Begin typing your search above and press return to search.

మహిళా దినోత్సవం సరే.. మగాళ్ల డే మాటేంది?

By:  Tupaki Desk   |   7 March 2016 6:30 PM GMT
మహిళా దినోత్సవం సరే.. మగాళ్ల డే మాటేంది?
X
అందరూ సమానమే. కాకుంటే కొందరు ఎక్కువ సమానం. మరికొందరు తక్కువ సమానం. ఆశ్చర్యంగా అనిపించినా ఇది నిజం. ప్రపంచంలో ఆడా.. మగా సమానం అని చాలామంది వాదిస్తుంటారు. నిజానికి అంత పెద్ద వాదనలేమీ లేకుండా కూడా అవునని ఒప్పేసుకోవచ్చు. కానీ.. ఆ మాత్రం దానికి భారీ చర్చలే జరుపుతుంటారు. కిందామీదా పడుతుంటారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. మగాళ్లతో పాటు.. ఆడాళ్లను సమానంగా చూడాలని వాదించి.. పోరాడే వాళ్లలో ఆడోళ్లే కాదు మగాళ్లు కూడా ఉంటారు.

అదే సమయంలో మగాళ్ల గురించి ఆలోచించే మగాడే కనిపించడు. అంతదాకా ఎందుకు మగాడి సమస్యల మీద మాట్లాడే ఆడోళ్లు ఒక్కరంటే ఒక్కరున్నారా? ఆడాళ్ల గురించి గ్యాలెన్ల.. గ్యాలెన్ల కన్నీటిని కార్చే పురుషపుంగవులు.. తమ జాతికి చెందిన వారి వెతల గురించి ఎందుకు పట్టవన్నది ఒక పట్టానా అర్థం కాదు. నిజానికి ఆ దిశగా ఆలోచించే నాథుడు కూడా కనిపించడు.

ప్రపంచంలో మహిళలు ఎన్ని కష్టాలు పడుతున్నారో తెలుసా? అంటూ లెక్చర్లు దంచేస్తుంటారు. నిజానికి ఆడోళ్లు మాత్రమేనా? మగాళ్లు ఇబ్బంది పడటం లేదా? బాధలు.. వేదనలు చెందే మగాళ్లు ఏమైనా తక్కువా? ఈగో పరదా చాటున మగాడు ఉండిపోయి.. తన బాధల్ని తానే గుండెల్లో దాచేసుకుంటూ ఉంటాడు. మహిళా దినోత్సవం రోజున ధూంధాం చేసే వారంతా.. పురుషుల దినోత్సవం గురించి ఒక్క మాట కూడా మాట్లాడరు.

మహిళా దినోత్సవాన్ని భుజాన వేసుకొని మరీ ప్రచారం చేసే మగమహారాజుల్లో ఎంతమందికి ఫురుషుల దినోత్సవం గురించి కానీ.. ఆ డేట్ గురించి చప్పున చెప్పేవాళ్లు ఎంతమంది అని ప్రశ్న వేసుకుంటే షాకింగ్ సమాధానం రావటం ఖాయం. దీన్ని చదువుతున్న వాళ్లలో ఎంతమందికి పురుషుల దినోత్సవం ఎప్పుడన్న విషయం తెలుసన్నది ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది. మహిళా దినోత్సవం మార్చి 8 అన్నది తెలిసిందే.. మరి పురుషుల దినోత్సవం ఎప్పుడు? అంటే క్వశ్చన్ మార్క్ ఫేస్ పెట్టాల్సిందే. మరి.. ఇప్పుడైనా తెలుసుకుంటారా? పురుషుల దినోత్సవం నవంబరు 19న అని. మహిళల ఉద్దరణ కోసం శ్రమించే మగాళ్లంతా వాళ్లకూ ఓ దినం ఉందని.. దానికి ఎంతోకొంత ప్రాధాన్యత ఇచ్చి.. మగాడు ఎదుర్కొనే సమస్యల మీద గళం విప్పాల్సిన అవసరం ఉందని గుర్తిస్తే బాగుంటుంది.