Begin typing your search above and press return to search.

ఓటుకు నోటు విచార‌ణ‌..టీడీపీ మేక‌పోతు గాంభీర్యం

By:  Tupaki Desk   |   3 Oct 2018 6:15 PM GMT
ఓటుకు నోటు విచార‌ణ‌..టీడీపీ మేక‌పోతు గాంభీర్యం
X
ఓటుకు నోటు కేసు...తెలుగు రాష్ర్టాల్లోనే కాకుండా దేశ‌వ్యాప్తంగా కూడా సృష్టించిన ఉదంతం. ప్ర‌జాస్వామ్యాన్ని అప‌హాస్యం చేసేలా టీడీపీ పెద్ద‌ల ఆదేశానుసారం ఎమ్మెల్యేల కొనుగోలుకు పాల్ప‌డుతూ అప్ప‌టి ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి రెడ్‌ హ్యాండెడ్‌ గా దొరికిపోయారు. ఈ ఎపిసోడ్ వెనుక‌ రాజ‌కీయ కార‌ణాలు ఉన్నాయ‌నే టాక్ కూడా ఉంది. ఈ ఎపిసోడ్ కార‌ణంగా టీడీపీ బెదిరిపోతోంద‌ని - ఆ పార్టీ అధినేత నారా చంద్ర‌బాబు నాయుడు అమ‌రావతికి వెళ్లిపోవ‌డం వెనుక రీజ‌న్ కూడా ఇదేన‌ని అంటుంటారు. తాజాగా రేవంత్ రెడ్డి ఇంట్లో సోదాలు అనంత‌రం ఈ కేసు మ‌ళ్లీ తెర‌మీద‌కు వ‌చ్చింది. అయితే, ఈ కేసు విష‌యంలో టీడీపీ నేత‌లు భ‌య‌ప‌డుతూనే...భ‌యం లేద‌ని చెప్తున్నార‌ని వ్యాఖ్యానిస్తున్నారు.

టీడీపీ సీనియర్ నేత - ఏపీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ ప్రజలకు - రైతులకు అన్యాయం జరుగుతున్నా ఏపీ ప్ర‌తిప‌క్ష నేత జగన్ - జ‌న‌సేన నేత‌ పవన్ నోరెత్తడం లేదని ఆరోపించారు. చంద్రబాబును విమర్శించడానికే జగన్-పవన్ తమ సమయాన్ని వెచ్చిస్తున్నారని... రైతులపై ఢిల్లీలో జరిగిన దాడిపై ఆ ఇద్దరు ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. కన్నా-జగన్-పవన్ ఈ ముగ్గురు ఏపీలో ప్రేమించుకుంటున్నారంటూ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సెటైర్లు వేశారు. 30 సీట్ల కంటే పెరగనీయమని సోము వీర్రాజు అంటే... చంద్రబాబును అధికారంలోకి రానిచ్చేదే లేదని పవన్ అంటున్నారని... చంద్రబాబు అధికారంలోకి రానీయమంటే... 12 కేసులున్నా జగన్ అధికారంలోకి రావాలని బీజేపీ-పవన్ కొరుకుంటున్నారా? అని ప్రశ్నించారు.

ఇదే సంద‌ర్భంగా హ‌ఠాత్తుగా రాజ‌కీయ క‌క్ష‌ల‌పై సోమిరెడ్డి స్పందించారు. కర్ణాటక - తెలంగాణలో ఎన్నికల సందర్భంగా ఐటీ దాడులు ఎలా చేయిస్తున్నారో చూస్తున్నాం... వ్యవస్ధలను గుప్పెట్లో పెట్టుకుని ప్రతిపక్షాలను సాధించాలని కేంద్రం చూస్తోందని ఆరోపించారు. జగ్గారెడ్డిని జైలుకు పంపారు - రేవంత్‌ రెడ్డిని హింసిస్తున్నారు - కర్ణాటకలో డీకే శివకుమార్ పై ఐటీ దాడులు చేశారు... ఎమర్జెన్సీ సమయంలోనూ ఈ తరహాలో అధికార దుర్వినియోగం జరగలేదని మండిపడ్డారు. ఓటుకు నోటు కేసులో ఎన్ని విచారణలు జరిపినా - ఏం చేసినా... మాకేం ఇబ్బంది లేదన్నారు. అయితే, బాబు ద‌గ్గ‌రి మ‌నిషిగా పేరున్న సోమిరెడ్డి ఈ వ్యాఖ్య‌లు చేసిన‌ప్ప‌టికీ...రేవంత్ విచార‌ణ‌ను టీడీపీ పెద్ద‌లు - ఏపీ ప్ర‌భుత్వం జాగ్ర‌త్త‌గా గ‌మ‌నిస్తోంద‌ని అంటున్నారు. హైద‌రాబాద్‌ లో రేవంత్ రెడ్డి విచార‌ణ జ‌రుగుతుండ‌గా... ఆ కార్యాల‌యం వ‌ద్ద ఏపీ ఇంటెలిజెన్స్‌, స్పెష‌ల్ బ్రాంచ్ పోలీసులు ప్ర‌త్యేకంగా ఆరాతీయడం ఇందుకు నిద‌ర్శ‌నం అంటున్నారు.