Begin typing your search above and press return to search.

బూస్ట‌ర్ డోస్ వేసుకున్నా.. ఫ‌లితం సున్నా!

By:  Tupaki Desk   |   12 Dec 2021 8:30 AM GMT
బూస్ట‌ర్ డోస్ వేసుకున్నా.. ఫ‌లితం సున్నా!
X
క‌రోనా మూడో వేవ్ రాబోతుంది.. కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నాయి.. దీన్ని అడ్డుకోవాలంటే బూస్ట‌ర్ డోస్ ఓ మంచి మార్గ‌మ‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. భార‌త్‌లో ఇప్ప‌టికే రెండో డోసుల వ్యాక్సిన్ పూర్తి అయిన వాళ్ల‌కు మూడో డోస్‌గా బూస్ట‌ర్ డోస్ అందించేందుకు కేంద్రం ఆలోచ‌న చేస్తోంది. కానీ ఇప్పుడు బూస్ట‌ర్ డోస్ వేసుకున్నా ఫ‌లితం సున్నానే అనే ప‌రిస్థితులు క‌నిపిస్తున్నాయి. అందుకు అమెరికాలో బూస్ట‌ర్ డోస్ వేసుకున్న వాళ్ల‌కు కూడా ఒమిక్రాన్ సోక‌డ‌మే కార‌ణం. దీంతో బూస్ట‌ర్ డోస్‌పై మ‌ళ్లీ చ‌ర్చ మొద‌లైంది. మ‌న దేశంలోనూ క్ర‌మంగా ఒమిక్రాన్ కేసుల సంఖ్య పెరుగుతోంది. దీంతో బూస్ట‌ర్ డోస్ ప‌నితీరుపై తాజాగా ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతోంది.

అగ్రరాజ్యం అమెరికాలో క‌రోనా సృష్టిస్తోన్న విలయం అంతా ఇంతా కాదు. అక్క‌డ అత్యున్నత వైద్య సదుపాయాలు అందుబాటులో ఉన్నప్పటికీ అత్యధిక మంది ఈ మహమ్మారి కాటుకు బలైపోయిన విషయం తెలిసిందే. ఇంకా ఆ మ‌హ‌మ్మారి అమెరికాను వెంటాడుతూనే ఉంది. ఇటీవ‌ల మ‌ళ్లీ రోజుకు స‌గ‌టున ల‌క్ష‌కు పైగా కొవిడ్ కేసులు వెలుగు చూస్తున్నాయి. అంతే కాకుండా ఒమిక్రాన్‌ వేరియెంట్‌ కేసులు కూడా క్రమంగా పెరుగుతుండటం కలకలం రేపుతోంది. ఇప్పటివరకు అమెరికాలోని 22 రాష్ట్రాలకు ఈ కొత్త వేరియంట్‌ వ్యాపించినట్టు సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌ (సీడీసీ) వెల్లడించింది. అక్క‌డ ఇప్ప‌టివ‌ర‌కూ 43 ఒమిక్రాన్‌ కేసులు నమోదయ్యాయి. అందులో 34మంది వ్యాక్సినేషన్‌ పూర్తయినవారే ఉన్నారు. వీరిలో 14 మందికి బూస్టర్‌ డోసు కూడా పూర్తయినా ఒమిక్రాన్‌ బారిన పడటం గమనార్హం.

కొవిడ్‌ 19 కేసులు అమెరికాను ఇంకా వణికిస్తున్నాయి. గత వారంతో పోలిస్తే ఈ వారంలో ఇన్ఫెక్షన్‌ ఉద్ధృతి పెరిగినట్టు అధికారులు గుర్తించారు. ఈ వారంలో అమెరికాలో రోజుకు సగటున 1,20,000 కేసులు బయటపడగా.. గత వారంతో పోలిస్తే ఇది దాదాపు 40శాతం అధికం కావడం గమనార్హం. రోజుకు దాదాపు 7500 మంది ఆసుప‌త్రుల్లో చేరుతున్నారు. అమెరికాలో శుక్రవారం వరకు 200 మిలియన్ల మందికి పైగా (60.6శాతం) పూర్తిస్థాయిలో వ్యాక్సిన్ పూర్త‌వ‌గా.. 51.7 మిలియన్ల మందికి బూస్టర్‌ డోసులు కూడా పూర్తయింది. అయిన‌ప్ప‌టికీ అక్క‌డ మ‌ళ్లీ క‌రోనా తీవ్ర ఉద్ధృతి దాల్చ‌డం ఆందోళ‌న క‌లిగిస్తోంది.