Begin typing your search above and press return to search.

షర్మిల పాదయాత్రపై హైకోర్టు కీలక ఆదేశాలు

By:  Tupaki Desk   |   14 Dec 2022 3:27 PM GMT
షర్మిల పాదయాత్రపై హైకోర్టు కీలక ఆదేశాలు
X
వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి హైకోర్టును ఆశ్రయించారు. పాదయాత్రకు వెళ్లకుండా పోలీసులు అడ్డుకుంటున్నారంటూ షర్మిల హైకోర్టులో లంచ్ మోషన్ పిటీషన్ దాఖలు చేశారు. ఇంటి నుంచి బయటకు రానివ్వకుండా పోలీసులు అడ్డుకుంటున్నారని పిటీషన్ లో పేర్కొన్నారు.

నిన్న పాదయాత్రకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా ఇంటి నుంచి పోలీసులు బయటకు రానివ్వడం లేదని పిటీషన్ లో తెలిపారు. షర్మిల పిటీషన్ పై విచారించిన హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.

వైఎస్ షర్మిల పాదయాత్రపై ఆంక్షలు పెట్టవద్దని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. పాదయాత్రకు వెళ్లకుండా ఇంటి ముందు బ్యారికేడ్లు వేసి పోలీసులు అడ్డుకుంటున్నారని, షర్మిల హైకోర్టులో వేసిన పిటీషన్ పై విచారణ జరిగింది. దీంతో షర్మిల బయటకు వెళ్లకుండా ఎలాంటి ఆంక్షలు పెట్టవద్దని.. వెంటనే ఇంటి ముందు ఉన్న బారికేడ్లను తొలగించాలని ఆదేశాలు జారీ చేసింది.నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చని చెప్పింది.

ఎంత సహనంతో ఉన్నా.. తమపై పోలీసుల వేధింపులు ఆగడం లేదని.. లంచ్ మోషన్ పిటీషన్ వేసేందుకు న్యాయవాదితో కలిసి హైకోర్టుకు వెళ్లిన తనను పోలీసులు అడ్డుకున్నారని.. ఇది అన్యాయమని విమర్శించారు. కుటుంబ పరంగా ఉన్న పనులు కూడా చేసుకోవడానికి తనను పోలీసులు బయటకు అనుమతించడం లేదని షర్మిల ఆరోపించారు.

తెలంగాణ పోలీస్ వ్యవస్థ పూర్తిగా కేసీఆర్ చెప్పుచేతల్లోకి పోయిందని.. కేసీఆర్ చేతుల్లో కీలు బొమ్మల్లాగా పోలీసులు మారిపోయారంటూ షర్మిల ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఏ అధికారంతో తనను పోలీసులు కట్టడి చేస్తున్నారని.. ఆ అదికారం మీకు ఎవరు ఇచ్చారని ప్రశ్నించారు.

పాదయాత్ర చివరి దశకు చేరుకుందని.. ఎక్కడైతే పోలీసులు ఆపేశారో అక్కడ నుంచి ప్రారంభించనున్నట్లు షర్మిల తెలిపారు. ఆమరణ దీక్ష వల్ల అనారోగ్యం పాలవడంతో వైద్యుల సూచన మేరకు విశ్రాంతి తీసుకుంటాని.. అందుకే పాదయాత్రకు గ్యాప్ ఇస్తున్నట్టు షర్మిల తెలిపారు. కోర్టు తీర్పు గౌరవించి కేసీఆర్ తన పాదయాత్రను అడ్డుకోకూడదన్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.