ఎన్నిక‌ల్లో మ‌రోసారి అధికారం ద‌క్కించుకుని.. ఏపీలో రికార్డు సృష్టించాల ని అనుకుంటున్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో అన్ని సామాజిక వ‌ర్గాల‌ను కూడా మ‌చ్చిక చేసు కునేందు కు ప్ర‌య‌త్నిస్తోంది. అయితే.. ఆది నుంచి కూడా వైసీపీకి అండ‌గా ఉన్న మైనార్టీ వ‌ర్గాల్లో ఇప్పు డు.. జోష్ త‌గ్గిపోయింది. రాష్ట్రంలో ఒక‌ప్పుడు.. మైనార్టీ వ‌ర్గం అంటే.. వైఎస్ వైపు.. త‌ర్వాత‌.. జ‌గ‌న్ వైపు న‌డిచింది. ఇదే హ‌వా.. గ‌త ఎన్నిక‌ల్లో క‌నిపించింది.

వైసీపీ త‌ర‌ఫున పోటీ చేసిన మైనారిటీ నేత‌లు అంద‌రూ విజ‌యం ద‌క్కించుకున్నారు. అయితే.. మూడేళ్లు గ‌డిచేస‌రికి.. వారిలో జోష్ త‌గ్గిపోయింది. చాలా మంది నాయ‌కులు.. ముఖ్యంగా ఎమ్మెల్యేలుగా ఉన్న‌వారు కూడా.. త‌మ త‌మ వ్యాపారాల్లో బిజీ అయిపోయారు. పార్టీ కార్య‌క్ర‌మాల‌కు కూడా హాజ‌రు కాలేని ప‌రిస్థితి వ‌చ్చింది. దీనికి కార‌ణం ఏంటి? ఎందుకు పార్టీ కార్య‌క్ర‌మాల‌కు దూరంగా ఉంటున్నారు.? అనే విష‌యాలు ఆస‌క్తిగా మారాయి.

ఎస్సీ, ఎస్టీ, బీసీల‌కు ఎక్కువ అవ‌కాశాలు ఇచ్చి.. త‌మ‌కు కేవ‌లం ఒకే ఒక్క ఛాన్స్ అన్న‌ట్టుగా.. ఒక్క మం త్రి ప‌ద‌విని కేటాయించ‌డంపై.. మైనారిటీలు గుస్సాతో ఉన్నారు. ఇది వాస్త‌వం. ఈ విష‌యం.. స‌ల‌హాదారు ద‌గ్గ‌ర కూడా చ‌ర్చ‌కు వ‌చ్చింది.

ఇక‌, కీల‌క‌మైన క‌ర్నూలు జిల్లాలో ఏ ఒక్క‌రికీ ప్రాధాన్యం ద‌క్క‌డం లేద‌ని.. మైనారిటీ వ‌ర్గాలు చెబుతున్నాయి. ఇక‌, గ‌తంలో చంద్రబాబు స‌ర్కారు అమ‌లు చేసిన దుల్హ‌న్‌, రంజాన్ తోఫా.. వంటి ప‌థ‌కాలు ఎత్తేయ‌డంపై కూడా.. వారు ఆందోళ‌న‌తో ఉన్నారు.

ఎక్క‌డికి వెళ్లినా.. మైనారిటీ వ‌ర్గాల నుంచి ఆయా ప‌థ‌కాల‌పై ప్ర‌శ్న‌లు ఎదుర‌వుతున్నాయి. దీంతో వారిని స‌ముదాయించ‌లేక‌.. స‌ర్దిచెప్పే ప్ర‌య‌త్నం కూడా చేయ‌లేక నాయ‌కులు అల్లాడుతున్నారు.

ఇక ప్ర‌స్తుతం ఉప‌ముఖ్య‌మంత్రిగా ఉన్న అంజాద్ బాషా కూడా ఏమీ సాధించ‌లేక పోతున్నార‌నే విమ‌ర్శ‌లు ఆ వ‌ర్గంలోనే వినిపిస్తున్నాయి. ఇక రెండో సారి మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ‌లో మ‌రో నేత‌కు అవ‌కాశం ద‌క్కుతుంద‌ని ఆశ‌లు పెట్టుకున్న వారు కూడా నిరాశ చెందారు. దీంతో ఇప్పుడు మైనారిటీ వ‌ర్గాల్లో వైసీపీ ప‌ట్ల పెద్ద జోష్ క‌నిపించ‌డం లేద‌నేది వాస్త‌వం.