Begin typing your search above and press return to search.

ఈ సారీ రైల్వే జోన్ మాట లేదు!

By:  Tupaki Desk   |   1 Feb 2017 9:26 AM GMT
ఈ సారీ రైల్వే జోన్ మాట లేదు!
X
ఏపీకి ప్ర‌త్యేక రైల్వే జోన్ క‌ల‌గానే మార‌నుందా? అంటే అవున‌నే చెప్ప‌క త‌ప్ప‌దు. రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత ఏపీకి ప్ర‌త్యేక హోదా స‌హా ప్ర‌త్యేక రైల్వే జోన్‌ ను కేటాయిస్తామంటూ నాటి యూపీఏ ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. ఈ అంశాల‌ను విభ‌జన చ‌ట్టంలో చేర్చ‌కున్నా... పార్ల‌మెంటు సాక్షిగా నాటి ప్ర‌ధాని హోదాలో మ‌న్మోహ‌న్ సింగ్ ఈ అంశాల‌ను ప్ర‌క‌టించారు. అయితే గ‌డ‌చిన ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ డ‌బుల్ డిజిట్ దాట‌క‌పోవ‌డం, మేదీ మేనియాతో బీజేపీ సంపూర్ణ మెజారిటీ సాధించ‌డం జ‌రిగిపోయింది. ఈ క్ర‌మంలో ఏపీకి ప్ర‌క‌టించిన అన్ని అంశాల‌ను కూడా తాము నెర‌వేర‌తాయ‌న్న భావ‌న క‌లిగింది. ఎందుకంటే... నాడు ఏపీకి ప్ర‌త్యేక హోదా ఐదేళ్లు ప్ర‌క‌టిస్తామ‌ని మ‌న్మోహ‌న్ అంటే... ఐదేళ్లు చాల‌దు... ప‌దేళ్ల పాటు ప్ర‌క‌టించాలి అని నాడు విపక్ష ఎంపీగా ఉన్న ప్ర‌స్తుత కేంద్ర మంత్రి వెంక‌య్య‌నాయుడు డిమాండ్ చేశారు. ఈ క్ర‌మంలో వెంక‌య్య పార్టీ అధికారంలోకి వ‌చ్చిన నేప‌థ్యంలో ఏపీకి అనుకున్న దానికంటే... మెరుగైనవే వ‌స్తాయ‌ని అంతా అనుకున్నారు.

అయితే బీజేపీ స‌ర్కారు ప్లేటు ఫిరాయించేసింది. ప్ర‌త్యేక హోదా మాట‌ను అట‌కెక్కించిన మోదీ స‌ర్కారు... ప్ర‌త్యేక ప్యాకేజీ పేరిట అర‌కొర ల‌బ్ధిని మాత్ర‌మే ప్ర‌క‌టించింది. దీనిపై ప్ర‌స్తుతం రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఉద్య‌మం కొన‌సాగుతోంది. అదే స‌మ‌యంలో విశాఖ కేంద్రంగా ఏపీకి ప్ర‌త్యేక రైల్వే జోన్ కేటాయించాల‌ని రాష్ట్ర ప్ర‌జ‌లు డిమాండ్ చేస్తున్నారు. ప్ర‌జ‌ల‌తో పాటు అటు అధికార‌ - ఇటు విప‌క్ష పార్టీలు కూడా ప్ర‌త్యేక రైల్వే జోన్‌ ను డిమాండ్ చేస్తున్నాయి. ఈ క్ర‌మంలో నిరుటి బ‌డ్జెట్‌ లోనే దీనిపై ప్ర‌క‌ట‌న వ‌స్తుంద‌ని అంతా భావించారు. అయితే నాడు ఏపీ ప్ర‌జ‌ల ఆశ‌ల‌పై నీళ్లు చ‌ల్లిన కేంద్రం... ఈ ద‌ఫా కూడా మొండిచెయ్యే చూపించింది.

కాసేప‌టి క్రితం పార్ల‌మెంటులో బ‌డ్జెట్‌ ను ప్ర‌వేశ‌పెట్టిన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ... ఏపీకి ప్ర‌త్యేక రైల్వే జోన్ అంశాన్ని మాత్రం ప్ర‌స్తావించ‌లేదు. న‌వ్యాంధ్ర నూత‌న రాజ‌ధాని అమ‌రావ‌తి కోసం భూములిచ్చిన రైతుల అంశాన్ని ప్ర‌స్తావించిన జైట్లీ... ఏపీకి ప్ర‌త్యేక రైల్వే జోన్ అంశాన్ని మాత్రం ప్ర‌స్తావించ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. అంటే ఈ విష‌యం అస‌లు కేంద్రం జాబితాలోనే లేద‌ని తేట‌తెల్ల‌మైపోయింది. ఏపీకి ప్ర‌త్యేక రైల్వే జోన్‌ ను కేటాయించేందుకు కేంద్రం సుముఖంగా లేద‌ని చెప్ప‌డానికి ఇంత‌కంటే నిద‌ర్శన‌మేమీ లేద‌న్న వాద‌న కూడా వినిపిస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/